గమ్యం, వేదం... కష్టమేనా క్రిష్?
టాలీవుడ్‌లో ఎంతో మంది కమర్షియల్ దర్శకులు ఉన్నారు, అయితే వారిలో సెన్సిబుల్, కమర్షియల్ దర్శకులు తక్కువ మంది ఉంటారు.
By: Ramesh Palla | 8 Sept 2025 6:00 PM ISTటాలీవుడ్‌లో ఎంతో మంది కమర్షియల్ దర్శకులు ఉన్నారు, అయితే వారిలో సెన్సిబుల్, కమర్షియల్ దర్శకులు తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో ఈయన ఒకరు అనే పేరును కెరీర్ ఆరంభంలోనే దక్కించుకున్న దర్శకుడు క్రిష్. గమ్యం, వేదం వంటి సినిమాలతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న క్రిష్ ఆ తర్వాత 'కృష్ణం వందే జగద్గురుమ్' సినిమాతో వచ్చారు. ఆ సినిమా కమర్షియల్‌గా పెద్దగా ఆడకున్నా ఒక మంచి సోషల్ మెసేజ్‌తో, కంటెంట్ ఓరియంటెడ్ మూవీని తీశాడు అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇప్పుడు కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాను కల్ట్ మూవీ అంటూ చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సినిమాలోని డైలాగ్స్, హీరో పాత్ర, ఇతర పాత్రల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే క్రిష్ ఈ మధ్య కాలంలో సినిమాల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేస్తున్నట్లు అనిపిస్తుంది.
ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో...
క్రిష్ దర్శకత్వంలో ఈ మధ్య వచ్చిన సినిమాలే చాలా తక్కువ. 2017లో బాలకృష్ణతో రూపొందించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ 2019లో వచ్చిన ఎన్టీఆర్ : కథానాయకుడు, ఎన్టీఆర్ : మహానాయకుడు సినిమాలు నిరాశ పరిచాయి. మధ్యలో మణికర్ణిక సినిమాను చేసినప్పటికీ ఆ సినిమా నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మెగా హీరోతో కొండపొలంను రూపొందించాడు. ఆ సినిమా కమర్షియల్‌గా ఆడలేదు. కనీసం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుందా అంటే అది కూడా లేదు అని చెప్పక తప్పదు. ఒక నవల ఆధారంగా రూపొందిన ఆ సినిమా మెప్పించడంలో విఫలం అయింది. దర్శకుడు క్రిష్ తన మార్క్‌ను ఆ సినిమాలో చూపించలేదు అంటూ రివ్యూలు రావడంతో పాటు, కమర్షియల్‌గా నిరాశ పరిచింది.
హరి హర వీరమల్లు నుంచి ఔట్..
కొండపొలం విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా హరి హర వీరమల్లు సినిమాను మొదలు పెట్టాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వీరమల్లు వదిలేసిన క్రిష్ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా వెంటనే 'ఘాటీ' సినిమాను మొదలు పెట్టాడు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు ఆరు నెలలు అదుగో.. ఇదుగో అంటూ ఊరించిన ఘాటీ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి పెద్దగా లేదు. క్రిష్ మరోసారి ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యాడు. అయితే ఆయన గత చిత్రాల మాదిరిగా కనీసం విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దాఖలాలు కూడా లేవు. దాంతో క్రిష్ ను అభిమానించే వారు, ఆయన సినిమాలను ఇష్టపడే వారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘాటీ ఫలితం వారికి తీవ్రంగా నిరాశ ను మిగిల్చిందని కామెంట్స్ చేస్తున్నారు.
అనుష్క ఘాటీ సినిమాకు నెగిటివ్ రివ్యూలు
గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుమ్ వంటి సెన్సిబుల్ సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకుని కమర్షియల్ యాంగిల్ లో సినిమాలను రూపొందించిన దర్శకుడు క్రిష్ ఇలా గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో కాన్సెప్ట్‌ను ఎంపిక చేసుకోవడం ఏంటో అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు చాలానే ఉన్నాయి. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప సినిమా సైతం కాస్త అటు ఇటుగా ఘాటీ మాదిరిగానే ఉంటుంది అనేది చాలా మంది అభిప్రాయం. క్రిష్ నుంచి చాలా బెటర్ కాన్సెప్ట్‌ను, సినిమాను ఆశించిన ప్రతి సారి నిరాశ పరుస్తూనే ఉన్నాడు. ఆయన మళ్లీ తన మార్క్ సినిమాలను తీస్తే తప్ప ఇండస్ట్రీలో కొనసాగడం కష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో క్రిష్ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ తో క్రిష్ తదుపరి సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. కనీసం ఆ సినిమా అయినా ఆకట్టుకుంటుందేమో చూడాలి.
