కెరీర్ బెస్ట్ మూవీ పై క్రిష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఘాటీ ప్రమోషన్స్ లో భాగంగానే క్రిష్ ను మీ కెరీర్ బెస్ట్ ఫిల్మ్ ఏంటని అడిగితే ఎవరూ ఊహించని సినిమా పేరును చెప్పి అందరికీ షాకిచ్చారు.
By: Sravani Lakshmi Srungarapu | 4 Sept 2025 6:28 PM ISTటాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో క్రిష్ జాగర్లమూడి కూడా ఒకరు. మొదటి సినిమా గమ్యంతోనే తన సత్తా చాటుకుని అందరి దృష్టిని తనవైపుకు మరల్చుకున్నారు క్రిష్. ఒక కొత్త డైరెక్టర్ నుంచి అంత మంచి సినిమా రావడం చూసి ఆ టైమ్ లో అందరూ ఆశ్చర్యపోయారు కూడా. టాలీవుడ్ లోని బెస్ట్ ఫిల్మ్స్ లో గమ్యం ప్లేస్ సుస్థిరంగా ఉండేలా ఆ సినిమాను తీశారు క్రిష్.
మొదటి సినిమాతోనే సత్తా చాటిన క్రిష్
గమ్యం తర్వాత వేదం, కంచె, కృష్ణం వందే జగద్గురం, గౌతమీపుత్ర శాతకర్ణి, యన్.టి.ఆర్ కథానాయకుడు, యన్.టి.ఆర్ మహానాయకుడు, కొండపొలం ఇలా పలు సినిమాలు చేశారు. ప్రస్తుతం అనుష్కతో కలిసి ఘాటీ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసిన క్రిష్ ఆ సినిమాను సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఘాటీ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటూ క్రిష్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు.
కెరీర్ బెస్ట్ మూవీ అదే!
ఘాటీ ప్రమోషన్స్ లో భాగంగానే క్రిష్ ను మీ కెరీర్ బెస్ట్ ఫిల్మ్ ఏంటని అడిగితే ఎవరూ ఊహించని సినిమా పేరును చెప్పి అందరికీ షాకిచ్చారు. తన కెరీర్లోని భారీ డిజాస్టర్లలో ఒకటైన యన్.టి.ఆర్ పేరు చెప్పి ఆశ్చర్యపరిచారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామరావు జీవిత కథ ఆధారంగా క్రిష్ యన్.టి.ఆర్ అనే టైటిల్ తో రెండు సినిమాలను తీయగా ఆ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగానే నిలిచాయి.
ఆ రెండు సినిమాల్లో డైరెక్టర్ గా క్రిష్ తన సత్తాను చాటినప్పటికీ, ఆ సినిమా రిలీజైన టైమ్ మరియు సినిమాలో కొన్ని కీలక అంశాలను విస్మరించడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ బోల్తా కొట్టింది. అలాంటి సినిమాను క్రిష్ తన బెస్ట్ మూవీ అని చెప్పడం అందరికీ ఆశ్చర్యం కలిగించేదే. కానీ క్రిష్ చెప్తున్న దాన్ని బట్టి, యన్.టి.ఆర్ సినిమా తనకు ఎమోషనల్ గా చాలా పెద్ద సవాల్ గా నిలిచిందని, ఎమోషన్స్ విషయంలో ఆ సినిమా కోసం చాలా కష్టపడి, మైండ్, హార్ట్ పెట్టి మరీ ఆ సినిమాను తీశానని అందుకే దాన్నే తన బెస్ట్ వర్క్ గా భావిస్తానని క్రిష్ చెప్పారు.
