Begin typing your search above and press return to search.

40 ఏళ్ల క్రితమే ప్రైవేట్ జెట్- సొంత‌ ఓడలు ఉన్న‌ ద‌క్షిణాది న‌టి ఎవ‌రో తెలుసా?

నేటి ఆధునిక సినీ ప్రపంచంలో సెలబ్రిటీలు విలాసవంతమైన జీవనశైలిని గడపడం.. ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు ధరించడం.. ప్రైవేట్ జెట్ విమానాలలో ప్రయాణించడం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం.

By:  Sivaji Kontham   |   20 May 2026 1:00 AM IST
40 ఏళ్ల క్రితమే ప్రైవేట్ జెట్- సొంత‌ ఓడలు ఉన్న‌ ద‌క్షిణాది న‌టి ఎవ‌రో తెలుసా?
X

నేటి ఆధునిక సినీ ప్రపంచంలో సెలబ్రిటీలు విలాసవంతమైన జీవనశైలిని గడపడం.. ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు ధరించడం.. ప్రైవేట్ జెట్ విమానాలలో ప్రయాణించడం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. ప్రస్తుత తరం నటీమణులలో నయనతార వంటి టాప్ స్టార్స్ సొంతంగా ప్రైవేట్ జెట్ కలిగి ఉండి వార్తల్లో నిలుస్తున్నారు. అయితే నేటి తరం తారల కంటే ఎంతో ముందే దాదాపు 40 సంవత్సరాల క్రితమే దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరోయిన్ సొంతంగా ప్రైవేట్ జెట్ విమానాన్ని, ఓడ(షిప్స్‌)లను కలిగి ఉన్నారనే అరుదైన నిజం చాలా మందికి తెలియదు. ఆ వైభవం సుసంపన్నమైన బ్యాక్‌గ్రౌండ్ కలిగిన ఏకైక నటి మరెవరో కాదు.. లెజెండరీ న‌టి కె. ఆర్. విజయ. టెక్నాలజీ కానీ.. గ్లామర్ పబ్లిసిటీ కానీ లేని ఆ రోజుల్లోనే ఒక సౌత్ ఇండియన్ హీరోయిన్ అంతటి రాయల్ లైఫ్‌స్టైల్‌ను అనుభవించడం నిజంగా ఒక అద్భుతమైన రికార్డ్.

కె. ఆర్. విజయ అనగానే సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేషన్ వంటి నాటి చిత్ర పరిశ్రమను శాసించిన మహామహుల సరసన నటించిన అభినయనేత్రిగా తెలుగు, తమిళ ప్రజలకు సుపరిచితులు. కేవలం పాత తరం చిత్రాలకే పరిమితం కాకుండా.. మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి తరం టాప్ హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. నటసింహా నందమూరి బాలకృష్ణ చిత్రాలలో తల్లిగా అద్భుత నటనను కనబరిచారు. ముఖ్యంగా బాలయ్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన `భైరవద్వీపం` చిత్రంలో తల్లి పాత్రలో ఆమె చూపిన హావభావాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. ఆ తర్వాత లెజెండరీ దర్శకుడు బాపు తెరకెక్కించిన `శ్రీరామరాజ్యం` చిత్రంలోనూ, బాలయ్య బ్లాక్‌బస్టర్ హిట్ `సింహా`లోనూ సీనియ‌ర్ న‌టి విజ‌య‌ తల్లి పాత్రలో మెప్పించారు. అంతేకాకుండా యువ హీరో నాగచైతన్య సూపర్ హిట్ చిత్రం `100ప‌ర్సంట్ లవ్లో`నూ ఆమె ఒక ముఖ్యమైన సహాయక పాత్రలో కనిపించి మెప్పించడం విశేషం.

వెట‌ర‌న్ న‌టి వ్యక్తిగత ప్రొఫైల్ .. నాటి వైభవాన్ని పరిశీలిస్తే షూటింగులకు వెళ్లాలంటే సొంత జెట్ విమానంలో ప్రయాణించిన అరుదైన చరిత్ర కె. ఆర్. విజయ సొంతం. ఈ విషయాన్ని ఇటీవలే ఆమె సోదరి, నటి అయిన కె. ఆర్. వత్సల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమా షూటింగుల కోసం ముంబై, మధురై, కొచ్చి, బెంగళూరు, మంగళూరు వంటి నగరాలకు తన సొంత ప్రైవేట్ విమానంలోనే కె. ఆర్. విజయ ప్రయాణించేవారని ఆమె స్వయంగా ఒక సందర్భంలో గుర్తుచేసుకున్నారు. కేవలం సొంత విమానమే కాదు.. త‌న‌ కుటుంబానికి ఏకంగా సొంత ఓడలు కూడా ఉండేవని.. అంతటి అత్యంత వైభవమైన రాయల్ లైఫ్‌స్టైల్ గడిపినా ఆమెలో ఎప్పుడూ గర్వం లేదా అహంకారం కనిపించేది కాదని.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే హుందాతనం ఆమె గొప్పతనమని వత్సల పేర్కొన్నారు. ఆ రోజుల్లో కేఆర్ విజ‌య‌ చూపిన వినయం వల్లే అంత పెద్ద ధనికురాలనే విషయం పరిశ్రమలోని కొద్దిమంది సహచరులకు తప్ప ఎవరికీ తెలిసేది కాదు.

కె. ఆర్. విజయ కేవలం 15 సంవత్సరాల చిన్న వయసులోనే 1963లో వచ్చిన `కరిపగం` అనే తమిళ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆరు దశాబ్దాల పాటు సాగిన తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎంతో హుందా అయిన నటిగా దక్షిణాదిలోని అన్ని భాషలలోనూ వరుస అవకాశాలు అందుకున్నారు. ముఖ్యంగా 1970ల కాలంలో దక్షిణ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో కె. ఆర్. విజయ అగ్రస్థానంలో నిలిచారు. ఆ రోజుల్లో ఈ న‌టి క్రేజ్ ఎంతగా ఉండేదంటే.. నాటి అగ్ర హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఆమె ఎదిగారు. వెండితెరపై ఆమె చిరునవ్వుకు ముగ్ధులైన తమిళ, తెలుగు అభిమానులు ఆమెను ప్రేమతో `పున్నగై అరసి` (చిరునవ్వుల రాణి) అని పిలుచుకునేవారు.

వెట‌ర‌న్ న‌టి ప్రశాంతమైన ముఖవర్చస్సు, దైవికమైన రూపం కారణంగా భక్తిరస చిత్రాలలో దేవతల పాత్రలకు, ముఖ్యంగా `ప‌రాశక్తి` వంటి దైవిక పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. తన సుదీర్ఘ ప్రయాణంలో దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించిన కె. ఆర్. విజయ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా తన ముద్ర వేశారు. భారతదేశంతో పాటు శ్రీలంక దేశంలోనూ ఎంతో ఆదరణ పొందిన పలు టెలివిజన్ సీరియళ్లలో నటించి మెప్పించారు. ఆరు దశాబ్దాల సినీ ప్రయాణం, సొంతంగా ఓడలు - విమానాలు ఉన్నా సాదాసీదాగా జీవించిన ఈ న‌టి జీవితం.. నేటి తరం సోషల్ మీడియా పబ్లిసిటీ స్టార్లకు.. నటీనటులకు క‌నువిప్పు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.