Begin typing your search above and press return to search.

మ్యూజిక్ కంపోజ‌ర్ల‌కు విలువ లేకుండా పోయింది.. ఫైర్ అయిన కోటి

అయితే ఇప్పుడ‌దే విష‌యంపై టాలీవుడ్ సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి ఫైర్ అవుతున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   30 Jan 2026 6:00 PM IST
మ్యూజిక్ కంపోజ‌ర్ల‌కు విలువ లేకుండా పోయింది.. ఫైర్ అయిన కోటి
X

పాత సాంగ్స్ ను రీమిక్స్ చేసి ఇప్పుడు కొత్త‌గా వ‌స్తున్న సినిమాల్లో వాడుకోవ‌డం ఈ మ‌ధ్య బాగా ట్రెండ్ అయిపోయింది. అందుకే కిర‌ణ్ అబ్బ‌వ‌రం కెర్యాంప్ సినిమాలో ఇదేమిట‌మ్మా సాంగ్ ను పెట్టారు. రీసెంట్ గా వ‌చ్చిన భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీలో ఆర‌నీకుమా ఈ దీపం, వెల్లువ‌చ్చి గోదార‌మ్మ సాంగ్స్ లాంటి సాంగ్స్ ను పెట్టారు. ఇక మెగాస్టార్ చిరంజీవి మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు లో సుంద‌రీ అనే సాంగ్ ను పెట్టారు. దీని కోసం ఆయా చిత్ర నిర్మాత‌లు ఒరిజిన‌ల్ సాంగ్ రైట్స్ క‌లిగిన ఆడియో కంపెనీకి కొంత మొత్తంలో డ‌బ్బును చెల్లించ‌డంతో పాటూ, వారి నుంచి ప‌ర్మిష‌న్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

ఆడియో రైట్స్ విష‌యంలో ఇళ‌యరాజా స్ట్రిక్ట్

కానీ తాను కంపోజ్ చేసిన సాంగ్స్ ను వాడుకోవాలంటే ఎవ‌రైనా స‌రే త‌న నుంచి అనుమ‌తితో పాటూ త‌న‌కు కొంత మొత్తంలో డ‌బ్బును కూడా చెల్లించాల‌ని మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా చెప్తున్నారు. ఈ విష‌యంలో చాలా సీరియ‌స్ గా ఉంటూ అవ‌స‌ర‌మైతే కోర్టుకు కూడా వెళ్తున్నారు త‌ప్పించి ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌డం లేదు. తాను సృష్టించిన సాంగ్ పై అంద‌రికంటే ఎక్కువ హ‌క్కు త‌న‌కు మాత్ర‌మే ఉంటుంద‌నే యాంగిల్ లో ఇళ‌య‌రాజా ఫైట్ చేస్తూ వ‌స్తున్నారు.

డెకాయిట్ మూవీలో క‌న్నె పెట్ట‌రో సాంగ్ రీమిక్స్

అయితే ఇప్పుడ‌దే విష‌యంపై టాలీవుడ్ సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి ఫైర్ అవుతున్నారు. ఎవ‌రైనా స‌రే ఒక సాంగ్ ను వాడుకునే ముందు ఆ పాట‌ను కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ ను సంప్ర‌దించాల‌నే జ్ఞానం లేకుండా పోయింద‌ని కోటి అన్నారు. హ‌లో బ్ర‌ద‌ర్ మూవీ కోసం కోటి కంపోజ్ చేసిన క‌న్నె పెట్ట‌రో క‌న్ను కొట్ట‌రో సాంగ్ ను రీసెంట్ గా డెకాయిట్ మూవీ టీజ‌ర్ లో వాడిన విష‌యం తెలిసిందే.

మార్చి 19న డెకాయిట్ రిలీజ్

ఈ విష‌యంపైనే ఆయ‌న మండిప‌డ్డారు. అడివిశేష్, మృణాల్ హీరోహీరోయిన్లుగా షానీల్ డియో ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న డెకాయిట్ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. చిత్ర ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మేక‌ర్స్ రీసెంట్ గా టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌గా, అందులో క‌న్నె పెట్ట‌రో సాంగ్ ను రీమిక్స్ చేసి వాడారు. ఈ విష‌యంలో కోటి మాట్లాడుతూ, తాను కంపోజ్ చేసిన సాంగ్ ను వాడుకుంటున్నట్టు క‌ర్ట‌సీకి కూడా త‌న‌ను ఒక మాట అడ‌గ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

సొంత పాట‌కు డ‌బ్బులు ఎందుకు చెల్లించాలి?

ఓ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన‌ప్పుడు క్రెడిట్ వ‌చ్చినా, సాంగ్స్ కు సంబంధించిన త‌మ‌కు ఎలాంటి హ‌క్కులు లేకుండా నిర్మాత‌లు అగ్రిమెంట్స్ చేసుకుంటున్నార‌ని, అస‌లు మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌కు సంబంధం లేకుండా నిర్మాత‌లు ఆ హ‌క్కుల‌ను ఎలా అమ్ముకుంటార‌ని, తాము కంపోజ్ చేసిన సాంగ్స్ ను రీమిక్స్ చేసుకోవాలంటే మ‌ళ్లీ తామే డ‌బ్బులు ఎందుకు చెల్లించాల‌ని కోటి ప్ర‌శ్నించారు. ఇక డెకాయిట్ విష‌యానికొస్తే క‌నీసం నిర్మాత‌లు త‌న‌ను మాట వ‌ర‌స‌కు కూడా సంప్రదించ‌లేద‌ని, అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో తాను ప‌లు సినిమాలు చేశాన‌ని, అయినా క‌నీసం ఫోన్ చేసి కూడా దీని గురించి అడ‌గ‌లేద‌ని, ఇలా ఫ‌లానా పాట‌ను త‌మ సినిమాలో పెట్టుకుంటామ‌ని అడిగితే ఎవ‌రూ కాద‌న‌మ‌ని, డ‌బ్బులేమీ డిమాండ్ చేయ‌మ‌ని, సినీ ఇండ‌స్ట్రీలో మ్యూజిక్ కంపోజర్ కు విలువ లేకుండా పోయింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలా త‌న పాట‌ను వాడుకున్నందుకు క‌నీసం త‌న పేరు కూడా వేయ‌క‌పోవ‌డం త‌న‌ను మ‌రింత బాధిస్తోంద‌ని ఆయ‌న మండిపడ్డారు.