Begin typing your search above and press return to search.

కొత్త బంగారు లోకం జోడీ టీజర్.. ఇదే ఇప్పుడు కొత్త ట్విస్ట్..

పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే క్యూట్ మూమెంట్స్‌ను కూడా చూపించారు. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో కథ ఒక్కసారిగా మరో మలుపు తిరుగుతుంది.

By:  M Prashanth   |   7 Oct 2026 5:15 PM IST
కొత్త బంగారు లోకం జోడీ టీజర్.. ఇదే ఇప్పుడు కొత్త ట్విస్ట్..
X

కొత్త బంగారు లోకం.. టాలీవుడ్‌ లో ఓ జనరేషన్‌ కు బాగా గుర్తుండిపోయే సినిమా. వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ జోడీకి ఆ సినిమా తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆ హిట్ పెయిర్ మరోసారి కలిసి సందడి చేస్తోంది. అయితే ఈసారి థియేటర్లలో కాదు.. ఓటీటీలో. అదికూడా ఓ క్రైమ్ థ్రిల్లర్‌ తో. వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా వైఫ్ మిస్సింగ్.

ఆహా ఓటీటీలో ఆ సినిమా అక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడు రీసెంట్ గా రిలీజైన టీజర్ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుతోంది. ముఖ్యంగా టీజర్‌ లో చూపించిన ఓ ట్విస్ట్ హైప్ క్రియేట్ చేస్తోంది. హీరోహీరోయిన్ల పెళ్లిచూపుల సీన్‌ తో టీజర్ మొదలవుతుంది. ఇద్దరి జాతకాలు బాగా కలిశాయని శ్వేతా బసు ప్రసాద్ చెప్పగా.. వరుణ్ సందేశ్ తన అభిప్రాయం ఏంటని అడుగుతాడు. ఆ తర్వాత ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది.

పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే క్యూట్ మూమెంట్స్‌ను కూడా చూపించారు. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో కథ ఒక్కసారిగా మరో మలుపు తిరుగుతుంది. పెళ్లి చూపుల్లోనే హీరోయిన్ తాను వర్జిన్ కాదని చెప్పిన విషయాన్ని టీజర్‌ లో ప్రస్తావించారు. కట్ చేస్తే ఆ తర్వాత వరుణ్ సందేశ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేయడం చూపించారు. ఇక్కడి నుంచి అసలు మిస్టరీ మొదలవుతున్నట్లు తెలుస్తోంది.

భార్య నిజంగానే కనిపించకుండా పోయిందా.. ఆమె ఎక్కడికి వెళ్లింది.. అసలు ఏం జరిగిందనే ప్రశ్నలు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. ఇందులో వరుణ్ సందేశ్ బాలు అలియాస్ బాలసుబ్రహ్మణ్యం అనే గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పాత్రలో కనిపించనున్నారు. తన భార్య మిస్సింగ్ అంటూ పోలీసులను ఆశ్రయించడంతో కథ ముందుకు సాగుతుంది. అయితే మిస్సింగ్ కేసులో భర్త రోల్ ఏంటి అనేది మెయిన్ గా మారినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

మిస్టరీతో పాటు సైకలాజికల్, ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా కథలో చూపించినట్లు తెలుస్తోంది. టీజర్‌ లో విజువల్స్ చాలా నేచురల్ గా కనిపిస్తున్నాయి. బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ కూడా సస్పెన్స్‌ ను పెంచేలా ఉంది. చాలా కాలం తర్వాత వరుణ్ సందేశ్, శ్వేత కలిసి కనిపించడం మరో అట్రాక్షన్ గా మారింది. కొత్త బంగారు లోకం తర్వాత మళ్లీ ఆ జోడీని స్క్రీన్‌ పై చూడటం ఫ్యాన్స్ కు స్పెషల్ గా అనిపిస్తోంది.

స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రాన్ని కొమర మీడియా వర్క్స్ బ్యానర్‌ పై శివ కాంతనేని, ఆర్. వెంకటేశ్వరరావు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రవీణ్, మోహిత్, జబర్దస్త్ సత్య శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి అక్టోబర్ 22 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న నా వైఫ్ మిస్సింగ్ ఆ జోడీకి ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో అంతా వేచి చూడాలి.