Begin typing your search above and press return to search.

ఆస్తులు అమ్మి.. కోన వెంకట్ అంత రిస్క్ చేశారా..

టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ నిర్మాతగా తెరకెక్కిన ‘బ్యాండ్ మేళం’ సినిమా ఇటీవల థియేటర్లలోకి వచ్చింది.

By:  M Prashanth   |   1 April 2026 4:38 PM IST
ఆస్తులు అమ్మి.. కోన వెంకట్ అంత రిస్క్ చేశారా..
X

టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ నిర్మాతగా తెరకెక్కిన ‘బ్యాండ్ మేళం’ సినిమా ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. హర్ష్ రోషన్, శ్రీదేవి కాంబినేషన్లో కోర్టు తరువాత వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులలో కొంత బజ్ క్రియేట్ చేసింది. ఇక సినిమా విడుదల తర్వాత చిత్ర యూనిట్ నిర్వహించిన థ్యాంక్యూ మీట్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే క్రమంలో కోన వెంకట్ పడ్డ కష్టం, ఆయన తీసుకున్న రిస్క్ గురించి సన్నిహితులు పంచుకున్న వివరాలు వైరల్ అవుతున్నాయి.

ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్. రవి పాల్గొని కోన వెంకట్ ఈ సినిమా కోసం ఎంతటి రిస్క్ చేశారో వివరించారు. ఒక నిర్మాతగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే క్రమంలో కోన ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను ఆయన గుర్తు చేశారు. సినిమా మధ్యలో ఆగిపోకూడదనే పట్టుదలతో కోన వెంకట్ తన సొంత ఇంటిని, అలాగే కొన్ని ఖరీదైన స్థలాలను కూడా అమ్మేశారని రవి వెల్లడించారు.

30 ఏళ్ల క్రితం ‘తోకలేని పిట్ట’ సినిమా సమయంలో ఇలాగే ఆర్థికంగా దెబ్బతిన్న అనుభవం ఉన్నా, మళ్ళీ ఇప్పుడు ఇంతటి రిస్క్ తీసుకోవడం చూసి తాను ఆశ్చర్యపోయానని రవి పేర్కొన్నారు. అసలు విషయానికి వస్తే, కోన వెంకట్ కేవలం ఒక సినిమా ఫలితం కోసమే కాకుండా, తన టీమ్ భవిష్యత్తు కోసం ఈ రిస్క్ చేశారని రవి తెలిపారు. “కోన గారు కేవలం డబ్బుల కోసమే చూస్తే సినిమా సేఫ్ జోన్ లోకి రాగానే హాయిగా ఉండొచ్చు. కానీ ఆయనకు డైరెక్టర్ లైఫ్, హీరో హీరోయిన్ల కెరీర్ ముఖ్యం. అందుకే సినిమా రిలీజ్ అయ్యాక కూడా బాధ్యతగా పబ్లిసిటీ చేస్తూనే ఉన్నారు” అని రవి కొనియాడారు.

ఈ క్లిష్ట సమయంలో మ్యాంగో రామ్ అండగా నిలబడి కోన వెంకట్ కు తోడుగా ఉన్నారని ఆయన వివరించారు. సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ గురించి మేకర్స్ చెబుతున్న లెక్కల ప్రకారం.. ‘బ్యాండ్ మేళం’ కేవలం 4 రోజుల్లోనే 5.31 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. రిలీజ్ కు ముందు ఫైనాన్షియల్ గా చాలా ఒత్తిడి ఉన్నప్పటికీ, “నాకు ఈ కథ మీద నమ్మకం ఉంది” అని కోన గట్టిగా చెప్పారని రవి తెలిపారు.

ఒక నిర్మాతగా తన బాధ్యతను నెరవేర్చడంలో కోన వెంకట్ వంద శాతం సక్సెస్ అయ్యారని రవి ప్రశంసించారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు.

కోన వెంకట్ లో ఉన్న ఆ పాత పట్టుదలను చూసి, ఆయన నమ్మకాన్ని గౌరవించి మ్యాంగో రామ్ ముందుకు రావడం వల్లే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్ గా రిలీజ్ అయిందని రవి స్పష్టం చేశారు. కేవలం రచయితగానే కాకుండా, నిర్మాతగా కూడా కోన వెంకట్ తన మార్క్ చూపించారని రవి తన ప్రసంగంలో వివరించారు.