కోన వెంకట్కు పాలాభిషేకం
రైటర్లకు పెద్దగా గుర్తింపు దక్కని టాలీవుడ్లో వైభవం చూసిన చాలా కొద్ది మంది రైటర్లలో కోన వెంకట్ ఒకడు.
By: Garuda Media | 15 Oct 2026 4:01 PM ISTరైటర్లకు పెద్దగా గుర్తింపు దక్కని టాలీవుడ్లో వైభవం చూసిన చాలా కొద్ది మంది రైటర్లలో కోన వెంకట్ ఒకడు. వెంకీ, ఢీ, రెడీ, డాన్ శీను, అదుర్స్, కింగ్, దూకుడు, దేనికైనా రెడీ, బలుపు, గీతాంజలి.. ఇలా ఎన్నో హిట్ సినిమాలకు రచన చేసిన ఘనత కోన సొంతం. కానీ ఎలాంటి టెక్నీషియన్ అయినా ఏదో ఒక దశలో ఫేడవుట్ కాక తప్పదు అనడానికి కోన కూడా మినహాయింపు కాలేకపోయాడు.
వరుస ఫ్లాపులు, రాజకీయాల తాలూకు ప్రభావంతో కోన పేరు ఇండస్ట్రీలో వినిపించడమే మానేసింది. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చింది, బ్యాండ్ మేళం లాంటి సినిమాలతో అసోసియేట్ అయినా.. అవి తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో కోన ఇక సినిమాలు ఆపేస్తే బెటర్ అనే కామెంట్లు వినిపించాయి. ఇలాంటి టైంలో ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో మళ్లీ తన ప్రభావాన్ని చాటాడు కోన. ఈ చిత్రానికి ఆయన సమర్పకుడు మాత్రమే కాదు.. స్క్రీన్ ప్లే రైటర్ కూడా.
శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’కు యావరేజ్ టాకే వచ్చినప్పటికీ.. మంచి ఓపెనింగ్సే సాధించింది. వీకెండ్ తర్వాత సినిమా డల్ అయినప్పటికీ.. సినిమా బ్రేక్ ఈవెన్ మార్కునైతే దాటేసినట్లే కనిపిస్తోంది. బయ్యర్లు సేఫ్ అయిపోయారు. సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది. దీంతో టీం అంతా హ్యాపీగా ఉంది. ఈ చిత్రంతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయాన్నందుకున్న జానకి రామ్ మారెళ్ళ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయి.. కోన వెంకట్కు పాలాభిషేకం చేయడం విశేషం.
‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా దర్శకుడు, నిర్మాత అందరూ కొత్తవాళ్లే. ఐతే కోన వెంకటే ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరించి.. ఈ సినిమా ముందుకు కదలడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే సినిమా సక్సెస్లోనూ తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు ఆయన మీద కృతజ్ఞతతో పాలాభిషేకం చేశాడు. కృతజ్ఞత చూపించడానికి రకరకాల మార్గాలుంటాయి కానీ.. ఇలా ఒక దర్శకుడు పాలాభిషేకం చేసి, దండం పెట్టడం అన్నది అరుదైన విషయమే.
