Begin typing your search above and press return to search.

ఢీ, రెడీ రేంజ్ కామెడీ: కోన వెంకట్ బోల్డ్ స్టేట్‌మెంట్!

తాను అందించిన ఆల్‌టైమ్ క్లాసిక్ కామెడీలతో ఈ సినిమాను పోలుస్తూ కోన వెంకట్ పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చారు.

By:  M Prashanth   |   6 Sept 2026 8:43 AM IST
ఢీ, రెడీ రేంజ్ కామెడీ: కోన వెంకట్ బోల్డ్ స్టేట్‌మెంట్!
X

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారెంటీ హీరోగా దూసుకుపోతున్న శ్రీ విష్ణు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ కామ్రేడ్ కళ్యాణ్. జానకిరామ్ మారెళ్ల డైరెక్షన్‌లో వస్తున్న ఈ పీరియడ్ ఎంటర్‌టైనర్‌ను స్టార్ రైటర్ కోన వెంకట్ సమర్పణలో కిట్టు కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా టీజర్ లాంచ్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా కోన వెంకట్ వేదికపై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారాయి.

స్టేజ్ మీద సినీ ప్రముఖులంతా హాజరు కావడంపై స్పందిస్తూ, ఇదేదో అసెంబ్లీలో షో ఆఫ్ స్ట్రెంత్ లాగా బల నిరూపణ కాదని, తన మీద ఉన్న ప్రేమతో వచ్చిన బలగం అని కోన వెంకట్ పేర్కొన్నారు. కష్టంలో, ఆపదలో, ఆనందంలో చేయి వదలకుండా నిలబడే వాళ్లే నిజమైన కామ్రేడ్స్ అని, ఇక్కడ ఉన్న దర్శకులు, నిర్మాతలంతా తన కామ్రేడ్స్ అని చెప్పారు. శ్రీ విష్ణు సినిమా సినిమాకి పదేసి మెట్లు ఎక్కుతూ తన ఆడియన్స్ బేస్, మార్కెట్ పెంచుకుంటున్నాడని, అందుకే తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించామని గర్వంగా ప్రకటించారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి గురించి కోన వెంకట్ భావోద్వేగంగా మాట్లాడారు. కామ్రేడ్ అనే పదం వినగానే మనకు మొదటగా గుర్తొచ్చేది ఆయనేనని, ఆయన వస్తున్నారని చెప్పగానే విష్ణు సినిమా సూపర్ హిట్ అని ఎగ్జైట్ అయ్యాడని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఒక సొంత ఇల్లు లేకుండా లాడ్జి గదిలో ఉంటూ ఆయన నచ్చిన సినిమాలు రాసుకుంటున్నారని వెల్లడించారు. నారాయణమూర్తి గారు అవకాశం ఇస్తే ఆయన రాస్తున్న తదుపరి సినిమాను తానే స్వయంగా ప్రొడ్యూస్ చేస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.

తాను అందించిన ఆల్‌టైమ్ క్లాసిక్ కామెడీలతో ఈ సినిమాను పోలుస్తూ కోన వెంకట్ పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చారు. గతంలో తాను రాసిన ఢీ, రెడీ, దూకుడు, బాద్షా, కింగ్ లాంటి సినిమాల్లోని ఫన్ ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరికీ కామ్రేడ్ కళ్యాణ్ వంద శాతం నచ్చుతుందని చెప్పారు. దీనిపై ట్వీట్ వేసినప్పుడు శ్రీ విష్ణు కూడా అంత కాన్ఫిడెంట్‌గా ఎలా రాశారని కాస్త కంగారు పడ్డాడని, కానీ కంటెంట్‌పై ఉన్న అమితమైన నమ్మకంతోనే ఆ పోలిక పెట్టానని క్లారిటీ ఇచ్చారు.

సామజవరగమన నుంచి చూస్తే శ్రీ విష్ణు చేస్తున్న ప్రతీ సినిమా ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తోందని, ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఇళ్ల నుంచి కాలర్ పట్టి థియేటర్లకు లాక్కొచ్చి కూర్చోబెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వచ్చే పాటలు, ప్రమోషనల్ వీడియోలు మరింత బజ్ క్రియేట్ చేస్తాయన్నారు.

ఇక్కడి నుంచి సరిగ్గా రెండేళ్లలో శ్రీ విష్ణు టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ స్టార్ స్టేటస్ చేరుకుంటాడని, ప్రేక్షకులు ఆయన్ను ఆ స్థాయి స్థానంలో నిలబెట్టబోతున్నారని చెప్పారు. ఈ సినిమాపై ఉన్న పాజిటివ్ వైబ్స్‌తో చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తోంది. కోన వెంకట్ చెప్పిన మాటలు, శ్రీ విష్ణుతో ఆయన మొదటిసారి కలిసి చేస్తున్న ఈ కాంబినేషన్ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక అక్టోబర్ 9న రిలీజ్ కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.