Begin typing your search above and press return to search.

మంత్రి గారి కామెంట్స్ వినగానే జెనీలియా

హైదరాబాద్ వేదికగా జరిగిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025' కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

By:  M Prashanth   |   16 Dec 2025 4:38 PM IST
మంత్రి గారి కామెంట్స్ వినగానే జెనీలియా
X

హైదరాబాద్ వేదికగా జరిగిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025' కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, సురేష్ బాబు, దిల్ రాజు లాంటి దిగ్గజాలు ఇందులో పాల్గొన్నారు. బాలీవుడ్ నుంచి కూడా పలువురు స్టార్లు హాజరయ్యారు. అయితే ఈ సీరియస్ మీటింగ్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

సాధారణంగా ఇలాంటి సమ్మిట్ లలో అభివృద్ధి, పెట్టుబడుల గురించి సీరియస్ చర్చలు జరుగుతాయి. అయితే వాటితో పాటు అక్కడ వాతావరణం చాలా సరదాగా సాగింది. ముఖ్యంగా బాలీవుడ్ జంట రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వేదిక మీద ఉన్న వారిని ఉద్దేశించి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ప్రసంగిస్తున్నప్పుడు, సడన్ గా టాపిక్ జెనీలియా వైపు మళ్లింది. అప్పటి వరకు సీరియస్ గా ఉన్న సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి.

అసలు విషయం ఏంటంటే.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హీరోయిన్ జెనీలియా అంటే చాలా అభిమానమట. వేదిక మీద ఆమెను చూడగానే ఆయన తన మనసులోని మాటను బయటపెట్టేశారు. "నేను ఎమ్మెల్యేగా గెలిచాను, ఒకసారి ఎంపీగా పనిచేశాను. గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉన్నాను. కానీ ఎంత బిజీగా ఉన్నా సరే జెనీలియా సినిమా వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వను" అని ఆయన ఓపెన్ గా చెప్పేశారు.

ఆమె తన ఫేవరెట్ హీరోయిన్ అని చెబుతూనే, జెనీలియాను ఆకాశానికెత్తేశారు. ఆమె ఒక నేషనల్ యాక్టర్ అని, చాలా నేచురల్ గా నటిస్తుందని ప్రశంసల వర్షం కురిపించారు. రాజకీయాల్లో తలమునకలై ఉండే ఒక సీనియర్ నేత, ఒక హీరోయిన్ గురించి ఇంతలా అభిమానం చూపించడంతో అక్కడున్న వారందరూ చప్పట్లు కొట్టారు. మంత్రి గారి కామెంట్స్ వినగానే జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ కూడా నవ్వకుండా ఉండలేకపోయారు.

ఇంతటితో ఆగుతారేమో అనుకుంటే.. ఆమెను చెల్లిగా సంభోదిస్తూ "థ్యాంక్యూ సిస్టర్" అని విష్ చేశారు. అసలు జెనీలియా ఈ కార్యక్రమానికి వస్తుందని తాను ఊహించలేదని, ఆమెను ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. మంత్రి గారి మాటలకు జెనీలియా కూడా అంతే వినయంగా నమస్కారం చేస్తూ ప్రతిస్పందించారు. పక్కనే ఉన్న మిగతా అతిథులు కూడా ఈ సంభాషణను ఆసక్తిగా గమనించారు. బొమ్మరిల్లు హాసినిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న జెనీలియాకు రాజకీయ నాయకుల్లో కూడా ఇంత ఫాలోయింగ్ ఉందన్నమాట. ప్రస్తుతం మంత్రి గారు మాట్లాడిన ఈ వీడియో క్లిప్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది.