టాప్ స్టోరి: కోలీవుడ్ తోపు డైరెక్టర్లు ఇలా తేలిపోయారేంటి?
కోలీవుడ్‌లో ఈ ఏడాది తిరోగమనం స్పష్ఠంగా కనిపిస్తోంది. అక్కడ తోపులు అని చెప్పుకునే ప్రముఖ దర్శకులంతా పరాజయాలతో డీలా పడిపోయారు.
By: Sivaji Kontham | 20 Aug 2025 6:00 PM ISTకోలీవుడ్‌లో ఈ ఏడాది తిరోగమనం స్పష్ఠంగా కనిపిస్తోంది. అక్కడ తోపులు అని చెప్పుకునే ప్రముఖ దర్శకులంతా పరాజయాలతో డీలా పడిపోయారు. మణిరత్నం, శంకర్, కార్తీక్ సుబ్బరాజ్, మురుగదాస్, లోకేష్ కనగరాజ్ లాంటి టాప్ డైరెక్టర్లు పూర్తిగా తప్పులో కాలేసారు. ఫలితంగా తమిళ చిత్రసీమకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది.
ఈ ఏడాది ఆరంభమే టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఎన్నో హోప్స్ పెట్టుకున్న `గేమ్ ఛేంజర్` డిజాస్టర్ గా మారడానికి కారకుడయ్యాడు స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్. మంచి సందేశం ఉన్న కథల్ని ఎంచుకుని, టెక్నికల్ గా విజువల్ వండర్స్ ని తెరకెక్కించే దర్శకుడిగా పేరున్నా కానీ అతడి మార్క్ `గేమ్ ఛేంజర్` లో ఎక్కడా కనిపించలేదని విమర్శలొచ్చాయి. బాక్సాఫీస్ వద్ద అతడి గత ట్రాక్ రికార్డ్ ఘోరంగా ఉన్నా కానీ, చరణ్ లాంటి అగ్ర కథానాయకుడు అవకాశం కల్పించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాతో తీవ్రమైన క్రిటిసిజం ఎదుర్కొన్నారు. శంకర్ తో పని చేసేప్పుడు అదుపు తప్పకూడని కొన్ని విషయాలపై ముందస్తుగా కండిషన్ పెట్టుకోవడంలో విఫలమయ్యానని కూడా ఆయన అంగీకరించారు. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన గేమ్ ఛేంజర్ పంపిణీ వర్గాలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మురుగదాస్ తెరకెక్కించిన `సికందర్` ఈ ఏడాది ఘోరమైన డిజాస్టర్లలో ఒకటి. సల్మాన్ నటించిన యావరేజ్ సినిమా కూడా 200 కోట్లు సునాయాసంగా వసూలు చేస్తుంది. కానీ సికందర్ దరిదాపుల్లోకి కూడా చేరుకోలేదు. మురుగదాస్ టేకింగ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సల్మాన్ ఆలస్యంగా రావడం వల్లనే సినిమా అలా అయ్యిందంటూ నెపం హీరోపైకి నెట్టేయడంతో మురుగదాస్ పై సల్మాన్ ఫ్యాన్స్ ఒక రేంజులో ఫైరవుతున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా సల్మాన్ స్టార్ పవర్ ని మిస్ యూజ్ చేసాడంటూ మురుగకు అక్షింతలు పడ్డాయి. సోషల్ మీడియాల్లో ఇడ్లీ- సాంబార్ కామెంట్లు మునుపటితో పోలిస్తే ఇప్పుడు రెట్టింపయ్యాయి.
సూర్య దశాబ్ద కాలంగా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి సమయంలో కార్తీక్ సుబ్బరాజు లాంటి ప్రతిభావంతుడైన దర్శకరచయితతో కలిసి చేసిన `రెట్రో` ఆశించిన విజయాన్ని అందించలేదు. చాలా చోట్ల బాగా ఆడిందని ప్రచారం సాగినా కానీ, వాస్తవికంగా బాక్సాఫీస్ వద్ద గణాంకాలు వేరుగా ఉన్నాయని ట్రేడ్ వెల్లడించింది. సూర్య ఎప్పటిలాగే హార్డ్ వర్క్ చేసినా, పరిశ్రమ వర్గాల్లో నెగెటివిటీ అతడిని వెంబడించిందని జ్యోతిక వాపోయారు. కానీ రెట్రోలో ఏదో పెద్ద లోపం పరాజయానికి కారణమైంది. ఈ చిత్రంతో పదేళ్లుగా కొనసాగిన తిరోగమనానికి ముగింపు పలకాల్సి ఉండగా, నిరాశే ఎదురైంది. సూర్య ఆశలన్ని తదుపరి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన `కరుప్పు` పైనే. ప్రచారం పరంగా చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కూడా పెద్దగా సౌండ్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
విశ్వనటుడు కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్ అనగానే 38 ఏళ్ల క్రితం తెరకెక్కిన నాయకన్ (నాయకుడు) గుర్తుకు వస్తుంది. భారతీయ సినిమా హిస్టరీలో మేటి క్లాసిక్ హిట్స్ లో ఇది ఒకటి. అందుకే ఈ కలయికలో థగ్ లైఫ్ తెరకెక్కుతోంది అనగానే అభిమానుల్లో చాలా ఉత్సాహం కనిపించింది. ఒక రొటీన్ స్టోరి లైన్ తీసుకుని, తండ్రి - కొడుకు (పెంపుడు) కాన్సెప్టును నీరుగార్చేలా తెరకెక్కించడంతో జనాలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టరైంది. కమల్ హాసన్ - శింబు తండ్రి కొడుకులుగా, మాఫియా సామ్రాజ్య నాయకులుగా అద్భుతంగా నటించినా కానీ, ఎక్కడా ఈ సినిమాని అది కాపాడలేకపోయింది. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కి కేవలం 93 కోట్లు వసూలు చేసింది. దర్శకుడు మణిరత్నంలోని పాత చింతకాయ ఆలోచనలకు కాలం చెల్లిందని ఈ సినిమా మరోసారి నిరూపించింది.
ఇటీవల విడుదలైన లోకేష్ కనగరాజ్ `కూలీ` కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. ఈ సినిమా రజనీకాంత్, నాగార్జున లాంటి తారల స్టార్ పవర్ కారణంగా అద్భుత ఓపెనింగులు సాధించింది. కానీ సమీక్షలు తీవ్రంగా నిరాశపరచడంతో సోమవారం నుంచే థియేటర్లు ఖాళీ అయ్యాయని విమర్శలొచ్చాయి. మొదటి ప్రదర్శన నుండే, ఈ చిత్రానికి విమర్శకులు , ప్రేక్షకుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ చిత్రంలో ప్రధాన తారల పాత్రల చిత్రణపై కూడా సరైన పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాకపోవడం పెద్ద నిరాశ. ఫలితంగా బాక్సాఫీస్ లెక్కలతో సంబంధం లేని పరాజయంగా దీని గురించి మాట్లాడుతున్నారు. అక్కడక్కడా రజనీ మెరుపులు సరిపోవు.. పాన్ ఇండియాలో వసూళ్లు రాబట్టాలంటే.. ప్రతి ఫ్రేమ్ లో రజనీ నుంచి మెరుపులు ఆశిస్తారు. కానీ అది లోకేష్ చేయలేదు!
భారీ తారాగణం, హై బడ్జెట్లు విజయానికి సరిపోవని పై సినిమాలన్నీ నిరూపించాయి. మంచి కథ, కథనం, భావోద్వేగాలు వర్కవుట్ కాకపోతే ఎంత పెద్ద దర్శకుడు, ఎంత పెద్ద స్టార్ కలిసి పని చేసినా వర్కవుట్ కాదని నిరూపణ అయింది. ముఖ్యంగా కోలీవుడ్ లో అరడజను తోపుల్లాంటి డైరెక్టర్లు, పాన్ ఇండియా రేసులో గాలి బుడగలా తేలిపోయారు.ఈ ఏడాది భారీ బడ్జెట్ సినిమాల కంటే కోలీవుడ్ లో పరిమిత బడ్జెట్లతో వచ్చిన సినిమాలే ఉత్తమ ఫలితాలను అందుకుని పరిశ్రమ పరువును నిలబెట్టాయన్న టాక్ ఉంది. గతం గతః .. మిగిలిన నాలుగు నెలల్లో అయినా కోలీవుడ్ నుంచి ఊహించని బ్లాక్ బస్టర్‌లు దూసుకొస్తాయేమో చూడాలి.
