Begin typing your search above and press return to search.

కోలీవుడ్‌ లో ఏం జరగనుంది? హీరోలు ఓకే చెబుతారా?

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో త్వరలో పెద్ద మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By:  M Prashanth   |   27 April 2026 4:00 PM IST
కోలీవుడ్‌ లో ఏం జరగనుంది? హీరోలు ఓకే చెబుతారా?
X

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో త్వరలో పెద్ద మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాస్టింగ్ రెమ్యూనరేషన్ పద్ధతి నుంచి సినిమాల విడుదల విధానం వరకు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో చర్చలు ముదురుతున్నాయి. ముఖ్యంగా నిర్మాతలు చేసిన తాజా తీర్మానాలు ఇండస్ట్రీ ఫ్యూచర్ పై ప్రభావం చూపే అవకాశముంది.

ఇప్పటివరకు సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా నటీనటులు, టెక్నీషియన్స్ ముందుగా ఒప్పందం చేసుకున్న ఫిక్స్‌ డ్ పారితోషికాన్ని అందుకునే పద్ధతి కొనసాగుతోంది. కానీ ఇప్పుడు ఆ విధానానికి బ్రేక్ వేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. భారీ, మీడియం బడ్జెట్ సినిమాలకు పని చేసే వారికి ఇకపై రెవెన్యూ షేరింగ్ మోడల్‌ ను అమలు చేయాలని తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయించింది.

ఆ మోడల్ ప్రకారం సినిమా లాభనష్టాలు నిర్మాతలతో పాటు నటీనటులు కూడా పంచుకోవాల్సి ఉంటుంది. అంటే సినిమా బాగా ఆడితే ఎక్కువ ఆదాయం, లేకపోతే తక్కువ సంపాదన.. ఇలా రిస్క్‌ ను అందరూ షేర్ చేసుకునే విధానం. థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా వస్తున్న ఆదాయం తగ్గిపోవడంతో నిర్మాతలు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారని, నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మండలి చెబుతోంది.

ఇదే కాకుండా మరో కీలక అంశంపై కూడా నిర్మాతలు కఠిన నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో విడుదలైన సినిమాలు వెంటనే ఓటీటీలో విడుదల చేయడాన్ని నియంత్రించాలని నిర్ణయించారు. మిడ్ రేంజ్ సినిమాలు కనీసం ఆరు వారాలు, భారీ బడ్జెట్ చిత్రాలు ఎనిమిది వారాలు పూర్తయ్యాకే ఓటీటీలో విడుదల చేయాలని తీర్మానించారు. థియేటర్లకు ప్రేక్షకులను తిరిగి రప్పించడమే ఆ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

ఆ నిర్ణయానికి మద్దతుగా మే 2న ఒకరోజు టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ రోజు షూటింగ్లు నిలిపివేయాలని నిర్ణయించారు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, నటీనటుల సంఘం సహకరించకపోతే సమ్మెను కొనసాగించే అవకాశముందని నిర్మాతలు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ రెవెన్యూ షేరింగ్ మోడల్ అమలుకు నటీనటుల సహకారం కీలకం.

గతంలో కూడా ఇదే ప్రతిపాదనను తీసుకొచ్చినా పెద్దగా స్పందన రాలేదు. ముఖ్యంగా స్టార్ హీరోలు ఆ మోడల్‌ కు ఓకే చెబుతారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. ఒకవేళ వారు అంగీకరిస్తే పరిశ్రమలో పెద్ద మార్పు జరిగే అవకాశం ఉంది. లేకపోతే నిర్మాతలు, నటీనటుల మధ్య విభేదాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మొత్తానికి నిర్మాతల నిర్ణయాలు అమల్లోకి వస్తాయా? స్టార్ హీరోలు సహకరిస్తారా? సమ్మె ఎంతవరకు వెళ్తుంది? అన్న ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తేలనుంది. ఒకవేళ ఆ మార్పులు అమలైతే, అది కేవలం తమిళ పరిశ్రమకే కాకుండా ఇతర సినీ ఇండస్ట్రీలపై కూడా ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.