Begin typing your search above and press return to search.

తమిళ సినీ పరిశ్రమలో రెమ్యునరేషన్ల రచ్చ!

గతంలో తెలుగు మార్కెట్‌లో 40 కోట్ల వరకు మాత్రమే థియేట్రికల్ బిజినెస్ సామర్థ్యం ఉన్న కొందరు తమిళ హీరోలకు, టాలీవుడ్ నిర్మాతలు ఏకంగా 100 కోట్లకు పైగా ఆఫర్ చేసారని ఆరోపించారు.

By:  Srikanth Kontham   |   28 Jun 2026 4:00 PM IST
తమిళ సినీ పరిశ్రమలో రెమ్యునరేషన్ల రచ్చ!
X

ప్ర‌స్తుతం కోలీవుడ్ లో పారితోషకాల వివాదం హాట్ టాపిక్ గా మారింది. నటీనటుల రెమ్యునరేషన్లు ఆకాశాన్ని తాకడంతో సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతోందని.. ఇది పరిశ్రమ మనుగడకే ప్రమాదకరంగా మారుతోందని తమిళ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అగ్ర హీరోల పారితోషకాలు సినిమా బడ్జెట్‌లో సింహభాగాన్ని ఆక్రమించడంతో కథనంపై -నిర్మాణ విలువలపై పెట్టే పెట్టుబడి తగ్గిపోతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ వివాదంలో టాలీవుడ్ నిర్మాతల పాత్రపై కోలీవుడ్ వర్గాల నుంచి ప్రధానంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు నిర్మాతలు తమిళ హీరోలకు వారి మార్కెట్ పరిధికి మించి భారీ ఆఫర్లు ఇస్తున్నారని, దీనివల్ల తమిళ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ధరల హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయని వాదిస్తున్నారు. ఒకప్పుడు పరిమిత మార్కెట్ ఉన్న హీరోలకు సైతం తెలుగు ప్రొడక్షన్ హౌస్‌లు వందల కోట్ల రూపాయల పారితోషకాలను ఎరగా వేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని కోలీవుడ్ నిర్మాతలు గళమెత్తుతున్నారు.

గతంలో తెలుగు మార్కెట్‌లో 40 కోట్ల వరకు మాత్రమే థియేట్రికల్ బిజినెస్ సామర్థ్యం ఉన్న కొందరు తమిళ హీరోలకు, టాలీవుడ్ నిర్మాతలు ఏకంగా 100 కోట్లకు పైగా ఆఫర్ చేసారని ఆరోపించారు. ఇలాంటి భారీ ఆఫర్ల వల్ల సదరు హీరోల డిమాండ్ కోలీవుడ్‌లోనూ ఊహించని విధంగా పెరిగిపోతుంద‌న్నారు. ఫలితంగా తమిళంలోనే సినిమాలు తీసే స్థానిక నిర్మాతలు కూడా వారి సొంత హీరోలకు అంత పెద్ద మొత్తంలో పారితోషకాలు చెల్లించాల్సి వస్తోందని.. లేదంటే హీరోల డేట్లు దొరకడం లేదని వాపోతున్నారు.

అయితే టాలీవుడ్ నిర్మాతల కోణం ఇందులో పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రస్తుత సినిమా రంగం కేవలం ఒక ప్రాంతానికో? భాషకో పరిమితం కాలేదని పాన్-ఇండియా ట్రెండ్ నడుస్తోందని గుర్తుచేస్తున్నారు. తమిళ హీరోలకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఉన్న క్రేజ్‌ను, వ్యాపార సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకునే తాము పెట్టుబడులు పెడుతున్నామని తెలుగు మేకర్స్ సమర్థించుకుంటున్నారు. సినిమా బిజినెస్ పరిధి పెరిగినప్పుడు దానికి అనుగుణంగానే నటీనటుల పారితోషకాలు కూడా ఉంటాయనేది వారి వాదనగా వినిపిస్తోంది.

ఈ రెమ్యునరేషన్ల రేసు వల్ల చిత్ర పరిశ్రమలో తీవ్రమైన అసమతుల్యత ఏర్పడుతోందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఒక సినిమా బడ్జెట్‌లో 60 నుండి 70 శాతం కేవలం హీరో పారితోషకానికే ఖర్చయిపోతే మిగిలిన సాంకేతిక నిపుణులకు, నిర్మాణ విలువలకు ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఇది చివరకు సినిమా నాణ్యతపై ప్రభావం చూపుతుంది. బాక్సాఫీస్ వద్ద ప్రతికూల ఫలితాలకు దారితీసే అవకాశం ఉందని పరిశ్రమ పెద్దలు హెచ్చరిస్తున్నారు.

మొత్తంమీద పారితోషకాల రచ్చ దక్షిణాది చిత్ర పరిశ్రమల మధ్య కొత్త చర్చకు తెరలేపింది. హీరోల మార్కెట్ విలువను కేవలం భాషా పరిమితులతో కొలవాలా? లేక గ్లోబల్ రీచ్‌ను బట్టి నిర్ణయించాలా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం సర్దుమణగాలంటే నిర్మాతల మండలి -నటీనటుల సంఘాలు కూర్చొని, బడ్జెట్ పారితోషకాల మధ్య సరైన సమతుల్యతను సాధించేలా కచ్చితమైన నిబంధనలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.