కోలీవుడ్ కి కలిసిరాని 2025..
కొత్త సంవత్సరం మొదలైందంటే చాలు ప్రతి సినిమా ఇండస్ట్రీ ఆ ఏడాది సక్సెస్ సాధించాలని, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని అనుకుంటుంది.
By: Madhu Reddy | 29 Dec 2025 1:00 PM ISTకొత్త సంవత్సరం మొదలైందంటే చాలు ప్రతి సినిమా ఇండస్ట్రీ ఆ ఏడాది సక్సెస్ సాధించాలని, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే ఆయా భాషల హీరోలు కూడా తమ భాష ఇండస్ట్రీకి ఒక స్థానాన్ని కల్పించాలని, తమ కెరియర్లో రికార్డులు క్రియేట్ చేయాలని పరితపిస్తూ ఉంటారు. కానీ మిగతా భాష ఇండస్ట్రీలతో పోల్చుకుంటే తమిళ సినిమా ఇండస్ట్రీకి ఈ ఏడాది కలిసి రాలేదని చెప్పాలి. సుమారుగా 2 వేల కోట్లకు పైగా భారీ నష్టం వాటిల్లిందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్నో అంచనాలు పెట్టుకున్న స్టార్ హీరోలు కూడా ఈసారి తమిళ సినిమా ఇండస్ట్రీకి ఊరటను ఇవ్వలేకపోయారు. మరి ఈ ఏడాది ఏ ఏ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయో ఇప్పుడు చూద్దాం.
కోలీవుడ్ సినీ పరిశ్రమ నుండి ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా ఏకంగా 280కి పైగా చిత్రాలు విడుదలయ్యాయి. అయితే వాటిలో విజయం సాధించింది కేవలం 30 చిత్రాలు మాత్రమే కావడం గమనార్హం. ముఖ్యంగా ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాలుగా అజిత్ కుమార్ విదాముయార్చి , గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ హాసన్ థగ్ లైఫ్, రజనీకాంత్ కూలీ, విక్రమ్ దానవీరశూర -2, సూర్య రెట్రో, ధనుష్ ఇడ్లీ కడై, కుబేర, విజయ్ సేతుపతి ఏస్, శివ కార్తికేయన్ మదరాసి వంటి చాలా చిత్రాలు ఉన్నాయి. అయితే వీటిలో కూలీ, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలు మాత్రమే లాభాలు చవిచూసాయి. ముఖ్యంగా రజనీకాంత్ నటించిన కూలీ సినిమా ఏకంగా రూ.600 కోట్ల వసూళ్లతో దక్షిణాదిలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలలో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.
ముఖ్యంగా ధనుష్ కుబేర చిత్రం విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్ భాషల్లో బైలింగ్వల్ గా విడుదలైన ఈ సినిమా తమిళంలో నష్టాన్ని మిగిలిస్తే.. తెలుగులో మాత్రం లాభాలను అందించింది. అలాగే విడాముయార్చి, రెట్రో, థగ్ లైఫ్ , ఇడ్లీ కడై, ఏస్, మదరాసి , కుబేర లాంటి చిత్రాలు అటు ఇటుగా 100 కోట్లు రాబట్టాయి. ఇక చిన్న హీరోలైన ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్, డ్యూడ్ చిత్రాలు 100 కోట్ల క్లబ్లో చేరాయి.. ఇకపోతే తక్కువ బడ్జెట్ తో వచ్చిన తలైవన్ తలైవి, కుడుంబస్తన్, మామన్, బైసన్, టూరిస్ట్ ఫ్యామిలీ, మదగజరాజా, డ్రాగన్, డ్యూడ్ వంటి చిత్రాలు భారీగానే లాభాలను అందించాయి. కానీ భారీ బడ్జెట్ తో వచ్చిన చిత్రాలు దాదాపుగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
అలా ఈ ఏడాది తమిళ సినీ పరిశ్రమకు కలిసి రాలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.అంతేకాదు సుమారుగా 2 వేల కోట్లకు పైగా నష్టాన్ని తమిళ సినీ పరిశ్రమ చవి చూసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి వచ్చే ఏడాదైనా కోలీవుడ్ కి కలిసి వస్తుందేమో చూడాలి.
