విశాల్ 'చెత్తబుట్ట' వ్యాఖ్యలు... అందని ద్రాక్ష పుల్లన!!
అసలు విషయం ఏంటంటే విశాల్ ఇటీవల సొంతంగా పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించాడు.
By: Ramesh Palla | 19 Oct 2025 11:39 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గతంలో పలు విషయాల గురించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయంకు వ్యతిరేకంగా తన అభిప్రాయం ను వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు విశాల్ అవార్డ్‌ల గురించి, అవార్డ్ వేడుకల గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. విశాల్ తనకు ఇష్టం లేని విషయాల గురించి మరీ ఇంత ఓపెన్‌గా మాట్లాడాల్సింది కాదని కొందరు అంటూ ఉంటే, కొందరు మాత్రం ఆయనకు దక్కలేదు కనుక ఆయనకు నచ్చడం లేదు అంటున్నారు. మొత్తానికి విశాల్ అవార్డ్‌ల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్ వర్గాలతో పాటు, జాతీయ మీడియాలోనూ ప్రముఖంగా చర్చ జరుగుతోంది, అంతే కాకుండా కొందరు విమర్శలు చేస్తున్నారు.
విశాల్ పాడ్‌కాస్ట్ ప్రారంభం
అసలు విషయం ఏంటంటే విశాల్ ఇటీవల సొంతంగా పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించాడు. తన తొలి పాడ్‌కాస్ట్‌లో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ముందుగానే తన పాడ్ కాస్ట్‌లో అన్ని నిజాలు, ఓపెన్‌గా చెప్పేస్తాను అంటూ ప్రకటించాడు. అన్నట్లుగానే విశాల్ తన పాడ్ కాస్ట్‌లో పలు సినిమాలకు సంబంధించిన విషయాలను, వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నాడు. విశాల్ ముఖ్యంగా అవార్డ్ వేడుకల గురించి స్పందించాడు. చాలా కాలం క్రితం విశాల్ అవార్డ్‌లకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెల్సిందే. ఇప్పుడు అంతకు మించి కాస్త ఘాటుగానే విశాల్ మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. నాకు అవార్డులపై నమ్మకం లేదు, అవార్డులు ఇచ్చే వారు, అవార్డులకు ఎంపిక చేసే వారు ఏ ఒక్కరి పై నమ్మకం లేదు అన్నట్లుగా విశాల్ తన పాడ్ కాస్ట్‌లో మాట్లాడటంతో వివాదం మొదలైంది.
అవార్డ్‌ల గురించి విశాల్ విమర్శలు
సినిమాల గురించి, సినిమాల్లో నటించిన వారి గురించి కేవలం ఎనిమిది మంది విశ్లేషించి, ఎనబై కోట్ల మంది అభిప్రాయంను తమ అభిప్రాయంగా ఎలా చెప్తారు. జాతీయ అవార్డుల విషయంలోనూ తనది అదే అభిప్రాయం అన్నాడు. ఎప్పటికి అయినా అవార్డ్‌ల విషయంలో తాను వ్యతిరేకం అన్నట్లుగా విశాల్ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు నాకు ఒక్క అవార్డ్ రాలేదు అని నేను ఇలా మాట్లాడటం లేదని, తనకు అవార్డ్‌లు వచ్చే అవకాశం ఉన్నా నేను తిరస్కరించాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఎవరైనా తనకు అవార్డ్‌ను ఇస్తే దాన్ని ఖచ్చితంగా చెత్త బుట్టలో వేస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. అవార్డ్‌లను కళాకారులు ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అవార్డ్‌లను చెత్త బుట్టలో వేయడం ఏంటి అంటూ విమర్శలు చేశారు. నీకు గౌరవం లేకుంటే, గౌరవించే వారి అభిప్రాయంను తప్పుబట్టినట్లే కదా అని కొందరు అంటున్నారు.
జాతీయ అవార్డ్ రావాల్సి ఉన్నా...
ఈ సమయంలో విశాల్ తీరును సమర్ధించే వారితో పాటు ఎక్కువ మంది విమర్శించే వారు ఉన్నారు. తెలుగులో ఒక నానుడి ఉంది. అందని ద్రాక్ష పుల్లన అంటారు. అంటే ఏదైతే మనకు అందదో దాన్ని బాగాలేదని సరిపెట్టుకుంటాం. ఇప్పుడు విశాల్ తీరు అదే విధంగా ఉందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట విశాల్ వ్యాఖ్యలు షేర్ చేసి కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. విశాల్ కెరీర్ ఆరంభంలో చేసిన ఒక పాత్రకు జాతీయ అవార్డ్ వస్తుందని అంతా భావించారు. విశాల్ సైతం ఆ సమయంలో అవార్డ్ వస్తుందని భావించాడని అంటారు. విశాల్ ఆ సమయంలో అవార్డ్ రాకపోవడంతో తీవ్ర స్థాయిలో నిరుత్సాహంకు గురి అయ్యాడు. అందుకే ఆయన అవార్డ్‌లకు వ్యతిరేకంగా మారాడని, అవార్డ్‌లపై నమ్మకం కోల్పోయాడని కోలీవుడ్ వర్గాల వారు అంటూ ఉంటారు.
