రూ.1000 కోట్ల విజయం.. కోలీవుడ్ కు ఇంకెప్పుడు?
రూ.1000 కోట్ల క్లబ్ లో బాలీవుడ్ కు చెందిన మూడు చిత్రాలు ఉండగా.. శాండల్ వుడ్ కు మరో సినిమా ఉంది.
By: M Prashanth | 15 Aug 2025 10:47 AM ISTరూ.1000 కోట్ల విజయం.. సినీ ఇండస్ట్రీలో భాషలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత సహా అందరి కల. దాన్ని సాధించడం కోసం అంతా కృషి చేస్తుంటారు. అయితే భారతీయ చిత్ర పరిశ్రమలో వివిధ భాషలకు చెందిన చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్ లో ఇప్పటికే చేరిన విషయం తెలిసిందే.
దంగల్, బాహుబలి-2, కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్, పఠాన్, జవాన్, కల్కి 2898 ఏడీ, పుష్ప-2 సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో అలరించి ప్రతిష్ఠాత్మక క్లబ్ లోకి చేరాయి. అందులో సగం చిత్రాలు టాలీవుడ్ కు చెందినవి కావడం గమనార్హం. అలా తెలుగు చిత్ర పరిశ్రమ.. తమదైన సత్తా చాటుతూ దూసుకుపోతోంది.
రూ.1000 కోట్ల క్లబ్ లో బాలీవుడ్ కు చెందిన మూడు చిత్రాలు ఉండగా.. శాండల్ వుడ్ కు మరో సినిమా ఉంది. కానీ కోలీవుడ్ కు మాత్రం రూ.1000 కోట్ల హిట్ ఇంకా కలగానే ఉంది. ఇప్పటి వరకు అక్కడి సినిమా ఒక్కటి కూడా అంతటి విజయం సాధించలేదు. ఆ మధ్య స్టార్ హీరో సూర్య నటించిన కంగువా రిలీజైన విషయం తెలిసిందే.
ఆ మూవీ మేకర్స్.. రూ.1000 కోట్ల హిట్ అవుతుందని, కోలీవుడ్ బాహుబలి అని అంచనాలు వేశారు. కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది. సినిమా నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కూలీపై ఉంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఆ సినిమా రూపొందింది.
గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కి ఆగస్టు 14వ తేదీ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ జోష్ లో జరిగాయి. దీంతో కూలీ మూవీ ప్రతిష్టాత్మక క్లబ్ లో అడుగుపెడుతుందని అంతా అంచనా వేశారు. రూ.1000 కోట్లు సాధిస్తుందని ఊహించారు.
కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. రూ.500-600 కోట్లు మాత్రమే కూలీ మూవీ సాధించవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రూ.1000 కోట్ల టార్గెట్ ను రీచ్ అవ్వడం కష్టమేనని అంటున్నారు. దీంతో కోలీవుడ్ కు మళ్లీ కలగానే మిగిలేలా ఉంది. అయితే వెయ్యి కోట్ల క్లబ్ తాకాలంటే హిందీ ప్రేక్షకుల బలమైన మద్దతు అవసరం. పాన్ ఇండియా రేంజ్ లో అందరినీ ఆకట్టుకునేలా సినిమా ఉండాలి. మరి కోలీవుడ్ కు రూ.1000 కోట్ల హిట్ ఎప్పుడు దక్కుతుందో వేచి చూడాలి.
