Begin typing your search above and press return to search.

ఐమ్యాక్స్ థియేట‌ర్‌ని తేగ‌లిగేది వీళ్లేనా?

గ‌త కొన్నేళ్లుగా హైద‌రాబాద్ ప్ర‌సాద్స్ మల్టీప్లెక్స్ నుంచి ఐమ్యాక్స్ వైదొల‌గ‌డంతో సినిమా ప్రియులు చాలా నిరాశ చెందిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   8 Dec 2025 9:45 AM IST
ఐమ్యాక్స్ థియేట‌ర్‌ని తేగ‌లిగేది వీళ్లేనా?
X

గ‌త కొన్నేళ్లుగా హైద‌రాబాద్ ప్ర‌సాద్స్ మల్టీప్లెక్స్ నుంచి ఐమ్యాక్స్ వైదొల‌గ‌డంతో సినిమా ప్రియులు చాలా నిరాశ చెందిన సంగ‌తి తెలిసిందే. ఐమ్యాక్స్ లైసెన్సింగ్ పున‌రుద్ధ‌ర‌ణ స‌హా థియేట‌ర్ మెయింటెనెన్స్ భారీ ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం గ‌నుక హైద‌రాబాద్ లోని దిగ్గ‌జ సంస్థ‌లు అస‌లు `ఐమ్యాక్స్` అనే ఆలోచ‌న చేయ‌డం లేద‌ని విశ్లేష‌ణ‌లు వెలువ‌డ్డాయి. ఏఎంబి సినిమాస్ తో పాటు ఏఏఏ సినిమాస్ ల‌గ్జ‌రీ యాంబియెన్స్ తో మ‌ల్టీప్లెక్సుల‌ను ర‌న్ చేస్తున్నా కానీ, వీటిలో కూడా ఐమ్యాక్స్ ని ఏర్పాటు చేయక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇండ‌స్ట్రీలో భారీగా ఆదాయ వ‌న‌రులు ఉన్న ఎగ్జిబిట‌ర్లు ఎవ‌రూ ఐమ్యాక్స్ స్క్రీన్ ఏర్పాటు కోసం ఆలోచించ‌క‌పోవ‌డం విస్మ‌య‌ప‌రిచేదే. హైద‌రాబాద్ గచ్చిబౌళి, అమీర్ పేట్ లాంటి ప్రైమ్ ఏరియా థియేట‌ర్లు సైతం ఇలాంటి అవ‌కాశాన్ని క‌ల్పించ‌క‌పోవ‌డం పెద్ద నిరాశ‌.

అయితే ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌ను ప్రారంభిస్తున్న‌ అల్లు సినిమాస్ ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్ ని కూడా అందించ‌గ‌ల‌ద‌ని అభిమానులు బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. హైదరాబాద్‌లో సినిమాటిక్ అనుభ‌వాన్ని మరింత గొప్ప‌గా మలిచే స‌త్తా ఏఏఏ సినిమాస్ లేదా అల్లు సినీప్లెక్స్ కి ఉంది. కానీ ఐమ్యాక్స్ ని తేవాల‌నే ఆలోచన అల్లు అర్జున్, అర‌వింద్ వంటి ప్ర‌ముఖుల‌కు ఉందా లేదా? అన్న‌ది వేచి చూడాలి.

ప్ర‌స్తుతం దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ని అల్లు సినీప్లెక్స్ సిద్ధం చేసింది. కోకాపేటలో ఉన్న ఈ 75 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్ డిసిఐ ఫ్లాట్ 1.85:1 ఫార్మాట్‌లో పనిచేస్తుంద‌ని, ఇందులో డాల్బీ విజన్, డాల్బీ 3డి ప్రొజెక్షన్ సాంకేతిక‌తో విజువ‌ల్స్ గుబులు పుట్టిస్తాయ‌ని చెబుతున్నారు. అత్యాధునిక డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్ ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపింప‌జేస్తుంది. ధ్వ‌ని ప‌రంగా, వీక్ష‌ణ ప‌రంగా 3డి, 2డి సినిమాల వీక్ష‌ణ‌కు అత్యుత్త‌మ అనుభ‌వాన్ని కోకాపేట్ థియేట‌ర్ అందించ‌గ‌ల‌ద‌ని చెబుతున్నారు. ఇందులో స్టేడియం త‌ర‌హాలో పిచ్ బ్యాక్ సీటింగ్ వ్య‌వ‌స్థ అందుబాటులో ఉండ‌టంతో ప‌ర‌ధ్యానంలోకి వెళ్ల‌కుండా ఆడియెన్ ఎప్పుడూ సినిమాని ఆస్వాధించ‌గ‌ల‌డు.

డెక్క‌న్ క్రానిక‌ల్ స‌మాచారం మేర‌కు, జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కించిన ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `అవ‌తార్ - ఫైర్ అండ్ యాష్‌`తో ఈ స్క్రీన్ ని ప్రారంభిస్తార‌ని స‌మాచారం. 75 అడుగుల వెడ‌ల్పు ఉన్న ఈ అతిభారీ స్క్రీన్ పై పండోరా గ్ర‌హ‌వాసుల విన్యాసాల‌ను 3డి విజ‌న్ లో వీక్షించే అవ‌కాశం ల‌భిస్తే అది నిజంగా ఎంతో ఎగ్జ‌యిట్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. సంక్రాంతి 2026కి గ్రాండ్ లాంచింగ్ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని కూడా చెబుతున్నారు. అల్లు సినీప్లెక్స్ భారతదేశంలోని ఆరు డాల్బీ సినిమా ఇన్‌స్టాలేషన్‌లలో ఒకటిగా మార‌నుంది. ఈ థియేట‌ర్ ప్ర‌పంచ‌స్థాయి వీక్ష‌ణ అనుభ‌వాన్ని అందించ‌నుంది. ఇక‌పైనా విడుద‌ల‌కు వ‌చ్చే భారీ హాలీవుడ్ చిత్రాల‌తో పాటు, నితీష్ తివారీ- రామాయ‌ణం, రాజ‌మౌళి - వార‌ణాసి వంటి చిత్రాల‌ను ఇలాంటి యూనిక్ సౌండ్ క్వాలిటీ వున్న థియేట‌ర్ల‌లో వీక్షించాల‌ని వినోద‌ప్రియులు భావించ‌డం ఖాయం.