లాజిక్ నమ్మితే ఫ్లాప్.. మ్యాజిక్ నమ్మితే హిట్!
చలనచిత్ర పరిశ్రమ అనేది కళాక్షేత్రం మాత్రమే కాదు. లెక్కలు తప్పితే కోట్లు నష్టపోయే క్లిష్టమైన వ్యాపార సామ్రాజ్యం.
By: Srikanth Kontham | 3 Oct 2026 6:00 AM ISTచలనచిత్ర పరిశ్రమ అనేది కళాక్షేత్రం మాత్రమే కాదు. లెక్కలు తప్పితే కోట్లు నష్టపోయే క్లిష్టమైన వ్యాపార సామ్రాజ్యం. ఈ రంగంలో విపరీతమైన పుస్తక జ్ఞానం, అపారమైన సినిమాటిక్ నాలెడ్జ్, ప్రపంచ సినిమాలపై పట్టు ఉన్న ఎంతోమంది మేధావులు దర్శకులుగా నిలదొక్కుకోలేక పోతుండగా.. పెద్దగా అకడమిక్ నాలెడ్జ్ లేని కొందరు మాత్రం సింపుల్ ఫార్ములాలతో ఇండస్ట్రీని ఏలుతూ సులువుగా సక్సెస్ అవుతుంటారు. ఈ విచిత్రమైన వైరుధ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇద్దరు దర్శకుల ఆలోచనా విధానంలో ఉండే ఆ సూక్ష్మమైన వ్యత్యాసం ఏంటంటే?
మొదటి వర్గానికి చెందిన నాలెడ్జ్ డైరెక్టర్లు సినిమాను సాహితీ ప్రతీకగా భావిస్తారు. వీరికి ప్రపంచ సినిమా చరిత్ర, క్లాసిక్ నవలా రచయితలు, డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్, నూతన టెక్నాలజీలపై అద్భుతమైన అవగాహన ఉంటుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ డీప్ మీనింగ్ ఉండేలా, ఆడియెన్స్‌ను మేధోపరంగా ఆలోచింపజేసేలా సినిమాలు తీయాలని తపన పడుతుంటారు. స్క్రిప్ట్ వర్క్‌లో అసాధారణమైన లోతు ఉన్నా? ఆ మేధో స్థాయిని సాధారణ ప్రేక్షకుల మెదడుకు ఎక్కించే దగ్గరే విఫలమవుతుంటారు.
అయితే ఈ విపరీతమైన జ్ఞానమే వారికి అతిపెద్ద శాపంగా మారుతుందనేది కాదనలేని నిజం. థియేటర్ కి వచ్చే సగటు ప్రేక్షకుడు రోజూవారీ కష్టాల నుంచి ఉపశమనం పొందడానికో? రెండు గంటలు పూర్తిగా ఎంటర్‌టైన్ అవ్వడానికో వస్తాడు తప్ప దర్శకుడి ఫిలాసఫీని.. సినిమాలో ఇంటెలెక్చువల్ లేయర్స్‌ను విశ్లేషించడానికి రాడు. కానీ నాలెడ్జ్ ఉన్న దర్శకులు తమ ఆలోచనలను తెరపై ఆవిష్కరించే క్రమంలో కథను సంక్లిష్టంగా మార్చేస్తారు. ఎమోషన్స్ కంటే మేధావిత్వానికి ఎక్కువ పీఠ వేయడంతో ప్రేక్షకుడు సినిమాతో కనెక్ట్ కాలేక థియేటర్ నుంచి దూరంగా జరుగుతాడు.
రెండో వర్గానికి చెందిన కమర్షియల్ సక్సెస్ డైరెక్టర్లు పుస్తకాల్లో సినిమా సూత్రాలను నమ్ముకోకుండా నేల విడిచి సాము చేయకుండా జనాల నాడిని పట్టుకుంటారు. వీరికి సినిమాటోగ్రఫీ , స్క్రీన్‌ప్లే టెక్నికాలిటీస్ పై పెద్దగా గ్రాడ్యుయేషన్ స్థాయి నాలెడ్జ్ ఉండకపోవచ్చు. కానీ ఏ సీన్ చూస్తే ప్రేక్షకుడు విజిల్ వేస్తాడు. ఏ ఎమోషన్‌కు కంటతడి పెడతాడు. ఏ డైలాగ్‌కు థియేటర్ దద్దరిల్లుతుంది అనే సైకాలజీ మాత్రం వీరికి క్షుణ్ణంగా తెలుస్తుంది. వీరు సంక్లిష్టత జోలికిపోకుండా సింపుల్, రా అండ్ రస్టిక్ పద్ధతిలో కథను నేరుగా ప్రేక్షకుడి హృదయానికి హత్తుకునేలా తీస్తారు.
విజయవంతమైన దర్శకుల బలం ఎంటర్‌టైన్‌మెంట్ ను నమ్ముకోవడమే. వీరంతా సినిమాల్లో లాజిక్‌ల కంటే మ్యాజిక్‌ను, ఆర్ట్ కంటే కమర్షియల్ హంగులను నమ్ముకుంటారు. మాస్ హీరోను ఎలా చూపించాలి? ఎక్కడ ఫైట్ పెట్టాలి? ఎప్పుడు పాట రావాలి? అనే కమర్షియల్ గ్రామర్ వీళ్లకు బాగా తెలుసు. పక్కా కమర్షియల్ మీటర్ ఉన్న కథలను ఎంచుకుని వాటిని ఎక్కడా బోర్ కొట్టించకుండా వినోదమే పరమావధిగా తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద ఈజీగా బ్లాక్‌బస్టర్లు కొడుతుంటారు.
అంతిమంగా సినిమా అనేది ఆర్ట్ - కామర్స్ కలయిక. నాలెడ్జ్ ఉన్న దర్శకులు ఆర్ట్ వైపే మొగ్గు చూపడం వల్ల ప్రేక్షకుడికి దూరమైపోతుంటే? కమర్షియల్ డైరెక్టర్లు ప్రేక్షకుల నాడిని పట్టుకుని విజయాల బాటలో పయ నిస్తున్నారు. ఏది ఏమైనా? అపారమైన జ్ఞానాన్ని సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యే సరళమైన ఎమోషన్స్‌తో మిళితం చేయగలిగినప్పుడే ఏ దర్శకుడైనా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలడు. జ్ఞానం అనేది ఆయుధం మాత్రమే, దాన్ని జనాలకు నచ్చే భాషలో ప్రయోగిస్తేనే వెండితెరపై విజయం సొంతమవుతుంది.
