Begin typing your search above and press return to search.

ఫేక్ ఇండ‌స్ట్రీ అంటూ సీనియ‌ర్ న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

హాలీవుడ్‌లో ఉన్నట్లుగా భారత్‌లో నటుల కోసం బలమైన స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ వంటి వ్యవస్థలు లేకపోవడాన్ని ప్రశ్నించారు.

By:  Srikanth Kontham   |   14 Aug 2026 3:07 PM IST
ఫేక్ ఇండ‌స్ట్రీ అంటూ సీనియ‌ర్ న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
X

సుదీర్ఘ కాలంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటి కిటు గిడ్వానీ ఇటీవల బాలీవుడ్ పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్ కలిగిన కిటు పరిశ్రమను నకిలీ అని అభివర్ణించడమే కాకుండా.. ఇక్కడ అమలవుతున్న నిబంధనలు ఎంత అస్పష్టంగా ఉన్నాయో? ఎండగట్టారు. ఒక నటుడి సృజనాత్మకతకు, కష్టానికి తగిన గుర్తింపు , ఆర్థిక భద్రత కల్పించడంలో బాలీవుడ్ విఫలమైందని ఆమె వాదించడం గమనార్హం. ముఖ్యంగా నటులకు అందాల్సిన రాయల్టీల గురించి కిటు గిడ్వానీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమ‌వుతున్నాయి.

హాలీవుడ్‌లో ఉన్నట్లుగా భారత్‌లో నటుల కోసం బలమైన స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ వంటి వ్యవస్థలు లేకపోవడాన్ని ప్రశ్నించారు. ఒక నటుడు పదేళ్లు కష్టపడితే ఆ తర్వాత వచ్చే రాయల్టీలతో గౌరవంగా జీవించే అవకాశం ఉండాలని, కానీ బాలీవుడ్ సంప్రదాయాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని ఆవేదన చెందారు. కేవలం ఒకసారి పారితోషికం చెల్లించి ఆ తర్వాత సదరు సినిమా లేదా కంటెంట్‌పై యాజమాన్య హక్కులన్నీ నిర్మాతల చేతుల్లోనే ఉండటం కళాకారుల పట్ల వివక్షత అని పేర్కొన్నారు. మరోవైపు వయసు పెరుగుతున్న కొద్దీ నటీమణులకు లభించే పాత్రల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

సినిమాలో స్త్రీ పాత్రలు తల్లి ..అత్త వంటి మూస ధోరణిలో మాత్రమే ఉండటం, సృజనాత్మకతను చంపేస్తుందని కిటు అభిప్రాయపడ్డారు. వయసుతో సంబంధం లేకుండా ప్రేమ, యాక్షన్, కామెడీ , అధికారం వంటి అంశాలతో కూడిన బలమైన పాత్రలు మహిళలకు లభించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. టెలివిజన్ సీరియల్స్‌లో 30 ఏళ్లు నిండకముందే నటిని బామ్మగా చూపించడం వెనుక ఉన్న తర్కం అర్థం కావడం లేదని పరిశ్రమలో ఇలాంటి వింత పోకడలు ఎక్కువయ్యాయని ఎద్దేవా చేశారు.

బాలీవుడ్ ఒక‌ వ్యవస్థీకృత పరిశ్రమగా కాకుండా ఒక కాటేజ్ ఇండస్ట్రీ లా వ్యవహరిస్తోందని కిటు గిడ్వానీ అభిప్రాయపడ్డారు. ఎవరికి నచ్చిన నిబంధనలు వారు సృష్టించుకుంటూ సృజనాత్మక హక్కులను గౌరవించని ధోరణి వల్ల నూతన తరం కళాకారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా నటుల మేధో సంపత్తి హక్కులు బలంగా ఉంటే భారత్‌లో పరిస్థితి మాత్రం శూన్యమని విమర్శించారు.

ఈ నేపథ్యంలో భారతీయ సినీ పరిశ్రమలో సమూల మార్పుల అవసరం ఎంతైనా ఉందని అర్థమవుతోంది. నటులు కూలీలుగా కాకుండా కష్టానికి భాగస్వాములుగా గుర్తించబడినప్పుడే పరిశ్రమ మరింత ఆరోగ్యకరంగా మారుతుంది. కిటు గిడ్వానీ వంటి సీనియర్ నటుల ఆవేదన కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు. ఇది మొత్తం నటుల సమాజం ఎదుర్కొంటున్న ఉమ్మడి పోరాటం. పరిశ్రమలో గ్లామర్ వెనుక ఉన్న చీకటి కోణాలను బయటపెట్టడం ద్వారా భ‌విష్య‌త్ లో అయినా మార్పు వస్తుందని ఆశిద్దాం.