Begin typing your search above and press return to search.

గౌరీ తనయా.. నమ్మి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఎవరు?

తాజాగా ఆయన రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

By:  Madhu Reddy   |   7 Jan 2026 4:00 PM IST
గౌరీ తనయా.. నమ్మి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఎవరు?
X

ముఖ్యంగా మైథలాజికల్ కాన్సెప్ట్ లో సినిమాలు తెరకెక్కించాలి అంటే ఎంతో స్కిల్ ఉండి తీరాల్సిందే. ముఖ్యంగా దర్శకత్వంలో అనుభవం ఉంటే సరిపోదు.. ఆ మైథలాజికల్ కాన్సెప్టును తెరపై చూపించేటప్పుడు చూసే ప్రేక్షకుడిలో భక్తి భావం కలగాలి. అప్పుడే ఆ చిత్రానికి , ఆ కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఒకవేళ అటూ ఇటూ అయిందంటే మాత్రం విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా మరొక హీరో అవకాశం ఇవ్వాలంటే వెనకడుగు వేసే అవకాశాలు కూడా ఉంటాయి.

ఇక మరొకవైపు రొమాంటిక్, లవ్ , ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న కొంతమంది దర్శకులు సడన్గా జానర్ మార్చి సినిమాలు చేస్తామని ప్రకటిస్తే చాలు.. అందరిలో అనుమానాలు రేకెత్తుతాయి. అసలు అలాంటి సినిమాలు చేసిన వీరికి ఇలాంటి చిత్రాలు చేసే క్యాపబులిటీ ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తారు. అయితే తనకు అలాంటి సత్తా ఉందని చెబుతున్నారు ప్రముఖ డైరెక్టర్ కిషోర్ తిరుమల.

తాజాగా ఆయన రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టిన కిషోర్ తిరుమల ఈ సందర్భంగా తన కోరికను బయటపెట్టారు.

అసలు విషయంలోకి వెళ్తే టాలీవుడ్ లో బడా డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ తొలిసారి మైథాలజికల్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి కథను చెప్పాలనుకోవడంతో అభిమానులలో క్యూరియాసిటీ పెరిగింది. గత రెండేళ్లుగా చర్చల్లో ఉన్న ఈ కథ ముందు అల్లు అర్జున్ గాడ్ ఆఫ్ వార్ గా పేరు ఉన్న సుబ్రహ్మణ్యస్వామి క్యారెక్టర్ చేస్తాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ బన్నీ ఈ సినిమా చేస్తున్నారంటూ కొన్ని పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కిషోర్ తిరుమల కూడా ఈ సుబ్రహ్మణ్యస్వామి మీద సినిమా కథ రాసుకున్నట్లు తాజా ప్రమోషనల్ కార్యక్రమాలలో చెప్పుకొచ్చారు.

నేను శైలజ , చిత్రాలహరి వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన .. ఈ చిత్రాలకంటే ముందే సుబ్రహ్మణ్య స్వామి కథ చేయాలనుకున్నారట. దీనికి 'గౌరీ తనయ' అనే పేరు కూడా పెట్టారట. 4 ఏళ్ల ముందే స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టి.. కథ సిద్ధం చేసి.. ఆఖరికి పక్కన పెట్టేసినట్లు చెప్పుకొచ్చారు. కారణం ఇది ఎక్కువ బడ్జెట్ ఉన్న చిత్రం.. పెద్ద స్పాన్ ఉన్న కథ.. పేరున్న నటీనటులు, టెక్నీషియన్లు అవసరం. అందుకే తన ప్రయత్నాన్ని పక్కన పెట్టినట్లు కిషోర్ తిరుమల చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ప్రేమ , ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలను డీల్ చేసిన కిషోర్ ఇంత పెద్ద కథ రాసి భారీ బడ్జెట్లో సినిమా తీయగలరని ఎవరు నమ్మరు? కానీ రంగంలోకి దిగితే తప్ప ఆ దర్శకుల సత్తా ఏంటో తెలియదు.

మరి ఇంత పెద్ద స్పాన్ భారీ బడ్జెట్ చిత్రాన్ని కిషోర్ తిరుమల కి ఇస్తారా? అసలు ఈయనను నమ్మి ఈ సినిమా చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ తన తదుపరి చిత్రాలతో మంచి సక్సెస్ ను అందుకొని స్టార్ హీరోలతో స్నేహం పెంచుకుంటే మాత్రం ఆయన కోరిక నెరవేరుతుంది అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. అటు కిషోర్ తిరుమల చేయబోయే ఈ ప్రయత్నం ఫలించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.