బెల్లంకొండ 'కిష్కింధపురి'.. మెగాస్టార్ అదిరిపోయే రివ్యూ
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన కిష్కింధపురి మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 16 Sept 2025 12:43 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన కిష్కింధపురి మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన ఆ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి గ్రాండ్ గా రూపొందించారు.
భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా.. మంచి రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో సందడి చేస్తున్న చిత్రం.. రోజురోజుకు తన దూకుడు పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ పూర్తయినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో కిష్కింధపురిపై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన రివ్యూ ఇచ్చారు. "నమస్తే నా రాబోయే సినిమా మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు నిర్మిస్తున్న నిర్మాత సాహు గారపాటి గారి మరో చిత్రం కిష్కింధపురి. అది రిలీజై విజయం సాధించింది. ఆ సినిమా చూసిన నాకు మంచి ప్రయత్నం చేశారని పెంచింది. అందుకుగాను ఆ చిత్ర దర్శక, నిర్మాతలతోపాటు పనిచేసిన నటీనటులకు, మిగతా క్రూ అందరికీ నా శుభాభినందనలు" అని చెప్పారు.
"సాధారణంగా హారర్ సినిమాలు అంటే ఓ భయాన్ని ఎలివేట్ చేస్తూ ఒక దెయ్యం కథ చెప్పడం జరుగుతుంది. కానీ కిష్కింధపురిలో హార్రర్ తో పాటు ఒక మంచి సైకలాజికల్ పాయింట్ ను కూడా యాడ్ చేసి చెప్పడం చాలా బాగుంది. అంటే శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం ప్రమాదకరం అని చెప్పడం, అలాగే మనిషికున్న బాధలు, కష్టాలు పక్కన వాళ్లకు చెప్పకుండా ఒంటరితనం అనుభవిస్తుంటే ఆ వచ్చే ప్రమాదాలను, పరిణామాలను చాలా సమర్థవంతంగా.. తెలిసొచ్చేలా చిత్రీకరించాడు డైరెక్టర్ కౌశిక్" అని కొనియాడారు.
"ఈ చిత్రం ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఒక మంచి విజయాన్ని దక్కించుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ తన పనితనం బాగా చూపించాడు. టోటల్ గా మన కిష్కింధపురి టీమ్ అందరికీ ఒక మంచి సినిమా అందించిన మన ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. దయచేసి అందరూ వెళ్లి థియేటర్లలో కిష్కింధపురి చూడండి" అంటూ చిరు చెప్పుకొచ్చారు.
ఇప్పుడు మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవికి కూడా సినిమా బాగా నచ్చినట్లు ఉందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. బాస్ కూడా స్టాంప్ వేసేశారని అంటున్నారు. ఇక మూవీకి తిరుగులేదని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదని చెబుతున్నారు. మరి మీరు మూవీ చూశారా? ఎలా అనిపించింది?
