Begin typing your search above and press return to search.

మారిన పెళ్లి సూత్రం: కిరణ్ రావ్ వ్యాఖ్యలతో మొదలైన ఆధునిక బంధాల చర్చ!

బాలీవుడ్ దర్శక, నిర్మాత కిరణ్ రావ్ నేటి తరం సంబంధాలు -పెళ్లి వ్యవస్థలో వస్తున్న మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Srikanth Kontham   |   5 Oct 2026 6:00 PM IST
మారిన పెళ్లి సూత్రం: కిరణ్ రావ్ వ్యాఖ్యలతో  మొదలైన ఆధునిక బంధాల చర్చ!
X

బాలీవుడ్ దర్శక, నిర్మాత కిరణ్ రావ్ నేటి తరం సంబంధాలు -పెళ్లి వ్యవస్థలో వస్తున్న మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత తరంతో పోలిస్తే ప్రస్తుత యువత ప్రేమ, శారీరక సాన్నిహిత్యం , పెళ్లి పట్ల ఎంతో స్వేచ్ఛాపూరితమైన దృక్పథంతో ఉన్నారని తెలిపారు. తన తరం నాటి పరిస్థితులను గుర్తుచేసుకుంటూ కిరణ్ రావ్ ఈ వ్యాఖ్య‌లు చేసారు. తమ కాలంలో ఒక వ్యక్తితో కేవలం ఒక నిర్దిష్టమైన రకమైన బంధం మాత్రమే ఆశించేవారని తెలిపారు. పెళ్లి చేసుకున్న తర్వాతే లేదా అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత మాత్రమే భాగస్వామ్యంతో భావోద్వేగ లేదా శారీరక బంధం ఏర్పడుతుందనే బలమైన నమ్మకం , నిబంధన ఉండేదని వివరించారు.

అయితే నేటి సమాజంలో ఆ ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయిందని కిరణ్ రావ్ అభిప్రాయపడ్డారు. నేటి యువత ఎలాంటి సంకోచాలు లేకుండా, స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. పాత నిబంధనలకు అతీతంగా నేటి తరం తమ భాగస్వామ్యాలను, ఇష్టాయిష్టాలను ధైర్యంగా ఎంచుకుంటోందని ప్రశంసించారు. ప్రస్తుత కాలంలో వివాహబంధంలోకి అడుగుపెట్టకుండానే వ్యక్తులు భావోద్వేగపరంగా, శారీరకంగా ఎంతో సంతృప్తికరమైన లోతైన బంధాలను ఏర్పరచుకోగలుగుతున్నారని పేర్కొన్నారు.

పెళ్లి అనేది మాత్రమే బంధానికి పునాది అనే పాత సూత్రం నేటి ప్రపంచంలో క్రమంగా మారుతోందని, యువత ఆలోచనల్లో ఈ మార్పు ఎంతో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నేటి తరం ఆలోచనలను బాధ్యతారాహిత్యంగా చూడకూడదని, దాన్ని ఒక స్వేచ్ఛ గా పరిగణించాలని కిరణ్ రావ్ సూచించారు. ఏ బంధంలోనైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఆకర్షణ, ఆ తర్వాత వారు తీసుకునే నిర్ణయాలు వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినవని.. ఈ ఆధునిక కోణాన్ని అర్థం చేసుకోవడం ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేమ, పెళ్లి , శారీరక సాన్నిహిత్యం పట్ల మనుషుల ఆలోచనా సరళి ఎలా మారుతుందో ? కిర‌ణ్ రావ్ వ్యాఖ్యలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే కిరణ్ రావ్ వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఒక్క రోజులో వచ్చినవి కావు. గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలోని ఆధునిక ఆలోచనాపరులైన మహిళలు, కళాకారులు సమాజంలో వస్తున్న మార్పును గమనిస్తూనే ఉన్నారు. `పెళ్లి అనేది బంధానికి ఆరంభం లేదా ముగింపు కాదనేది నేటి యువత నమ్మకం` అనే అంశాన్ని కిరణ్ రావ్‌తో గ‌తంలో చాలా మంది సెల‌బ్రిటీలు ఏకీ భ‌వించారు. ఇందులో ఆమె మాజీ భ‌ర్త అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. ఆయ‌న‌తో పాటు పూజాభ‌ట్, సుస్మితా సేన్, శోభితా దూళిపాళ్ల లాంటి వారు మ‌ద్ద‌తుగా నిలిచారు.