Begin typing your search above and press return to search.

'నో' చెప్పడమే కిరణ్‌కు ప్లస్ అయిందా?

కొన్ని సినిమాలను ఒప్పుకోవడం ఎంత కీలకమో, మరికొన్ని సినిమాలకు నో చెప్పడం కూడా అంతే కీలకమని టాలీవుడ్‌లో ఎన్నో సందర్భాలు నిరూపించాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   22 July 2026 1:51 PM IST
నో చెప్పడమే కిరణ్‌కు ప్లస్ అయిందా?
X

కొన్ని సినిమాలను ఒప్పుకోవడం ఎంత కీలకమో, మరికొన్ని సినిమాలకు నో చెప్పడం కూడా అంతే కీలకమని టాలీవుడ్‌లో ఎన్నో సందర్భాలు నిరూపించాయి. ఒక మంచి కథను వదులుకోవడం అంటే అది క‌చ్ఛితంగా రాంగ్ డెసిష‌నే అని అర్థం కాదు. ఒక హీరో కెరీర్‌లో ఆ టైమ్ లో ఉన్న మార్కెట్, నిర్మాత పెట్టుబడి, థియేట్రికల్ రికవరీ అవకాశాలు, ప్రేక్షకుల అంచనాలు వంటి అంశాలు ప్రతి డెసిష‌న్ ను ప్రభావితం చేస్తాయి. అందుకే నేటి పరిస్థితుల్లో స్క్రిప్ట్ నచ్చిందా లేదా అనే ఒక్క అంశం మాత్రమే కాదు, ఆ సినిమాను ఆ టైమ్ లో చేయడం సరైనదా కాదా అనేది కూడా అంతే ముఖ్యం.

రీసెంట్ గా హీరో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ కూడా ఇదే అంశంపై మరోసారి చర్చకు దారితీశాయి. ఒక దశలో తన వద్దకు వచ్చిన సంబరాల ఏటిగట్టు ప్రాజెక్ట్‌ను చివరికి చేయకుండా తప్పుకోవడం వెనుక క్రియేటివ్ రీజ‌న్స్ కంటే బిజినెస్ ఆలోచ‌న‌లే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పడం గమనార్హం. ఒక హీరోగా తన అప్పటి మార్కెట్‌ను అంచనా వేసుకుని, భారీ బడ్జెట్ సినిమా తనపై మోపడం నిర్మాతకు కూడా రిస్క్ అవుతుందని భావించి వెనక్కి తగ్గినట్లు ఆయన వివరించారు. స్టార్ ఇమేజ్ కంటే బిజినెస్ రియాలిటీకి ప్రాధాన్యం ఇవ్వడం ఇండస్ట్రీలో తరచూ కనిపించని విషయం.

టాలీవుడ్‌లో కథలు చేతులు మారడం కొత్త కాదు. ఒక హీరో అనుకుని మొద‌లైన ప్రాజెక్ట్ చివరకు మరో హీరోతో తెరకెక్కి స‌క్సెస్‌ను అందుకున్న సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. అయితే అలాంటి సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేయడం లేదా అవకాశం కోల్పోయాననే భావన వ్యక్తం చేయడం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కిరణ్ అబ్బవరం మాత్రం ఈ సినిమా సాయి ధరమ్ తేజ్‌తో రూపొందుతున్నందుకు సంతోషంగా ఉందని, ఆ సినిమా పెద్ద స‌క్సెస్ సాధిస్తే తనకే ముందుగా ఆనందంగా ఉంటుందని చెప్పడం ఇండస్ట్రీలో హెల్తీ ప్రొఫెషనల్ దృక్పథానికి ఉదాహరణగా నిలుస్తోంది.

సినీ పరిశ్రమలో ప్రతి డెసిష‌న్ స్టోరీ క్వాలిటీపైనే ఆధారపడదు. హీరో మార్కెట్, రిలీజ్ టైమ్, బడ్జెట్ పరిమాణం, ప్రీ-రిలీజ్ బిజినెస్, ఓటీటీ మరియు శాటిలైట్ వాల్యూస్ వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే సరైన టైమింగ్ కోసం ఒక ప్రాజెక్ట్‌ను వదులుకోవడం కొన్నిసార్లు కెరీర్‌ను కాపాడే నిర్ణయంగా మారుతుంది. చివరికి ఒక హీరో స‌క్సెస్ ను డిసైడ్ చేసేది తాను చేసిన సినిమాల నెంబ‌ర్ కాదు.. తన మార్కెట్‌కు, తన కెరీర్ కు సరిపోయే డెసిష‌న్స్ ను ఎంత తెలివిగా తీసుకున్నార‌నేదే. ఆ యాంగిల్ లో చూస్తే, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కంటే అవసరమైన చోట నో చెప్పగలగడం కూడా స‌క్సెస్‌ఫుల్ కెరీర్ ప్లానింగ్‌లో భాగమే అని చెప్పొచ్చు.