కిరణ్ అబ్బవరంది ఓవర్ కాన్ఫిడెన్సా? లేక గట్సా?
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్ ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు వద్ద నిలిచింది. హీరోగా వరుస ప్రయత్నాలు చేస్తూనే నిర్మాతగా మారి చేసిన తిమ్మరాజుపల్లి టీవీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు.
By: Sravani Lakshmi Srungarapu | 9 May 2026 12:19 PM ISTయంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్ ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు వద్ద నిలిచింది. హీరోగా వరుస ప్రయత్నాలు చేస్తూనే నిర్మాతగా మారి చేసిన తిమ్మరాజుపల్లి టీవీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. రిలీజ్‌కు ముందు టీమ్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తూ ఇది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చెప్పినా, థియేటర్లలో మాత్రం ఆ హడావిడి నిలబడలేదు. మొదటి మూడు రోజులు వచ్చిన బజ్ నాలుగో రోజుకే తగ్గిపోవడం, పబ్లిక్ టాక్ మిక్ట్స్ గా మారడం సినిమాపై నెగటివ్ ప్రభావం చూపించింది. నాన్ థియేట్రికల్ డీల్స్ వల్ల నిర్మాతగా కిరణ్ సేఫ్ అయ్యాడనే మాటలు వినిపించినా, ప్రేక్షకుల తీర్పులో మాత్రం అది విజయంగా నిలవలేదు. అయితే ఇక్కడే చాలామంది వెనక్కి తగ్గే పరిస్థితుల్లో కిరణ్ మాత్రం మరో పెద్ద రిస్క్‌కు సిద్ధమవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం కిరణ్ తన కొత్త ప్రాజెక్ట్ రియాలిటీ అనే సినిమాతో డైరెక్టర్ గా మారేందుకు రెడీ అవుతున్నాడు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, నిజమైన మనుషుల ఎమోషన్స్ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాను మే చివరి వారం నుంచి ప్రారంభించే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. భీమ్స్ సిసిరోలియో సంగీతంలో ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. చిన్న సినిమాల్లో మ్యూజిక్ ఎంత కీలకమో గతంలో చాలాసార్లు రుజువైంది. ముఖ్యంగా ఎమోషనల్ లేదా రియలిస్టిక్ డ్రామాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బలంగా ఉంటే ప్రేక్షకుల్లో కనెక్ట్ పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కిరణ్ ముందుగానే మ్యూజిక్‌పై ఫోకస్ పెట్టడం విశేషం. అయితే అసలు ప్రశ్న మాత్రం ఒకటే, ఆల్రెడీ రచయితగా తన ముద్ర వేసిన కిరణ్, ఇప్పుడు డైరెక్టర్ గా కూడా అదే స్థాయి ఇంపాక్ట్ చూపగలడా అన్నది.
ఎస్‌ఆర్ కళ్యాణమండపం సినిమా టైమ్ లో స్టోరీ, ఎమోషన్స్, సీన్స్ విషయంలో కిరణ్ చూపించిన ఇన్‌వాల్వ్‌మెంట్‌కు మంచి ప్రశంసలొచ్చాయి. ఆ సినిమాతో రైటింగ్ పరంగా తనకు మంచి టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు. ఇప్పుడు అదే ఎక్స్‌పీరియెన్స్ ను డైరెక్షన్ లోకి మార్చే ప్రయత్నం చేస్తున్నాడు కిరణ్. అయితే రైటర్‌గా సక్సెస్ కావడం ఒక విషయం అయితే, మెగా ఫోన్ పట్టుకుని మొత్తం సినిమాను నడిపించడం పూర్తిగా వేరే సవాల్. అందుకే రియాలిటీ మూవీ కిరణ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ మూవీగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈ జెనరేషన్ హీరోల్లో చాలా మంది రైటింగ్ లో భాగస్వామ్యం అవుతున్నా, డైరెక్షన్ బాధ్యతను భుజాలపై వేసుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదు. అలాంటి సమయంలో కిరణ్ అబ్బవరం తీసుకున్న ఈ డెసిషన్ కాస్త రిస్క్ అనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కిరణ్‌ది కాన్ఫిడెన్సా లేక కంటెంట్, తనపై తనకున్న గట్సా? అని అందరూ చర్చించుకుంటున్నారు. తిమ్మరాజుపల్లి టీవీ రిజల్ట్ తర్వాత కూడా కిరణ్ వెనక్కి తగ్గకుండా ముందుకు రావడం కొందరికి ధైర్యంగా కనిపిస్తుంటే, మరికొందరికి అది డేరింగ్ స్టెప్ గా అనిపిస్తోంది. కానీ సినీ పరిశ్రమలో చాలా సార్లు ఫెయిల్యూర్లే కొత్త మార్గాలు చూపించిన దాఖలాలున్నాయి. మరి ఇప్పుడు రియాలిటీతో కిరణ్ అబ్బవరం ఆ పాఠాలను సక్సెస్ గా మార్చుకుంటాడా? లేక మరో కొత్త పరీక్షను ఎదుర్కొంటాడా? అన్నదే ఆసక్తిగా మారింది.
