'K-ర్యాంప్' బ్రేక్ ఈవెన్ ఫినిష్.. కలెక్షన్స్ ఎంత?
ఈ దీపావళికి సరిగ్గా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'K-ర్యాంప్'. సినిమాకు మొదటి రోజు విమర్శకుల నుంచి పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు.
By: M Prashanth | 21 Oct 2025 12:56 PM ISTఈ దీపావళి బాక్సాఫీస్ వద్ద సందడి మామూలుగా లేదు. ఈసారి విడుదలకు ముందే విడుదలైన సినిమాలన్నీ ప్రమోషన్ ద్వారా బాగానే ఎట్రాక్ట్ చేశాయి. ఇక పండగ రేసులో నిలవడం, పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవడం అనేది ఏ సినిమాకైనా పెద్ద సవాల్. ముఖ్యంగా, క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పుడు, ఆ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ అనేది పూర్తిగా ప్రేక్షకుల మౌత్ టాక్‌పైనే ఆధారపడి ఉంటుంది.
ఈ దీపావళికి సరిగ్గా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'K-ర్యాంప్'. సినిమాకు మొదటి రోజు విమర్శకుల నుంచి పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు. దీంతో, ఈ పోటీలో సినిమా నిలదొక్కుకోవడం కష్టమేనని చాలామంది భావించారు. కానీ, చిత్రయూనిట్ మాత్రం మొదటి రోజు నుంచీ నెగిటివ్ ట్వీట్స్ కు, కలెక్షన్లకు సంబంధం లేదని చెబుతూ వస్తోంది.
ఆ మాటలను నిజం చేస్తూ, ఇప్పుడు 'K ర్యాంప్' నిర్మాతలు ఒక సంచలన ప్రకటనతో ముందుకొచ్చారు. సినిమా విడుదలై కేవలం మూడు రోజులు పూర్తయిన సందర్భంగా, వారు ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో సైతం ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. మేకర్స్ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రకారం, 'K-ర్యాంప్' చిత్రం మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹17.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.
అంతేకాదు, కేవలం మూడు రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్‌ను కూడా దాటేసిందని వారు అధికారికంగా ప్రకటించారు. ఈ దీపావళి పోటీలో ఇంత వేగంగా బ్రేక్ ఈవెన్ సాధించి, తమ సినిమానే "దీపావళి విన్నర్"గా నిలిచిందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయానికి కారణం పాజిటివ్ మౌత్ టాక్ అని చిత్రయూనిట్ చెబుతోంది. ముఖ్యంగా B, C సెంటర్లలో, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సినిమాకు అద్భుతమైన ఆదరణ లభిస్తోందని, థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయని వారు అంటున్నారు.
మంచి కంటెంట్‌ను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని 'K-ర్యాంప్' నిరూపించిందని వారు పేర్కొన్నారు. ఇక కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ఆడియెన్స్ ఎప్పుడైనా కనెక్ట్ అవుతారని మరోసారి రుజువైందని అంటున్నారు. మొత్తం మీద, హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం, రివ్యూలతో సంబంధం లేకుండా కలెక్షన్లను రాబడుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ పండగ సెలవుల తర్వాత కూడా సినిమా ఇదే ఊపును కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి.
