అబ్బవరం నేర్పిస్తున్న పాఠం
2000 ప్రాంతంలో యూత్‌లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకున్న తరుణ్, ఉదయ్ కిరణ్ తర్వాత ఎలా డౌన్ అయిపోయారో ముందుతరం ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది.
By: Garuda Media | 28 July 2026 4:22 PM ISTఏ రంగంలో అయినా సరే సక్సెస్ సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టం. అందులోనూ సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉండే, సక్సెస్ అన్నది గాల్లో దీపంలా ఉండే ఫిలిం ఇండస్ట్రీలో ఇది ఇంకా కష్టం. ఒక దశలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుని ఆ తర్వాత కనుమరుగైపోయిన హీరోలు చాలామందే ఉన్నారు. 2000 ప్రాంతంలో యూత్‌లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకున్న తరుణ్, ఉదయ్ కిరణ్ తర్వాత ఎలా డౌన్ అయిపోయారో ముందుతరం ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది.
వారికి ముందు, తర్వాత కూడా అలాంటి హీరోలున్నారు. ఇక్కడ కీలక పాత్ర పోషించేది జడ్జిమెంట్ స్కిల్సే. ఎలాంటి కథలు ఎంచుకుంటారన్న దాన్ని బట్టే కెరీర్ నిర్ణయమవుతుంది. డబ్బు కోసమో లేదంటే మొహమాట పడో లేదా కథలను సరిగా అంచనా వేయకపోవడం వల్లో తప్పటడుగులు పడితే.. కెరీర్ తిరగబడిపోతుంది. టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం కూడా ఒక దశలో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు.
రాజావారు రాణివారు, ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన తర్వాత సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, మీటర్, రూల్స్ రంజన్ లాంటి పేలవమైన సినిమాలు చేశాడు. మధ్యలో సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలతో పర్వాలేదనిపించినా.. పైన చెప్పుకున్న చిత్రాలు మాత్రం అతడి కెరీర్‌ను బాగా దెబ్బ తీశాయి. ముఖ్యంగా మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు చూసిన ప్రేక్షకులు హాహాకారాలు చేస్తూ బయటికి వచ్చారు. కిరణ్ మీద నమ్మకం కోల్పోయారు. సోషల్ మీడియాలో తనపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఆ దశలో బ్రేక్ తీసుకుని కెరీర్‌ను చక్కదిద్దుకున్న తీరు స్ఫూర్తిదాయకం.
బాగా టైం తీసుకుని చేసిన ‘క’ సినిమాతో కిరణ్ మళ్లీ బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. దాని కంటే ముందు కెరీర్ పేలవ దశలో ఉండగా ఓకే చేసిన ‘దిల్ రుబా’ దెబ్బ కొట్టినా.. ‘కే ర్యాంప్’తో మళ్లీ సక్సెస్ సాధించాడు. ఇప్పుడు ‘చెన్నై లవ్ స్టోరీ’తో కెరీర్లో అతి పెద్ద విజయం దిశగా అడుగులు వేస్తున్నాడు. ఒక దశలో కిరణ్ సినిమా అంటే పట్టించుకోని ప్రేక్షకులు.. ఇప్పుడు తన సినిమా అంటే ఏదో ప్రత్యేకత ఉంటుందనే నమ్మకంతో థియేటర్లకు వస్తున్నారు. క.. కే ర్యాంప్.. చెన్నై వ్ స్టోరీ.. ఈ మూడు చిత్రాల్లో ఒకదానికి ఇంకోదానికి పోలిక లేని విధంగా వైవిధ్యం చూపించి కిరణ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ క్రియేట్ అయ్యాయి. మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఎదుగుతున్నాడు. తర్వాత తన లైనప్ కూడా ఆసక్తికరంగా ఉంది. స్వీయ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ మూవీ చేస్తున్న కిరణ్.. తర్వాత సుకుమార్ క్యాంపులోకి అడుగు పెడుతున్నాడు. సుక్కు అసిస్టెంట్ వీర కోగటం దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఒక థ్రిల్లర్ చేస్తున్నాడు. డియర్ కామ్రేడ్ ఫేమ్ భరత్ కమ్మ దర్శకత్వంలో గువ్వల చెరువు ఘాట్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. ఒకసారి కింద పడ్డాక అబ్బవరం లేచి నిలబడ్డ తీరు.. కథల ఎంపికలో చూపిస్తున్న నైపుణ్యం ఇండస్ట్రీలో యువ కథానాయకులకు ఒక స్ఫూర్తి పాఠమే.
