Begin typing your search above and press return to search.

నల్ల పిల్లితో అబ్బవరం ‘హతః’

కానీ ఇందులో హీరో రోల్, కథ ఏంటి అనే విషయం కంటే ముందుగా ఒక నల్ల పిల్లినే చూపించారు. చిన్న వీడియోలో చీకటిగా ఉన్న పెట్టెలో పిల్లి కనిపిస్తుండగా, చివర్లో టైటిల్ రివీల్ చేశారు.

By:  M Prashanth   |   31 Aug 2026 12:08 PM IST
నల్ల పిల్లితో అబ్బవరం ‘హతః’
X

కిరణ్ అబ్బవరం నిర్మాతగా చేస్తున్న కొత్త సినిమా ‘హతః’ నుంచి మొదటి అప్డేట్ వచ్చింది. కానీ ఇందులో హీరో రోల్, కథ ఏంటి అనే విషయం కంటే ముందుగా ఒక నల్ల పిల్లినే చూపించారు. చిన్న వీడియోలో చీకటిగా ఉన్న పెట్టెలో పిల్లి కనిపిస్తుండగా, చివర్లో టైటిల్ రివీల్ చేశారు. పోస్టర్‌లో కూడా అదే పిల్లిని ఎర్రగా ఉన్న చేతులు పట్టుకుని కనిపించడం చూస్తే మొదటి నుంచే ఏదో వింత ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది.

“పిల్లి బతికే ఉందా..?” అనే లైన్ కూడా వీడియో చివర్లో పెట్టారు. అసలు పిల్లి కథలో పాత్రేనా, లేక ఏదైనా గుర్తుగా మాత్రమే వాడారా అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కొద్దిరోజుల క్రితం సినిమా ప్రకటించినప్పుడు కూడా భయంకరమైన పక్షి కాలును పోలిన ఒక రూపం మాత్రమే చూపించారు. ఇప్పుడు నల్ల పిల్లిని ముందుకు తెచ్చారు. రెండు అప్డేట్స్ వచ్చినా కథ ఎక్కడ నడుస్తుందో మాత్రం ఇంకా బయటకు రాలేదు.

‘హతః’తో కిరణ్ ఈసారి హీరోగా కాకుండా నిర్మాతగా ఉన్నాడు. ఇటీవల ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో నిర్మాతగా మొదటి సినిమా చేసిన అతను, ఇప్పుడు రెండో ప్రయత్నాన్ని పూర్తిగా వేరే జానర్‌లో తీసుకొస్తున్నాడు. మొదటి సినిమాలో దాదాపు 50 మంది కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వగా, ఇప్పుడు కూడా కొత్త టీమ్‌తోనే ముందుకు వెళ్తున్నాడు.

ఈ సినిమాకు అనూష్ గోరక్ కథ, దర్శకత్వంతో పాటు కెమెరా బాధ్యతలు కూడా చూసుకుంటున్నాడు. కుష్లూ మద్దాల, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేసిన్ జార్జ్ సంగీతం అందిస్తున్నాడు. కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి సినిమాను నిర్మిస్తున్నాయి.

కిరణ్‌కు హీరోగా ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయినా వాటి మధ్యలో తన బ్యానర్ నుంచి మరో టీమ్ సినిమాను తీసుకురావడం స్పెషల్. పైగా తన పేరుతో ప్రచారం మొదలుపెట్టినా పోస్టర్‌లో తన ఫొటో పెట్టకుండా సినిమా కాన్సెప్ట్‌కే ఎక్కువ చోటిచ్చాడు. ‘హతః’ అనే పేరుకు అర్థం ఏంటి, నల్ల పిల్లికి దానితో సంబంధం ఏంటి అనే విషయాలు క్యూరియాసిటినీ క్రియేట్ చేశాయి.



ఇక తర్వాత వచ్చేది టీజర్. కిరణ్ కూడా “మీరు ఊహించనిది” అంటూ త్వరలో టీజర్ వస్తుందని చెప్పాడు. ఇప్పటివరకు నటీనటుల లుక్స్ కూడా పూర్తిగా బయటపెట్టలేదు. టీజర్‌లో కథకు సంబంధించిన మొదటి క్లూ ఇస్తారా, లేక నల్ల పిల్లి వెనక ఉన్న విషయం మాత్రమే బయటపెడతారా అన్నది అక్కడే తెలుస్తుంది.