Begin typing your search above and press return to search.

రూ.100 కోట్లలో నిర్మాతకు ఎంతొస్తుంది? అబ్బవరం సూటి ప్రశ్న!

కానీ ఆ పోస్టర్‌ పై కనిపించే నెంబర్ లో నిజంగా నిర్మాత చేతికి ఎంత డబ్బు వస్తుంది? ఈ ప్రశ్నను తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ముందుకు తెచ్చారు.

By:  M Prashanth   |   15 July 2026 6:53 PM IST
రూ.100 కోట్లలో నిర్మాతకు ఎంతొస్తుంది? అబ్బవరం సూటి ప్రశ్న!
X

సినిమా విడుదలైన కొద్ది రోజులకే రూ.100 కోట్ల క్లబ్‌ లో చేరింది, బాక్సాఫీస్‌ ను షేక్ చేసిందనే పోస్టర్లు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. కానీ ఆ పోస్టర్‌ పై కనిపించే నెంబర్ లో నిజంగా నిర్మాత చేతికి ఎంత డబ్బు వస్తుంది? ఈ ప్రశ్నను తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ముందుకు తెచ్చారు. సినిమా కలెక్షన్ల గురించి ప్రేక్షకుల్లో ఉన్న అపోహలను ఆయన ఆసక్తికరంగా వివరించారు.

తన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ ప్రమోషన్ల సందర్భంగా మాట్లాడిన కిరణ్ అబ్బవరం, "ఒక సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పడం ఒక విషయం. కానీ ఆ మొత్తం నిర్మాత ఖాతాలో పడుతుందని అనుకోవడం సరైంది కాదు" అంటూ పరోక్షంగా పేర్కొన్నారు. సినిమా వ్యాపారం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పరోక్షంగా అభిప్రాయపడ్డారు.

సాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందే నిర్మాతలు థియేట్రికల్ హక్కులను వివిధ ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లకు విక్రయిస్తారు. అంటే మూవీ విడుదల తర్వాత వచ్చే థియేటర్ల ఆదాయం నేరుగా నిర్మాతకు వెళ్లదు. ఆ రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్లకే ప్రధానంగా ఆ ఆదాయం చెందుతుంది. సినిమా సూపర్ హిట్ అయితే ఎక్కువ లాభాలు వారికి వస్తాయి. ఫ్లాప్ అయితే నష్టాలు కూడా వారే భరిస్తారు. కిరణ్ అబ్బవరం చెప్పినదీ ఇదే.

"సినిమాను ముందే అమ్మేశాం కదా సార్. డిస్ట్రిబ్యూషన్‌ కు ఇచ్చేశాం. ఆ తర్వాత సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేది రికార్డుల్లో ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు. బాక్సాఫీస్ నెంబర్స్ చూసి నిర్మాత సంపాదనను అంచనా వేయడం సరైన పద్ధతి కాదని పరోక్షంగా అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ఒక సినిమా ఆర్థిక లెక్కలు చాలా క్లిష్టంగా ఉంటాయి. థియేటర్ గ్రాస్ కలెక్షన్లలో నుంచి జీఎస్టీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్‌లు, థియేటర్ వాటాలు, డిస్ట్రిబ్యూటర్ షేర్లు వంటి అనేక అంశాలు మినహాయించిన తర్వాతే అసలు ఆదాయం ఎంత అనేది తెలుస్తుంది.

అందుకే గ్రాస్ కలెక్షన్లు, షేర్ కలెక్షన్లు, నిర్మాతకు వచ్చిన మొత్తం అనే మూడు అంశాలను వేర్వేరుగా చూడాల్సి ఉంటుంది. ఇటీవల చాలా సినిమాలు విడుదలకు ముందే శాటిలైట్, ఓటీటీ, ఆడియో, డబ్బింగ్ హక్కుల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నాయి. కొన్ని సందర్భాల్లో థియేట్రికల్ విడుదలకు ముందే నిర్మాత పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది. మరికొన్ని సందర్భాల్లో థియేటర్లలో పెద్ద కలెక్షన్లు వచ్చినా నిర్మాతకు లాభం పెద్దగా ఉండకపోవచ్చు.

అందుకే ఇప్పుడు కలెక్షన్లు ఎంత? అనే ప్రశ్నతో పాటు బిజినెస్ ఎంత?, నిర్మాతకు ఎంత మిగిలింది? అనే ప్రశ్నలకూ ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రేక్షకులు చూస్తున్న రూ.100 కోట్ల పోస్టర్ వెనుక ఉన్న అసలు కథ వేరని కిరణ్ అబ్బవరం వ్యాఖ్యలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. సినిమా విజయాన్ని కేవలం కలెక్షన్లతో మాత్రమే కొలవలేమని, నిర్మాతకు వచ్చిన లాభం, డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన రిటర్న్స్, సినిమా మార్కెట్‌ లో ప్రభావం ముఖ్యమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అందుకే పోస్ట్ పై రూ.100 కోట్లు కనిపించినా, నిర్మాత ఖాతాలో మాత్రం ఆ మొత్తం అన్నిసార్లు కూడా కనిపించకపోవచ్చు!