Begin typing your search above and press return to search.

పెద్ద హీరోలతో పోటీకి కిరణ్ రెడీ.. ధైర్యమా, రిస్కా?

సాధారణంగా పండగ సీజన్ అంటే స్టార్ హీరోల భారీ సినిమాల‌ ఆధిపత్యం ఉంటుంది. అలాంటి టైమ్ లో ఒక కామెడీ ఎంటర్‌టైనర్‌తో రంగంలోకి దిగడం కిరణ్ అబ్బవరం లెక్కలపై ఆసక్తిని పెంచుతోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   30 July 2026 3:45 PM IST
పెద్ద హీరోలతో పోటీకి కిరణ్ రెడీ.. ధైర్యమా, రిస్కా?
X

కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో ఒకేసారి రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారనే చర్చ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. కిర‌ణ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. వాస్తవానికి ఆ సినిమా సెప్టెంబ‌ర్ లో రిలీజ‌వాల్సింది కానీ ఇప్పుడు దాన్ని సెప్టెంబ‌ర్ నుంచి సంక్రాంతి బరిలోకి తీసుకురావడం పెద్ద వ్యూహాత్మక రిస్క్‌గా కనిపిస్తోంది. సాధారణంగా పండగ సీజన్ అంటే స్టార్ హీరోల భారీ సినిమాల‌ ఆధిపత్యం ఉంటుంది. అలాంటి టైమ్ లో ఒక కామెడీ ఎంటర్‌టైనర్‌తో రంగంలోకి దిగడం కిరణ్ అబ్బవరం లెక్కలపై ఆసక్తిని పెంచుతోంది.

ఇటీవలి కాలంలో యాక్షన్, పాన్ ఇండియా, మాస్ సినిమాల హవా ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, పండగ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కామెడీ సినిమాల‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి సీజ‌న్ లో ఫ్యామిలీ ఆడియ‌న్స్ థియేటర్లకు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ నేపథ్యంలో యాక్షన్ కాకుండా కామెడీ జానర్ కావ‌డంతో ఆ సినిమాకు సంక్రాంతి సీజ‌న్‌ను ఎంచుకోవడం కూడా ఆలోచించి తీసుకున్న డెసిష‌న్ గానే సినీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే అసలు రిస్క్ డైరెక్ట‌ర్ గా మారడంలోనే ఉంది. నటుడిగా ఒక పాత్రకు బాధ్యత వహించడం వేరు, డైరెక్ట‌ర్ గా మొత్తం సినిమాను మోయడం వేరు. కథ, స్క్రీన్‌ప్లే, కామెడీ టైమింగ్, ఎమోషనల్ బ్యాలెన్స్, నటీనటుల పనితీరు, సాంకేతిక విభాగాల సమన్వయం వంటి ప్రతి అంశంపై పూర్తి బాధ్యత డైరెక్ట‌ర్‌పైనే ఉంటుంది. అందుకే హీరో నుంచి డైరెక్ట‌ర్‌గా మారే ప్రయత్నాన్ని ఇండస్ట్రీలో ఎప్పుడూ సవాల్‌గా చూస్తారు.

దీనికి తోడు రిలీజ్ టైమింగ్‌ను మార్చడం మరో కీలక నిర్ణయం. సెప్టెంబర్‌లో రిలీజయ్యే సినిమా సంక్రాంతికి వాయిదా పడితే పోటీ స్థాయి పూర్తిగా మారిపోతుంది. పెద్ద సినిమాలు, భారీ ప్రమోషన్లు, ఎక్కువ స్క్రీన్‌ల కోసం పోటీ వంటి అంశాలు సహజంగానే ప్రెజ‌ర్‌ను పెంచుతాయి. అయినప్పటికీ, సంక్రాంతి సీజన్‌లో స‌క్సెస్ ను అందుకుంటే దాని ఇంపాక్ట్ కూడా అంతే భారీగా ఉంటుంది. సాధారణ సీజన్‌లో వచ్చే హిట్ కంటే పండగ సీజన్‌లో వచ్చే హిట్‌కు మార్కెట్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది.

ఇక్కడే రిస్క్‌కు తగిన రివార్డ్ అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ సినిమాలో మంచి కంటెంట్ ఉండి, కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుని, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే సంక్రాంతి సీజన్‌లో భారీ కలెక్షన్లు సాధించే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. మౌత్ పబ్లిసిటీ బలంగా పనిచేస్తే పెద్ద సినిమాల మధ్య కూడా ఒక మంచి కామెడీ ఎంటర్‌టైనర్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవచ్చు. అందుకే కిరణ్ అబ్బవరం తీసుకున్న ఈ డెసిష‌న్ సాధారణ రిలీజ్ ఛేంజ్ గా కాకుండా, డైరెక్ట‌ర్ గా తనను తాను నిరూపించుకోవాలనే డేరింగ్ డెసిష‌న్‌గా సినీ విశ్లేషకులు చూస్తున్నారు. ఈ రిస్క్ చివరికి ఎంత పెద్ద రివార్డ్‌గా మారుతుందనేదే దానిపైనే ఇప్పుడు ఆస‌క్తి నెల‌కొంది.