హీరోగా, నిర్మాతగా హిట్.. మరి డైరెక్టర్ గా ఏం చేస్తారో?
టాలీవుడ్ లో సొంత టాలెంట్ తో ఎదిగిన యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం పేరు కచ్చితంగా ముందుంటుంది.
By: M Prashanth | 16 March 2026 6:04 PM ISTటాలీవుడ్ లో సొంత టాలెంట్ తో ఎదిగిన యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం పేరు కచ్చితంగా ముందుంటుంది. మూవీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినిమాలపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా దర్శకుడిగా మారబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
కిరణ్ అబ్బవరం తొలి సినిమా రాజావారు రాణిగారు అన్న సంగతి తెలిసిందే. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చి డెబ్యూతో మంచి రెస్పాన్స్ అందుకున్నారు. తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారారు.
మధ్యలో కొన్ని చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా.. ఇటీవల విడుదలైన క సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఆ మూవీ ఆయన కెరీర్ లో మంచి విజయంగా నిలిచింది. రీసెంట్ గా కే-ర్యాంప్ మూవీతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించారు. ఆ సినిమా దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో కిరణ్ మార్కెట్ కూడా పెరిగిందని టాక్.
అయితే హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కిరణ్ అబ్బవరం అడుగులు వేస్తున్నారు. క సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన.. తిమ్మరాజు పల్లి టీవీ అనే మరో ప్రాజెక్ట్ కు కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు దర్శకుడిగా కూడా మారబోతున్నారన్న వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కిరణ్ స్వీయ దర్శకత్వంలో ఇప్పుడు ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఆ ప్రాజెక్టుకు జాయ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సుధాకర్ చాగంటి నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారని సమాచారం. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వినికిడి. దీంతో కిరణ్ ఎలాంటి కథతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు తన సినిమాల్లో కామెడీ, లవ్ ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యం ఇచ్చిన కిరణ్.. దర్శకుడిగా కూడా అలాంటి జానర్ ను ఎంచుకుంటారా? లేక పూర్తిగా భిన్నమైన కథతో వస్తారా? అన్నది క్వశ్చన్ మార్క్. ఇక ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చేతిలో ఉన్న ప్రాజెక్టుల విషయానికి వస్తే, చెన్నై లవ్ స్టోరీలో ఆయన నటిస్తున్నారు. ఏదేమైనా నటుడిగా, నిర్మాతగా తన జర్నీ కొనసాగిస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు దర్శకుడిగా కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. హీరోగా, నిర్మాతగా హిట్లు అందుకున్న ఆయన.. దర్శకుడిగా కూడా అదే జోష్ కొనసాగిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.
