నిజ జీవితంలో జరిగిన సంఘటనలే.. చెన్నై లవ్ స్టోరీ
తన జీవితంలో జరిగిన ఇన్ని పాయింట్స్ ఒక కథలో ఎలా వచ్చాయి అని వెంటనే డైరెక్టర్ ను కిరణ్ అడిగాడట.
By: M Prashanth | 29 July 2026 9:35 AM ISTచెన్నై లవ్ స్టోరీ సినిమా సక్సెస్ మీట్ లో హీరో కిరణ్ అబ్బవరం ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమా కథకు తన నిజ జీవితానికి ఉన్న ఒక ఎమోషనల్ లింక్ ని బయటపెట్టాడు. రిలీజ్ కి ముందే ఈ సంగతి చెబితే జనాలకు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అనిపిస్తుందని అప్పుడు కావాలనే ఆగిపోయాడు అట. అందుకే సినిమా సక్సెస్ అయ్యాక ఈ సీక్రెట్ ని రివీల్ చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఈ విషయం కనీసం తమ టీమ్ కు కూడా ఇప్పటివరకు తెలియదని చెప్పడం విశేషం.
దర్శకుడు రవి ఈ సినిమా కథను తనకు వినిపిస్తున్నప్పుడు కిరణ్ కు ఒక వింతైన అనుభవం ఎదురైందట. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ చెబుతున్నప్పుడు ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యానని చెప్పాడు. డైరెక్టర్ సీన్ టు సీన్ వివరిస్తుంటే, తన సొంత అన్నయ్య జీవితంలో జరిగిన సంఘటనలే కళ్ల ముందు మళ్లీ జరిగినట్లు అనిపించాయని అన్నాడు. ఒక దర్శకుడు రాసుకున్న కథలో, తన జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఎలా వచ్చాయా అని ఆ క్షణంలో తనకు చాలా ఆశ్చర్యం వేసిందని కిరణ్ గుర్తుచేసుకున్నాడు.
సినిమాలో చూపించిన కొన్ని సన్నివేశాలు యాజిటీజ్ గా తన జీవితంలో జరిగినవే అని కిరణ్ వివరించాడు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పిల్లల కోసం అన్నయ్య స్నాక్స్ తీసుకురావడానికి బైక్ మీద వెళ్లడం లాంటి సీన్స్ చూస్తే తన అన్నయ్యే గుర్తొచ్చాడని ఎమోషనల్ అయ్యాడు. అలాగే కర్నూలుకు వెళ్లే సీన్ లో కూడా సేమ్ టు సేమ్ తన ప్లేస్ లో తాను, ఇంకో ప్లేస్ లో అన్నయ్య ఉన్నట్లుగా ఆ స్ట్రక్చర్ మొత్తం తన రియల్ లైఫ్ కు దగ్గరగా ఉందని సక్సెస్ మీట్ లో తెలిపాడు.
తన జీవితంలో జరిగిన ఇన్ని పాయింట్స్ ఒక కథలో ఎలా వచ్చాయి అని వెంటనే డైరెక్టర్ ను కిరణ్ అడిగాడట. అన్నయ్యకు జరిగిన సంఘటనలు యథావిధిగా ఎలా రాశారు అని ప్రశ్నించినట్లు ఆ వేదిక మీద పంచుకున్నాడు. తెలియకుండానే కొన్ని విషయాలు ఇలా ఒక వేవ్ లాగా మన దగ్గరికి వస్తూ ఉంటాయని, ఈ సినిమా తన జీవితానికి అంతలా కనెక్ట్ అయిందని చెబుతూ కిరణ్ కాస్త భావోద్వేగానికి లోనయ్యాడు. ఒక రకంగా ఈ సినిమా తన సొంత కథలా అనిపించిందని అన్నాడు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని పర్సనల్ సీన్స్ చేస్తున్నప్పుడు తనకు మనసులో చాలా బాధగా అనిపించిందని కిరణ్ అన్నాడు. అన్నయ్యతో తనకున్న జ్ఞాపకాలను మళ్లీ కెమెరా ముందు రీక్రియేట్ చేస్తున్నప్పుడు ఆ పెయిన్ బాగా అనుభవించినట్లు ఓపెన్ గా చెప్పాడు. తన పర్సనల్ లైఫ్ తో ఇంతలా ముడిపడి ఉన్న కథ కాబట్టే ఈ ప్రాజెక్ట్ కిరణ్ కు చాలా స్పెషల్ గా మారిందని తెలుస్తోంది. ఆ ఫీలింగ్ తోనే ఆయన ఆ పాత్రలో అంత సహజంగా నటించగలిగాడు అని చెప్పొచ్చు.
తన జీవితానికి సంబంధించిన ఇంత మంచి కథను తనకు ఇచ్చినందుకు దర్శకుడికి కిరణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు. ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు తన మనసుకు దగ్గరైన పాత్రను పోషించే అవకాశం రావడం నిజంగా ఈ హీరోకు ఒక స్వీట్ మెమొరీ లాంటిది. సక్సెస్ మీట్ లో ఈ పర్సనల్ ఎమోషన్ ను పంచుకోవడం ద్వారా సినిమా మీద జనాల్లో కూడా ఒక మంచి పాజిటివ్ ఫీల్ క్రియేట్ అయింది.
