Begin typing your search above and press return to search.

కిర‌ణ్ దొరకడం మా అదృష్టం.. హీరో సంస్కారానికి మేకర్స్ ఫిదా!

సినీ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఎంత ముఖ్యమో, ఒక సినిమా వెనుక నటీనటులు చూపించే డెడికేష‌న్ కూడా అంతే కీలకం.

By:  Sravani Lakshmi Srungarapu   |   25 July 2026 3:41 PM IST
కిర‌ణ్ దొరకడం మా అదృష్టం.. హీరో సంస్కారానికి మేకర్స్ ఫిదా!
X

సినీ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఎంత ముఖ్యమో, ఒక సినిమా వెనుక నటీనటులు చూపించే డెడికేష‌న్ కూడా అంతే కీలకం. ముఖ్యంగా ఈ రోజుల్లో రెమ్యూనరేషన్ విషయంలో చిన్న తేడా వచ్చినా, రెమ్యూన‌రేష‌న్ ను ఇంకా బాకీ ఉంచినా ఆ సినిమా డబ్బింగ్ స్టూడియోల మెట్లు ఎక్కడానికి కూడా నిరాకరించే పరిస్థితులను తరచూ చూస్తుంటాం. అయితే, అలాంటి ధోరణికి భిన్నంగా నిలబడి, కేవలం సినిమాపై ఉన్న ప్రేమతో, నిర్మాతల కష్టాన్ని తన కష్టంగా భావించిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారారు.

చెన్నై లవ్ స్టోరీ మూవీ స‌క్సెస్ సాధించిన సందర్భంగా మేక‌ర్స్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో నిర్మాత సాయి రాజేష్ వెల్లడించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా చిన్న లేదా లిమిటెడ్ బడ్జెట్ సినిమాలకు ప్రమోషన్ల నుంచి ప్రొడక్షన్ వ్యవహారాల వరకు ప్రొడ్యూసర్లే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ సినిమా విషయంలో హీరో కిరణ్ అబ్బవరం కేవలం ఒక నటుడిగానే కాకుండా, ఒక డైరెక్ట‌ర్‌లా, ఒక నిర్మాతలా సర్వస్వం తానై వ్యవహరించారని సాయి రాజేష్ ఎమోష‌న‌ల్ గా చెప్పుకొచ్చారు.

ఈ రోజుల్లో రెమ్యూనరేషన్ బాకీ ఉంటే డబ్బింగ్ చెప్పడానికి కూడా చాలా మంది రార‌ని, కానీ కిరణ్‌కు ఇప్పటివరకు రెమ్యూన‌రేష‌న్ ను ఇంకా పూర్తిగా ఇవ్వ‌లేద‌ని, ఆయ‌నకు బాకీతోనే సినిమాను థియేటర్లలోకి తీసుకువచ్చామ‌ని, అయినా సరే, ఒక్క రోజు కూడా డబ్బుల గురించి ఆయన త‌మ‌ని అడగలేదని, కిరణ్ లాంటి నటుడు దొరకడం త‌మ‌ అదృష్ట‌మ‌ని వ్యాఖ్యానించారు. సినిమా కోసం కిరణ్ రోజులో 24 గంటలూ శ్రమించారని, ప్రమోషన్లను సైతం తన భుజాలపై వేసుకుని సులువు చేశారని పొగిడారు.

ఇండ‌స్ట్రీలో రూపాయి లెక్కలు రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో, ఒక యంగ్ హీరో చూపించిన ఈ ప్రొఫెషనలిజం మరియు నిబద్ధత ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. రెమ్యూన‌రేష‌న్ బాకీలు ఉన్నప్పటికీ సినిమా రిలీజ్‌కు ఏమాత్రం అడ్డంకి కాకుండా, మేకర్స్‌కు పూర్తీ స్థాయిలో సహకరించిన కిరణ్ డెడికేషన్ పై నెటిజన్లు, సినీ వర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో చెన్నై లవ్ స్టోరీ ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని, ఆయన చూపిన ఈ సంస్కారమే ఆయనను మున్ముందు మరిన్ని ఎత్తులకు తీసుకెళ్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.