'కెరీర్ లోనే బెస్ట్ మూవీ'.. లవ్ స్టోరీపై అబ్బవరం ఫుల్ కాన్ఫిడెన్స్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీపై ఫుల్ గా నమ్మకం వ్యక్తం చేశారు.
By: M Prashanth | 18 July 2026 9:05 PM ISTయంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీపై ఫుల్ గా నమ్మకం వ్యక్తం చేశారు. జూలై 24న విడుదలకు సిద్ధమవుతున్న ఆ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన కిరణ్ అబ్బవరం.. తన కెరీర్ లో ఆ చిత్రం ప్రత్యేక స్థానం సంపాదిస్తుందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లో శనివారం జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
సాధారణంగా హీరోలు తమ సినిమాలపై నమ్మకం వ్యక్తం చేస్తుంటారు. కానీ కిరణ్ అబ్బవరం మాత్రం చెన్నై లవ్ స్టోరీ గురించి మాట్లాడిన తీరు చూస్తే, ఆ సినిమాపై ఆయనకు ఎంతటి నమ్మకం ఉందో అర్థమవుతోంది. "సినిమా ఇంకా తొమ్మిది రోజుల్లో వస్తుంది. అది చాలా మెమొరబుల్ ఫిల్మ్. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా" అంటూ చెప్పడం విశేషం. అంతేకాదు, "కొన్ని మూవీలపై మీద మనకు తెలియకుండా ఓ ఫీలింగ్ కలుగుతుంది. ఆ సినిమా మన కెరీర్ లో కచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుందని అనిపిస్తుంది. ఎప్పుడైనా మళ్లీ చూసుకోవాలనిపించే సినిమాలు ఉంటాయి. చెన్నై లవ్ స్టోరీ కూడా నా కెరీర్‌లో అలాంటి సినిమానే" అంటూ అంచనాలను బహిరంగంగానే వెల్లడించారు.
గత కొన్నేళ్లుగా తన సినీ జర్నీని గమనిస్తున్న మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన కిరణ్.. "నా జర్నీని ఐదారేళ్లుగా చూస్తున్నారు. నేను ఎదగాలనే ఆలోచనతో ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నారు. అందుకే మీడియా వారందరికీ థ్యాంక్స్" అన్నారు. తన ప్రయాణంలో మీడియా పాత్రను గుర్తు చేసుకోవడం కూడా కార్యక్రమంలో ప్రత్యేకంగా నిలిచింది. సినిమా కథపై నేరుగా పెద్దగా మాట్లాడకపోయినా, ఆ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని కిరణ్ పలుమార్లు వ్యక్తం చేశారు.
"సినిమాను నేను పూర్తిగా నమ్ముతున్నా. అందరికీ నచ్చాలి. అందరినీ మెప్పించాలి. నిర్మాతలకు ఊహించినంత డబ్బులు రావాలి" అని అన్నారు. హీరోగా తన సినిమా విజయం మాత్రమే కాకుండా నిర్మాతల విజయాన్ని కూడా కోరుకోవడం గమనార్హం. హీరోయిన్ శ్రీ గౌరిప్రియ గురించి కూడా కిరణ్ ప్రశంసలు కురిపించారు. "గౌరీ చాలా ఫ్రెండ్లీ ఆర్టిస్ట్" అంటూ ఆమెతో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ను పంచుకున్నారు. అలాగే లవ్ గురించి తన పర్సనల్ ఫీలింగ్ ను కూడా వెల్లడించారు.
"నా దృష్టిలో చివరకు కలిసి జీవించే ప్రేమే బెస్ట్" అని చెప్పడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తే చెన్నై లవ్ స్టోరీ కేవలం మరో ప్రేమకథగా కాకుండా, ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాగా ఉండబోతుందని అర్థమవుతోంది. ఇప్పటికే బేబి, కలర్ ఫోటో వంటి సక్సెస్ ఫుల్ ప్రేమకథా చిత్రాలను అందించిన ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నిర్మాతలుగా ఉండటం కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. అయితే మూవీ విజయాన్ని చివరికి నిర్ణయించేది ప్రేక్షకులే. కానీ విడుదలకు ముందే ఇంత ధీమాగా మాట్లాడటం చూస్తుంటే, చెన్నై లవ్ స్టోరీపై అబ్బవరం పూర్తి నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ కు బాక్సాఫీస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
