Begin typing your search above and press return to search.

తిరుపతి ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం స్పీచ్.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటూ..

జూలై 25న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలోని ‘జిగితర’ అనే మూడవ సింగిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ శనివారం రాత్రి తిరుపతిలోని ఇందిరా మైదానంలో చాలా గ్రాండ్ గా జరిగింది.

By:  M Prashanth   |   21 Jun 2026 10:28 AM IST
తిరుపతి ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం స్పీచ్.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటూ..
X

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన న్యూ మూవీ 'చెన్నై లవ్ స్టోరీ'. ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహించగా, ‘బేబీ’ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ కథను అందిస్తూ నిర్మించారు. ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి 'మెలోడీ బ్రహ్మ' మణిశర్మ సంగీతాన్ని అందించారు. జూలై 25న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలోని ‘జిగితర’ అనే మూడవ సింగిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ శనివారం రాత్రి తిరుపతిలోని ఇందిరా మైదానంలో చాలా గ్రాండ్ గా జరిగింది.

ఈ మ్యూజికల్ ఫెస్ట్ లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడిన మాటలు అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి.

స్టేజ్ పైకి వచ్చిన కిరణ్ అబ్బవరం ముందుగా తిరుపతి వేంకటేశ్వరస్వామి నామస్మరణతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మూడు సంవత్సరాల క్రితం ఇదే స్టేజ్ మీద 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాకు సంబంధించిన ప్రయాణం మొదలుపెట్టానని, ఈ మూడేళ్లలో తన లైఫ్ లో చాలా జరిగాయని గుర్తుచేసుకున్నారు. దేవుడు చాలా అనుగ్రహించాడని, ప్రేక్షకుల ప్రేమ ఎంతో అందిందని చెబుతూ.. ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతిలో అడుగుపెట్టినప్పటి నుంచి తనకు ఒక మంచి వైబ్ కనిపిస్తోందని చెప్పారు.

తన ప్రొడ్యూసర్స్ సాయి రాజేష్, ఎస్కేఎన్, ధీరజ్ ల గురించి మాట్లాడుతూ.. సాధారణంగా ఒక సినిమా లాస్ట్ స్టేజ్ కి వచ్చినప్పుడు ప్రమోషన్ల ఖర్చు తగ్గించుకుందాం అనే డిస్కషన్స్ ఉంటాయని, కానీ ఈ టీమ్ మాత్రం ప్రమోషన్లు ఎంత గట్టిగా చేయాలో చెప్పండి అంటూ ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. ఈ సినిమా ప్రాసెస్ లో డైరెక్టర్ రవి నంబూరి రైటింగ్ చూసి చాలా సందర్భాల్లో ఎమోషనల్ అయ్యానని చెప్పారు.

ఆయన రాసిన కాన్వర్జేషన్స్ ఐదు సంవత్సరాలైనా, ఇంకా చాలా ఏళ్లయినా గుర్తుండిపోతాయని కొనియాడారు. ముఖ్యంగా జూలై 24 (ప్రీమియర్స్) రోజున థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు 30వ నిమిషంలో వచ్చే 'జిగితర' సాంగ్ లీడ్ సీన్ కు అందరికీ గూస్ బంప్స్ వస్తాయని, లేదా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయని ఇది తన గ్యారెంటీ అని సవాల్ చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ గారి గురించి కిరణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. తిరుపతిలోనే చిన్నప్పుడు మణిశర్మ గారి సినిమాలన్నీ చూసి, థియేటర్లలో ఈలలు వేసి, ఆయన ఎప్పుడు కనిపిస్తారా అని అనుకునేవాడినని చెప్పారు.

తిరుపతిలోని కృష్ణతేజ, రామ్ లక్ష్మణ్ థియేటర్లలో 'ఇంద్ర' సినిమా దగ్గరి నుంచి, ప్రతాప్ థియేటర్ లో 'సాంబా', చదలవాడ థియేటర్ లో 'ఒక్కడు' లాంటి సినిమాలకు థియేటర్ల చుట్టూ తిరిగానని గుర్తుచేసుకున్నారు. చిన్నప్పుడు బైరాగిపట్టెడ దగ్గర ఆదివారం ఎప్పుడు హాలిడే ఇస్తారా అని చూస్తూ, స్పీకర్లు ఉన్న ఆటోలను వెతికి మరీ ఎక్కి, అందులో వచ్చే 'చిరుత' క్యాసెట్ లోని పాటలు వినడానికి బైరాగిపట్టెడ నుంచి గ్రూప్ థియేటర్స్ వరకు రౌండ్లు కొట్టేవాడినని చెప్పారు. అలాంటిది ఈ రోజు తన సినిమాకు మణిశర్మ గారు మ్యూజిక్ చేయడం, ఆయన పక్కన నిలబడి మాట్లాడటం తన అదృష్టమని, ఆయన చేసిన లవ్ స్టోరీస్ లో 'ఖుషి' సినిమా తనకు బెస్ట్ వైబ్ ఇచ్చిందని మురిసిపోయారు. అలాగే అనంత్ శ్రీరామ్ గారి లిరిక్స్ కూడా ఈ సినిమాకు మెయిన్ రీజన్ అని థాంక్స్ చెప్పారు.

కో స్టార్ శ్రీ గౌరీ ప్రియ (గౌరి) గురించి చెబుతూ.. ఆమెతో సీన్స్ చేస్తున్నప్పుడు రియల్ గా మాట్లాడుకుంటున్న ఫీలింగ్ కలిగిందని, ఈ సినిమా తర్వాత ఆమెకు చాలా మంచి పేరు వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక 10 నిమిషాల సీక్వెన్స్ లో గౌరి స్క్రీన్ మొత్తాన్ని తినేస్తుందని, మాస్ థియేటర్లలో ఆమె కోసం ప్రేక్షకులు ఈలలు, క్లాప్స్ కొట్టడం ఖాయమని హింట్ ఇచ్చారు.

రెండేళ్ల క్రితం అభిమానులకు ఇచ్చిన మాటను గుర్తుచేస్తూ రాబోయే రోజుల్లో తనను అభిమానిస్తున్నందుకు మీరంతా ప్రౌడ్ గా ఫీల్ అవుతారని అన్నాడు. తిరుపతి వేంకటేశ్వరస్వామి పాదాల సాక్షిగా చెన్నై లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని గట్టి నమ్మకంతో చెప్పాడు. చివరలో యాంకర్ సుమ కోరిక మేరకు తన భార్య రహస్యకు లైవ్ లో కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పడం ఈవెంట్ కే హైలైట్ గా నిలిచింది. జూలై 25న థియేటర్లలో ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూస్తారని కిరణ్ తన స్పీచ్ ముగించాడు.