ఆడియన్స్ ప్రేమే అసలైన అవార్డు.. చెన్నై లవ్ స్టోరీ సక్సెస్‌పై కిరణ్ ఎమోషనల్ కామెంట్స్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తూ థియేటర్లలో సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతోంది.
By: Sravani Lakshmi Srungarapu | 28 July 2026 6:13 PM ISTయంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తూ థియేటర్లలో సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతోంది. శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. ఆడియన్స్ నుంచి వస్తున్న విశేష ఆదరణను పురస్కరించుకుని తాజాగా మేకర్స్ ఘనంగా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు యువ సామ్రాట్ నాగచైతన్య చీఫ్ గెస్ట్ గా హాజరై మూవీ యూనిట్ ను అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కిరణ్ అబ్బవరం తన సినీ జర్నీలో నాగచైతన్య ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి సక్సెస్ ను మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిగా ఆయనను అభివర్ణించిన కిరణ్, తన కెరీర్‌లో మరో ముఖ్యమైన ఘట్టానికి నాగచైతన్య హాజరుకావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే డైరెక్టర్ రవి నంబూరి, రైటర్ సాయి రాజేష్ తనపై ఉంచిన నమ్మకానికి స్పెషల్ థాంక్స్ తెలిపారు. స్టీవెన్ శంకర్ అనే క్యారెక్టర్ ను ఆడియన్స్ కు గుర్తుండిపోయేలా తీర్చిదిద్దినందుకు వారిద్దరికీ ధన్యవాదాలు చెప్పారు.
సినిమా రిలీజైన తర్వాత ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తననెంతో ఎమోషనల్ చేసిందని కిరణ్ వెల్లడించారు. అన్ని వయసుల ఆడియన్స్ థియేటర్లకు వచ్చి కథతో, పాత్రలతో బాండింగ్ ఏర్పరచుకోవడం తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు. ముఖ్యంగా సినిమా చూసిన తర్వాత పలువురు పర్సనల్ గా పంపిన మెసేజ్‌లు, వారి అనుభూతులను పంచుకున్న తీరు తన యాక్టింగ్ కెరీర్లో మరచిపోలేని అనుభవంగా నిలిచిందని చెప్పారు.
ఈ సక్సెస్ కు కారణమైన ప్రతి ఒక్కరికీ కిరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్ నుంచి టెక్నికల్ టీమ్ వరకు, ప్రతి కళాకారుడు తమ వంతు కృషి చేయడం వల్లే ఈ రిజల్ట్ సాధ్యమైందన్నారు. ఆడియన్స్‌తో కిక్కిరిసిన థియేటర్లను చూడడం, సినిమా అయిపోయాక భావోద్వేగంతో బయటకు వస్తున్న వారిని గమనించడం తమ కష్టానికి లభించిన నిజమైన గుర్తింపుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి ఆదరణే ఫ్యూచర్‌లో మరిన్ని మంచి సినిమాలు చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
దీంతో పాటూ సామాజిక బాధ్యతను గుర్తు చేసే సందేశానికి కూడా కిరణ్ ఈ స్టేజ్ ను వాడుకున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రహదారి భద్రతా నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. చివరగా ఆడియన్స్ చూపిస్తున్న అపారమైన ప్రేమ, ఆదరణే తన కెరీర్‌లో మోస్ట్ వాల్యుబుల్ సక్సెస్ అని పేర్కొంటూ మరోసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
