కింగ్‌డమ్‌ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు..
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ సినిమా తమిళనాడులో తీవ్ర వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 8 Aug 2025 3:19 PM ISTటాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ సినిమా తమిళనాడులో తీవ్ర వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. వివాదాల నేపథ్యంలో సినిమాను ప్రదర్శించడానికి వీల్లేదంటూ కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కింగ్‌డమ్ సినిమా థియేటర్లకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి డి. భరత చక్రవర్తి పోలీసులను ఆదేశించారు.
అసలు విషయానికొస్తే కింగ్‌డమ్ సినిమాలో కొన్ని అభ్యంతరకర అంశాలున్నాయంటూ నామ్ తమిళర్ కట్చి పార్టీకి చెందిన కార్యకర్తలు సినిమాను అడ్డుకున్నారు. దీంతో తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్ఎస్ఐ రంగంలోకి దిగి హైకోర్టులో రిట్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ విషయంపై పిటిషనర్ తరపు న్యాయవాది, వాదనల సందర్భంలో సినిమా పోస్టర్లను, ఫ్లెక్సీలను చించేస్తున్న వీడియో ఫుటేజీని కోర్టుకు సమర్పించారు. నామ్ తమిళర్ కట్చి పార్టీకి చెందిన కార్యకర్తలే ఈ సినిమాను అడ్డుకుంటున్నారని, నిరసనకారులు కొన్ని థియేటర్లలోకి వెళ్లి షో పడకుండా అడ్డుకోవడంతో పాటూ ఆడియన్స్ ను సినిమా చూడొద్దని బెదిరించారని ఆరోపించారు.
తమ సినిమా కేవలం కల్పిత కథ ఆధారంగా తెరకెక్కిందని, అందులో సమాజంలోని ఏ వర్గాన్నీ కించపరిచే సీన్స్ లేవని, ఏ వర్గాన్నీ ప్రతి కూలంగా చూపించే ఉద్దేశం తమకు లేదని వాదించారు. దానికి ప్రతి వాదనగా ఎన్‌టీకే పార్టీ తరపు న్యాయవాది, శ్రీలంక తమిళులను వలసదారులు, అక్రమ రవాణాదారులంటూ తప్పుగా చూపించడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను మాత్రమే చేశామని, సినిమాను ఆపేయాలని కానీ నిషేధించాలని కూడా పార్టీ కోరడం లేదని చెప్పారు.
ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ భరత చక్రవర్తి, ప్రజాస్వామ్య దేశంలో కళా స్వేచ్ఛకు ఉన్న ప్రాధాన్యతను వెల్లడించారు. సినిమాలోని కొన్ని అంశాలు కొందరికి నచ్చకపోవచ్చు. కానీ ఆర్టిస్టుల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, నిరసన తెలిపే హక్కు పొలిటికల్ పార్టీలకు ఉన్నప్పటికీ అవి శాంతియుతంగానే ఉండాలని, పోలీసుల పర్మిషన్ తో నిర్దేశిత ప్రాంతాల్లోనే అవి జరగాలని చెప్పారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలను ఎవరూ ఆపలేరని, కోర్టు తీర్పుని ధిక్కరిస్తూ ఎవరైనా సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తగిన భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
