వార్‌లో 'దాదా' బాలకృష్ణ.. 3 నెలల ముందే 'కింగ్' గేమ్ స్టార్ట్!
ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో ముగ్గురు అగ్ర కథానాయకుల మధ్య భారీ పోరు షురూ అయింది.
By: Sivaji Kontham | 9 Sept 2026 5:00 AM ISTఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో ముగ్గురు అగ్ర కథానాయకుల మధ్య భారీ పోరు షురూ అయింది. ఇది నువ్వా నేనా? అంటూ సాగే ఒక భీకర సమరం. టాలీవుడ్ 'కింగ్' అక్కినేని నాగార్జున నటిస్తున్న మైలురాయి చిత్రం 'కింగ్ 100' బరిలోకి దిగుతుండగా, నటసింహం నందమూరి బాలకృష్ణ తన మాస్ యాక్షన్ పవర్ ప్యాక్డ్ 'దాదా' తో పోటీపడుతున్నారు. వీరికి తోడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ `కింగ్`తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. డిసెంబర్ 24నే ఈ ముగ్గురూ తమ సినిమాలను విడుదల చేస్తుండటంతో ఆ తేదీకి దాదాపు మూడు నెలల ముందే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ఆధిపత్య పోరు - బిజినెస్ గేమ్ హోరాహోరీగా ప్రారంభమైంది.
అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 100వ చిత్రంగా 'King100'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ''నాతో డబ్బు లేనప్పుడు లూజర్ అన్నారు.. డబ్బు ఉన్నప్పుడు కింగ్ అన్నారు.. కానీ నా గుర్తింపు డబ్బు కంటే శక్తివంతమైనది'' అనే కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం.. ఒక మనిషి అధికారం - స్వయంకృషితో ఎదిగిన ప్రయాణాన్ని అత్యంత గ్రిప్పింగ్‌గా ఆవిష్కరించబోతోంది. నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ వింగ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటినుంచే థియేటర్ల యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ బాక్సాఫీస్ స్పేస్‌ను సొంతం చేసుకోవడంలో వేగంగా పావులు కదుపుతున్నారు. థియేటర్ల రేసులో మూడు నెలల ముందే కింగ్ హవా చూపిస్తుండటం ఇప్పుడు ఫిలింనగర్ లో చర్చగా మారింది. కంటెంట్ పరంగా ఎమోషన్- క్లాస్- మాస్ ఎలిమెంట్స్ మేళవింపుగా వస్తున్న `కింగ్ 100` పోటీలో నాగార్జునకు మైలేజ్ ఇచ్చేలా కనిపిస్తోంది.
మరోవైపు నందమూరి బాలకృష్ణ `దాదా` రూపంలో భీకరమైన మాస్ పవర్‌తో థియేటర్లపైకి దండయాత్రకు సిద్ధమయ్యారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 1980ల నాటి ముంబై గ్యాంగ్‌స్టర్ కథాంశంతో చారిత్రాత్మక టైమ్‌లైన్ కలయికతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య `కింగ్ ఆఫ్ కేయాస్`గా కనిపించనున్నారు. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్... మాస్ డైలాగ్‌లు.. ముంబై పోలీసులను సైతం శాసించే పవర్‌ఫుల్ డాన్ పాత్రలో బాలయ్య విశ్వరూపం తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ పరంగా భారీ రికార్డులను తిరగరాయడానికి సిద్ధంగా ఉంది. బి, సి సెంటర్లలో బాలకృష్ణకు ఉన్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఈ క్రిస్మస్ రేసులో `దాదా`ను అత్యంత బలీయమైన ప్రత్యర్థిగా నిలబెడుతోంది.
ఈ తెలుగు దిగ్గజాల పోరు మధ్యలోకి బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ `కింగ్` సైలెంట్ గా ఎంట్రీ ఇస్తుండటం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. సుహాస్ వర్మ, సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్ నుండి వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో షారూఖ్ సిల్వర్ హెయిర్ లుక్‌తో సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. ''సౌ దేశోం మే బద్నామ్.. దునియా నే దియా సిర్ఫ్ ఏక్ హి నామ్ - కింగ్'' అనే గ్లోబల్ ప్రొఫైల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు హక్కులను దక్కించుకోవడానికి స్థానిక అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నారు. నార్త్ బెల్ట్ - గ్లోబల్ మార్కెట్‌లో ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తుందనే అంచనాలున్నా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు మార్కెట్‌లో థియేటర్లను దక్కించుకోవడం ఈ బాలీవుడ్ `కింగ్`కి పెద్ద సవాలుగా మారింది.
షారూఖ్ ఖాన్‌కు తన పాన్-ఇండియా స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడానికి - సౌత్ మార్కెట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి `కింగ్` విజయం అత్యంత కీలకం. పఠాన్, జవాన్ చిత్రాలతో సౌత్‌లో భారీ వసూళ్లు రాబట్టిన షారూఖ్ ఈసారి నేరుగా నాగార్జున `కింగ్ 100`, బాలకృష్ణ `దాదా` వంటి పక్కా ప్రాంతీయ దిగ్గజాలతో ఒకే రోజు పోటీపడుతుండటంతో బాక్సాఫీస్ యుద్ధం రసవత్తరంగా మారింది. క్రిస్మస్ పండుగ సీజన్ పెద్ద సినిమాలకు అనుకూలమైనదే అయినా థియేటర్ల కేటాయింపులు, స్క్రీన్ల లభ్యత విషయంలో నాగార్జున పక్కా ప్లానింగ్‌తో ఉండటం.. బాలయ్య మాస్ స్టామినా బలంగా నిలవడం వల్ల తెలుగు గడ్డపై ఈ ముగ్గురు `కింగ్`ల మధ్య సమరం సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది.
