Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: పాప్ కింగ్ మైఖేల్ జాక్స‌న్ ఎమోష‌న‌ల్ లైఫ్‌ జ‌ర్నీ

పాప్ సామ్రాజ్య‌పు చ‌క్ర‌వ‌ర్తి మైఖేల్ జాక్స‌న్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అతడి శ‌రీరంలో అణువ‌ణువు ఒక ప్ర‌కంప‌నం. ఎగ‌సిప‌డే డ్యాన్సింగ్ వేవ్ అత‌డు.

By:  Sivaji Kontham   |   3 Feb 2026 10:38 AM IST
ట్రైల‌ర్ టాక్: పాప్ కింగ్ మైఖేల్ జాక్స‌న్ ఎమోష‌న‌ల్ లైఫ్‌ జ‌ర్నీ
X

పాప్ సామ్రాజ్య‌పు చ‌క్ర‌వ‌ర్తి మైఖేల్ జాక్స‌న్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అతడి శ‌రీరంలో అణువ‌ణువు ఒక ప్ర‌కంప‌నం. ఎగ‌సిప‌డే డ్యాన్సింగ్ వేవ్ అత‌డు. జాక్స‌న్ వేదిక‌పైకి వ‌స్తే అభిమానుల్లో పూన‌కాలే. అత‌డి న‌ర్త‌న చూసి మైమ‌రిచిపోయి పుల‌కించిపోయి కంట‌త‌డి పెట్టే అభిమానులు ల‌క్ష‌లాదిగా ఉంటారు. లైవ్ షోలు కన్నీటి ధార‌ల‌తో త‌డిసి ముద్ద‌యిపోతాయి. అత‌డంటే యూత్ కి పిచ్చి. అమ్మాయిల‌కు వ‌ల‌పు వ‌ల‌. అంత పిచ్చిగా వేరొక నృత్య‌కారుడిని ప్రేమించి ఉండ‌రేమో! అత‌డి న‌ర‌న‌రాన డ్యాన్స్ నిండిపోయి ఉంటుంది. ప్ర‌తి క‌ద‌లికా ఒక నృత్య భంగిమ‌. అందుకే జాక్స‌న్ చ‌నిపోయి ద‌శాబ్ధం గడుస్తున్నా ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ హృద‌య‌సామ్రాజ్యంలో రాజులా ఏల్తూనే ఉన్నాడు. జాక్స‌న్ స్ఫూర్తితో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఎంద‌రో కొరియోగ్రాఫ‌ర్లు అంత‌కంత‌కు ఎదుగుతూనే ఉన్నారు. యువ‌త‌రం డ్యాన్స్ అనే క‌ళ‌ను ఆరాధించ‌డానికి ఆద్యుడు మైఖేల్ జాక్స‌న్.

ఇంత‌టి ఉపోద్ఘాతం ఇప్పుడే ఎందుకు? అంటే.. క‌చ్ఛితంగా దానికి ఒక‌ సంద‌ర్భం ఉంది. ఇప్పుడు మైఖేల్ జాక్స‌న్ జీవిత‌క‌థ‌తో ఐమ్యాక్స్ 3డిలో ఒక అద్భుతం రాబోతోంది. ల‌య‌న్స్ గేట్- యూనివ‌ర్శ‌ల్ పిక్చ‌ర్స్ లాంటి గ్రేట్ హాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లు జాక్స‌న్ బ‌యోపిక్ ని నిర్మిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ బయోపిక్ హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటి. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ``కొంచెం రాజ‌సం.. కొంచెం నిశ్శ‌బ్ధం`` అనే క్యాప్ష‌న్ ప్ర‌కారం.. అత‌డి వ్య‌క్తిగ‌త జీవితం వేరు.. వృత్తిగ‌త జీవితం వేరు అని తెర‌పై చూపిస్తున్నారు. అత‌డి ఫ్యామిలీ లైఫ్ ఆద్యంతం చాలా ఎమోష‌న్స్ తో కూడుకున్న‌ది. అత‌డి బాల్యంలో క‌ష్టాలు గొప్ప ఉద్విగ్న‌త‌తో నిండిన వైనం ఈ ట్రైల‌ర్ లో క‌నిపిస్తోంది. లైవ్ షోలో అత‌డి కోసం ప‌డి చ‌చ్చే అభిమాన జ‌నాన్ని కూడా అద్భుతంగా చూపించారు. ట్రైలర్‌లో కనిపించే ఎరుపు రంగు లెదర్ జాకెట్, గ్లోవ్స్ వంటివి ఎం.జే అభిమానులను ఎమోషనల్ చేస్తున్నాయి.

ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన అన్న కొడుకు జాఫర్ జాక్సన్ పోషిస్తున్నారు. ట్రైలర్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్ మూవ్స్ చూస్తుంటే అచ్చం ఎం.జేని చూసినట్లే ఉందని అభిమానులు ఫిదా అవుతున్నారు.

`ట్రైనింగ్ డే`, `ఈక్వలైజర్` సిరీస్ ఫేమ్ ఆంటోయిన్ ఫుక్వా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బోహేమియన్ రాప్సోడి (ఫ్రెడ్డీ మెర్క్యురీ బయోపిక్) తో అద్భుతమైన సక్సెస్ అందుకున్న గ్రాహం కింగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. కేవలం మ్యూజిక్ లేదా డ్యాన్స్‌కే పరిమితం కాకుండా, మైఖేల్ ఎదుర్కొన్న మానసిక సంఘర్షణలు, ఒత్తిళ్లను కూడా సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ చెబుతోంది. ఆస‌క్తిక‌రంగా ఈ సినిమాలో చాలా బ‌యోపిక్ ల త‌ర‌హాలో ప్రొప‌గాండా కంటెంట్ ని చూపించ‌డం లేదు. ఒరిజిన‌ల్ గా జాక్స‌న్ జీవితంలో ఏం జ‌రిగిందో ఉన్న‌దున్న‌ట్టు చూపిస్తున్నామ‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ట్రేడ్ అంచ‌నాల ప్ర‌కారం ఈ చిత్రం 8300 కోట్లు (1బిలియ‌న్ డాల‌ర్) వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.