Begin typing your search above and press return to search.

అగ్ర హీరోకి ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హ్యాండిచ్చాడా?

ఇటీవల కొన్ని ప్రముఖ ఎంట‌ర్‌టైన్ మెంట్ పోర్టల్స్, అనిరుధ్ రవిచందర్ బిజీ షెడ్యూల్స్ కారణంగా `కింగ్` ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారని కథనాలు ప్రచురించాయి.

By:  Sivaji Kontham   |   31 Oct 2026 9:34 AM IST
అగ్ర హీరోకి ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హ్యాండిచ్చాడా?
X

షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ యాక్షన్ చిత్రం `కింగ్` చుట్టూ ఇప్పుడు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియా వేదికల్లోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. డిసెంబర్ 24న‌ థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నుల్లో ఉంది. అయితే తాజాగా సోష‌ల్ మీడియాల్లో సంగీత దర్శకుడి మార్పు గురించిన వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా డిజిటల్ మీడియాలలో ర‌క‌ర‌కాల‌ కథనాలు వెలువడటం.. దానికి భిన్నంగా అభిమానులు స్పందిస్తుండటంతో ఈ అంశం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇటీవల కొన్ని ప్రముఖ ఎంట‌ర్‌టైన్ మెంట్ పోర్టల్స్, అనిరుధ్ రవిచందర్ బిజీ షెడ్యూల్స్ కారణంగా `కింగ్` ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారని కథనాలు ప్రచురించాయి. చివరి నిమిషంలో అనిరుధ్ తప్పుకోవడం వల్ల సచిన్-జిగర్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం - బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇలాంటి కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..సినిమా నిర్మాణ పురోగతిపైనా.. చివరి నిమిషం మార్పులపైనా ఫ్యాన్స్ మధ్య అనుమానాలు మొదలయ్యాయి.

అయితే ఈ వార్తలను షారూఖ్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. చిత్ర యూనిట్ లేదా నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు అనిరుధ్ నిష్క్రమణపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రెడ్డిట్ , X (ట్విట్టర్) వంటి వేదికలలో చురుగ్గా ఉన్న అభిమానులు చెబుతున్న దాని ప్రకారం.. అనిరుధ్ తన ఒప్పందం మేరకు పనులను పూర్తి చేశారని...ముఖ్యంగా ఈ సినిమాకు అత్యంత కీలకమైన `దే కాల్ హిమ్ కింగ్` థీమ్ ట్రాక్‌ను పూర్తి చేసి షారూఖ్ ఖాన్‌కు అందించిన తర్వాతే తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారని నమ్ముతున్నారు.

ఇక్కడ మీడియా వెలువరించిన వార్తలకు, అభిమానులు నమ్ముతున్న అంశాలకు స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. సినిమా ప్రకటించిన సమయం నుంచే ప్రధాన పాటల బాధ్యతలను సచిన్-జిగర్ ద్వయం పర్యవేక్షిస్తుండగా.. అనిరుధ్ కేవలం బీజీఎం- ప్రత్యేక థీమ్ ట్రాక్ కోసం మాత్రమే పనిచేస్తున్నట్లు ఫ్యాన్స్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల నిర్మాణం సాఫీగా సాగుతున్న సమయంలో `అనిరుధ్ అర్ధాంతరంగా వైదొలిగారు` అని మీడియా చిత్రీకరించడం వెనుక ప్రతికూల ప్రచారం లేదా క్లిక్‌బైట్ వ్యూహాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు.

మొత్తానికి `కింగ్` సినిమా మ్యూజిక్ వర్గాల మార్పు ఒక నిరంతర చర్చగా మారినా.. అనిరుధ్ సగం పనిలోనే తప్పుకున్నారనే ప్రచారంలో నిజం లేదని స్పష్టమవుతోంది. అత‌డు అందించిన ఐకానిక్ థీమ్ స్కోర్‌ను ఆధారం చేసుకుని సచిన్-జిగర్ మిగిలిన నేపథ్య సంగీతాన్ని సమర్థవంతంగా మలచుకుంటున్నారని తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. డిసెంబర్ 24 విడుదల తేదీకి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇటీవ‌ల‌ జైల‌ర్, జైల‌ర్ 2 చిత్రాల‌కు అద్భుత‌మైన బీజీఎంని అందించిన అనిరుధ్ షారూఖ్ `కింగ్` కోసం అదిరిపోయే ట్రాక్ ని అందించి ఉంటార‌ని ఊహిస్తున్నారు. ఓవైపు అనిరుధ్ పెళ్లికి ఏర్పాట్లు సాగుతున్న క్ర‌మంలో ఇలాంటి క్లిక్ బైట్ వార్త‌లు ప్ర‌చారం కావ‌డంపై అతడి అభిమానులు గుర్రుమీద ఉన్నారు.