కింగ్: బ్రహ్మానందం కామెడీ సీన్ కి ఆజ్యం పోసిన అమ్మాయి ఎవరో తెలుసా?
రచయితలు ఒక కథ రాసుకునేటప్పుడు చాలావరకు నిజ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తూ ఉంటారు.
By: Madhu Reddy | 28 Oct 2025 3:00 AM ISTరచయితలు ఒక కథ రాసుకునేటప్పుడు చాలావరకు నిజ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తూ ఉంటారు. అంతేకాదు సినిమా షూటింగ్ సమయంలో అప్పటికప్పుడే ఏదైనా ఐడియా వస్తే.. ఆ ఆలోచనలకు ఆజ్యం పోసి సీన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సినిమాలోని సన్నివేశాలే కాదు పాటలను కూడా అలాగే రూపొందిస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా తాజాగా కింగ్ సినిమాలోని మ్యూజిక్ కాంపిటేషన్ లో బ్రహ్మానందం చేత చేయించిన కామెడీ సీన్ లోని డైలాగ్ లను అప్పటికప్పుడు క్రియేట్ చేసి పెట్టాము అని, దాని వెనుక ఉన్న అసలు విషయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు డైరెక్టర్ శ్రీను వైట్ల.
విషయంలోకి వెళ్తే.. నాగార్జున హీరోగా, త్రిష హీరోయిన్ గా బ్రహ్మానందం, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించిన చిత్రం కింగ్. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. కామెడీకి యాక్షన్ జోడించి.. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచడంలో నంబర్ వన్ స్థానంలో నిలిచిన శ్రీనువైట్ల ఈ సినిమాలో బ్రహ్మానందంతో కామెడీ సీన్స్ ను ఏ విధంగా తెరకెక్కించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సంగీతంలో ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా.. అన్నీ తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య పాత్రలో తన నటనతో అందరినీ అబ్బురపరిచారు బ్రహ్మానందం.
సినిమాలో సింగర్స్ కాంపిటీషన్ కి జడ్జిగా వచ్చి అన్ని తెలిసినట్లు సలహాలు సూచనలు ఇచ్చే ఎపిసోడ్ సినిమాలోనే బెస్ట్ కామెడీ సీన్స్ లో ఒకటి అని చెప్పవచ్చు. అందులో ఒక సింగర్ పాడుతుంటే.. మ్యూజిక్ డైరెక్టర్ జయ సూర్య తప్పులు పడుతూ ఉంటారు. హిందోళంలో 'రి' ఏది? అని అడిగి నవ్వుల పాలవుతాడు బ్రహ్మానందం. అయితే దానిని కప్పిపుచ్చుకునేందుకు ఏవేవో సాకులు చెబుతాడు. ఈ సన్నివేశం మొదట అనుకున్న షెడ్యూల్లో లేదట. సెట్స్ లో మాటల సందర్భంగా హిందోళం రాగం గురించి చర్చ జరిగినప్పుడు.. దర్శకుడు అప్పటికప్పుడు ఈ సీన్ క్రియేట్ చేసి పెట్టినట్లు ఒకానొక సందర్భంలో తెలిపారు. అయితే ఇప్పుడు ఆ విషయం మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఇందులో హిందోళంలో రి ఉండదు సార్ అని చెప్పిన అమ్మాయి ఎవరు? అని నెటిజన్స్ కూడా ఆరా తీస్తున్నారు. మరి దీనిపై డైరెక్టర్ ఏ విధంగా క్లారిటీ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.
శ్రీను వైట్ల మాట్లాడుతూ.. "ఎక్కువగా నేను ఆర్టిస్టులతో సరదాగా గడుపుతూనే సీన్స్ తీస్తూ ఉంటాను. అలా సీన్ లో భాగంగా.. బ్రహ్మానందం కాంపిటీషన్ కి వస్తాడు. అప్పుడు ఒక అమ్మాయి పాట పాడాలని మాత్రమే అనుకున్నాము. అయితే ఆ సన్నివేశంలో ఒక నిజమైన సింగర్ తో చేయిస్తే బాగుంటుందని ఒక ప్రొఫెషనల్ సింగర్ ను పిలిపించాము. దీని గురించి మాట్లాడుతూ.. షో కి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ సింగర్స్ మిస్టేక్ చూపిస్తూ.. తన ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంటాడు. అయితే అతడికి ఏమీ తెలీదు. కరెక్ట్ గా పాడిన ఏదో ఒక సాకు చెబుతాడు అని ఆమెకు సీను వివరించాను. అయితే అప్పుడే హిందోళం గురించి నేను అమ్మాయితో చెబుతూ ఉంటే.. ఆ అమ్మాయి ఆ రాగంలో రి వుండదు అని చెప్పింది. దాంతో అప్పటికప్పుడు ఆ సీన్ రాసుకొని తీశాను. అది చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. అయితే ఈ సీను రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు డీఎస్పీ కూడా నన్ను పిలిచి భయ్యా మీకు హిందోళంలో రి ఉండదని ఎలా తెలుసు? అని అడిగాడు.. అయితే జరిగిందంతా నేను చెబితే ఆయన ఒక్కసారిగా నవ్వేశాడు" అంటూ ఆ సీన్ తీయడం వెనుక ఉన్న నేపథ్యాన్ని శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు.
అప్పటివరకు హిందోళంలో రి ఉండదు అనే పదం తనకు కూడా తెలియదని..ఆ అమ్మాయి చెప్పడం వల్లే తనకు తెలిసింది అని.. అమ్మాయి చాలా మంచి సింగర్ అంటూ అమ్మాయి పై ప్రశంసలు కురిపించారు . అంతే కాదు అమ్మాయి చెప్పిన ఒక చిన్న పాయింట్ తో ఆ సీన్ క్రియేట్ చేసి థియేటర్లలో నవ్వులు పూయించిన డైరెక్టర్ పై కూడా నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
