అక్కినేని ఫ్యామిలీ క్లాష్.. దసరా రేస్‌లో తండ్రీ-కొడుకుల పోటీ!
ఈ ఏడాది దసరా పండగ బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాలతో సందడిగా మారబోతోంది. ప్రీ-దసరా నుంచి పండగ ముగిసే వరకు పలువురు బడా హీరోలు తమ సినిమాలతో థియేటర్లను ముంచెత్తేందుకు సిద్ధమవుతున్నారు.
By: Madhu Reddy | 18 Aug 2026 7:00 PM ISTఈ ఏడాది దసరా పండగ బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాలతో సందడిగా మారబోతోంది. ప్రీ-దసరా నుంచి పండగ ముగిసే వరకు పలువురు బడా హీరోలు తమ సినిమాలతో థియేటర్లను ముంచెత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో అక్కినేని నాగార్జున, నాగచైతన్యల సినిమాలు కూడా దసరా రేసులో పోటీపడే అవకాశాలు కనిపిస్తుండటంతో అక్కినేని ఫ్యాన్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే పండగ సీజన్‌ను టార్గెట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
దసరా రేసులో 'కింగ్ 100', 'వృషకర్మ' :
కింగ్ నాగార్జున ప్రస్తుతం తన మైలురాయి చిత్రం 'కింగ్ 100' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను దసరాకే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక మరోవైపు అక్కినేని నాగచైతన్య నటిస్తున్న 'వృషకర్మ' మూవీ కూడా దసరా బరిలోనే నిలవాలని చూస్తోంది. అయితే విఎఫ్ఎక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల పూర్తికావడంపైనే చైతూ సినిమా విడుదల ఆధారపడి ఉంది.
తండ్రీకొడుకుల మధ్య పోటీ ఉంటుందా?:
ఒకే కుటుంబానికి చెందిన నాగార్జున, నాగచైతన్య తమ సినిమాలను ఒకేసారి దసరాకు తీసుకువస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వీరిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే రేసులో ఉంటారని, ఇద్దరి పోటీ ఉండకపోవచ్చని కొందరి అంచనా. ఇక ఒకవేళ ఇద్దరూ దసరాకే వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద తండ్రీకొడుకుల ఆసక్తికర సమరం చూడవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.
చిరంజీవి 'విశ్వంభర' తుది నిర్ణయం:
ఈ దసరా పోటీలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం 'విశ్వంభర' అక్టోబర్ 16న విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక ఒకవేళ మెగాస్టార్ సినిమా దసరా బరిలో ఖాయమైతే, నాగార్జున మరియు నాగచైతన్య తమ విడుదల తేదీలను మార్చుకుని దసరా రేసు నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పోటీలో ఇతర బడా హీరోలు:
ప్రీ-దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న నాని నటించిన 'ది పారడైజ్', అక్టోబర్ 2న వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47' రాబోతున్నాయి. ఇక వీటితో పాటు దసరా సెలవుల్లో అక్టోబర్ 15న రజనీకాంత్ 'జైలర్ 2' సందడి చేయనుంది. ఓటీటీ డీల్స్, బిజినెస్ సమీకరణల ఆధారంగా సెప్టెంబర్ మొదటి వారానికి దసరా ఫైనల్ రిలీజ్ చార్ట్ స్పష్టం కానుంది.
ఈ సారి దసరా పండగ బాక్సాఫీస్ వద్ద మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా మారేలా ఉంది. అక్కినేని హీరోల తుది నిర్ణయం ఏంటో తెలియాలంటే సెప్టెంబర్ మొదటి వారం వరకు వేచి చూడాల్సిందే.
