మా పోస్టర్ పీకేసి ఆ పోస్టర్ వేశారు.. ప్రమోషన్స్ కష్టాలు చెప్పిన హీరో
కికు యనమల హీరోగా, కాశిష్ ఖాన్ హీరోయిన్‌గా తెరకెక్కిన సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ 'కికు చిరంజీవి'. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దీప్తి నడిమింటి నిర్మించిన ఈ చిత్రానికి సుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించారు.
By: M Prashanth | 25 Aug 2026 3:33 PM ISTకికు యనమల హీరోగా, కాశిష్ ఖాన్ హీరోయిన్‌గా తెరకెక్కిన సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ 'కికు చిరంజీవి'. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దీప్తి నడిమింటి నిర్మించిన ఈ చిత్రానికి సుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమాలో ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, వివా రాఘవ కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 28న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో కికు యనమల ప్రమోషన్స్ టైమ్ లో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
తమలాంటి కొత్తవాళ్ల సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తున్న మీడియా వాళ్లే తనకు దేవుళ్లు అని కికు తన స్పీచ్ మొదలుపెట్టారు. ఈ సినిమా కోసం ఇండస్ట్రీలోని పెద్ద యాక్టర్స్ ఎంతో సపోర్ట్ చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, అలీ, తనికెళ్ల భరణి, ఈశ్వరి రావు లాంటి సీనియర్ నటులు ఈ ప్రాజెక్ట్ లో నటించడమే కాకుండా, సినిమా బాగుందంటూ తమ వంతుగా ప్రమోషనల్ వీడియోలు చేసి ఇవ్వడం తనకు ఎంతో హెల్ప్ అయిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
సినిమా ప్రమోషన్స్ కోసం కాలేజ్ టూర్లు ప్లాన్ చేసినప్పుడు ఒక చేదు అనుభవం ఎదురైందని కికు చెప్పారు. ముందుగా హైదరాబాద్ లోని ఒక పేరున్న కాలేజ్ లో ఈవెంట్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారట. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో తిరిగి ప్రమోషన్స్ చేసుకుని మళ్లీ హైదరాబాద్ వచ్చారు. తీరా ఈవెంట్ కోసం ఆ కాలేజ్ వాళ్లను సంప్రదిస్తే వాళ్ల వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదని, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని ఆయన బాధపడ్డారు.
ఇటీవల అదే వేదికలో జరిగిన ఒక భారీ సినిమా ఈవెంట్‌ను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఒక పెద్ద సినిమా కోసం ఏకంగా 75 వేల మందితో ఈవెంట్ చేసిన ఆ యాజమాన్యం, తన కోసం ఒక చిన్న ఆడిటోరియంలో కనీసం ఏడొందల మందితో ఈవెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం తనను ఎంతో కలచివేసిందని కికు తన మనసులోని మాటను బయటపెట్టారు.
థియేటర్ల దగ్గర పోస్టర్ల విషయంలో కూడా తనకు ఇలాంటి పరిస్థితే ఎదురైందని ఆయన వివరించారు. ముచ్చటపడి తన సినిమా పోస్టర్ చూసుకుందామని ఒక థియేటర్ కు వెళితే, అక్కడ తన పోస్టర్ తీసేసి 'టాక్సిక్' సినిమా పోస్టర్ వేశారని ఆయన చెప్పారు. ఇది ఆ సినిమా టీమ్ చేసిన పని కాదని, థియేటర్ వాళ్లే తన పోస్టర్ తీసేశారని ఆయన స్పష్టం చేశారు. ఆ పాన్ ఇండియా సినిమా పెద్ద హిట్ అవ్వాలని తాను కూడా కోరుకుంటానని, కానీ తన పోస్టర్ పక్కనపెట్టినా బాగుండేదని, అంత చులకనగా తీసి పక్కన పడేయడం బాధనిపించిందని అన్నారు.
ఒక సినిమాను మొదలుపెట్టడం నుంచి దాన్ని ప్రమోట్ చేసుకుని థియేటర్ల వరకు తీసుకురావడంలో ప్రతి దశలోనూ ఎన్నో పోరాటాలు చేశామని కికు చెప్పారు. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా ఎక్కడా వెనక్కి తగ్గకుండా సినిమాను ముందుకు తీసుకొచ్చామని అన్నారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్లు ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ముందే తెలుసుకుని, టాలెంట్ ఉంటే ధైర్యంగా రావాలని ఆయన సూచించారు. ఇన్ని కష్టాలు దాటుకుని ఆగస్టు 28న వస్తున్న తమ సర్వైవల్ డ్రామా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
