ముంబై డాన్ తో హీరోయిన్ వార్నింగ్.. లైవ్ లోనే గుట్టు విప్పిన టీమ్
కికు యనమల హీరోగా నటించిన సర్వైవల్ థ్రిల్లర్ 'కికు చిరంజీవి' ఈ నెల 28న థియేటర్లలోకి రాబోతోంది.
By: M Prashanth | 25 Aug 2026 3:33 PM ISTకికు యనమల హీరోగా నటించిన సర్వైవల్ థ్రిల్లర్ 'కికు చిరంజీవి' ఈ నెల 28న థియేటర్లలోకి రాబోతోంది. దీప్తి నడిమింటి నిర్మాతగా, సుభ సాయి వెంకట్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాశిష్ ఖాన్ హీరోయిన్ గా నటించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్, రీసెంట్ గా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో సినిమా గురించి, అలాగే షూటింగ్ టైమ్ లో ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడారు.
ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత దీప్తి నడిమింటి మాట్లాడుతూ.. తమ సినిమాలో హీరోయిన్ గా నటించిన కాశిష్ ఖాన్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాశిష్ ఇంతకుముందు రెండు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదని, కానీ తన సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇచ్చామని దీప్తి చెప్పారు. షూటింగ్ సమయంలో హీరోయిన్ కొంత ఇబ్బంది పెట్టిందని ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. "ఆమెకు మేనేజర్ లేరు, నాకే ఆ అవకాశం కావాలని అడిగితే నమ్మి ఇచ్చాము. కానీ తర్వాత కొంత ఇబ్బంది పడ్డాము" అని దీప్తి వివరించారు.
అవుట్ డోర్ షూటింగ్ లో కూడా కొన్ని డిమాండ్స్ చేస్తూ ఇబ్బంది పెట్టిందని, ఒక దశలో క్యారవాన్ లో నుంచి దిగనని చెప్పిందని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె అడిగిన అగ్రిమెంట్ ప్రకారమే పేమెంట్లు కూడా ఇచ్చుకుంటూ వచ్చామని, ప్రమోషన్స్ లో పాల్గొంటే ఇవ్వాల్సిన 1 లక్షా 4 వేల రూపాయలు కూడా ఇస్తామని చెప్పాము. అది అగ్రిమెంట్ లో క్లియర్ గా ఉందని కూడా దీప్తి చెప్పారు. కానీ ప్రమోషన్స్ కు రాకముందే ఆ డబ్బులు అడిగిందని, ముందే ఇవ్వకపోతే రానని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ కు కూడా రాలేదని దీప్తి ఆవేదన వ్యక్తం చేశారు.
దీప్తి స్పీచ్ తర్వాత మాట్లాడిన హీరో కికు యనమల కూడా ఈ విషయంపై స్పందించారు. ముంబైలో ఠాకూర్ అనే ఒక డాన్ ఉన్నాడని, అతన్ని అడ్డుపెట్టుకుని హీరోయిన్ బెదిరింపులకు పాల్పడిందని కికు ఆరోపించారు. "ఆ ఠాకూర్ అనేవాడు ఎవరో నాకు తెలియదు. కానీ అతను కెరీర్ నాశనం చేస్తానని బెదిరిస్తున్నాడట" అని కికు అసహనం వ్యక్తం చేశారు.
ఆ ముంబై డాన్ కు హీరో కికు యనమల గట్టి వార్నింగ్ ఇచ్చారు. "తమ్ముడు ఠాకూర్.. ఈ వీడియో నువ్వు చూస్తున్నావో లేదో నాకు తెలియదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో. తెలుగు అమ్మాయిల గురించి ఏమైనా తేడాగా మాట్లాడితే ముంబై వచ్చి మరీ చెప్పు తీసుకుని కొడుతుంది" అని కికు ఘాటుగా స్పందించారు. ఎవరి కెరీర్ ను ఎవరూ నాశనం చేయలేరని, ముఖ్యంగా తెలుగు అమ్మాయి కెరీర్ ను అసలు ఎవరూ ఏం చేయలేరని ఆయన స్పష్టం చేశారు.
హీరోయిన్ కు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ గురించి నిర్మాత దీప్తి చివర్లో ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రమోషన్స్ కు రాని కారణంగా ఆమెకు ఇవ్వాల్సిన 1 లక్షా 4 వేల రూపాయలను తిరుపతి తిరుమల దేవస్థానంలో చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్స్ కోసం నడుస్తున్న ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చేస్తున్నట్లు చెప్పారు. ఆమెకు ఆ డబ్బును ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతూ, తమ సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ఆమె ముగించారు.
