అప్పుడలా.. ఇప్పుడిలా.. సుదీప్ 'వారణాసి'కి ఓకే చెప్పారా?
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.. వారణాసి మూవీలో యాక్ట్ చేస్తున్నారా?.. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 19 Feb 2026 9:00 PM ISTకన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.. వారణాసి మూవీలో యాక్ట్ చేస్తున్నారా?.. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల క్రితం ఇతర భాషా సినిమాల్లో కన్నడ నటులను క్యామియో, అతిథి పాత్రల కోసం ఉపయోగించుకుంటున్నారని, కానీ అదే సహకారం కన్నడ చిత్రాలకు దక్కడం లేదని వ్యాఖ్యానించిన ఆయన ఇప్పుడు వారణాసిలో యాక్ట్ చేస్తున్నారని వార్తలు రావడం చర్చనీయాంశమైంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో సుదీప్ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని కొన్ని గంటలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఆ మూవీ షూటింగ్ లోనూ పాల్గొంటున్నారని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ కిచ్చా సుదీప్ విషయంపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే సుదీప్ కు రాజమౌళితో ఉన్న అనుబంధం కొత్తదేం కాదు. గతంలో ఈగ సినిమాలో ఆయన చేసిన ఇంటెన్స్ విలన్ రోల్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆ పాత్రతో సుదీప్ కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అలాగే బాహుబలి: ది బిగినింగ్ మూవీలో ఆయన గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. దీంతో మరోసారి ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుందన్న వార్త.. సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది.
అదే సమయంలో సుదీప్ ఇటీవల చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కన్నడ నటులు ఇతర భాషా సినిమాల్లో అతిథి పాత్రలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, కానీ అదే స్థాయిలో ఇతర ఇండస్ట్రీల నుంచి సహకారం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వ్యక్తిగతంగా అడిగినా కొందరు స్టార్ హీరోలు, తమ సినిమాల్లో చిన్న పాత్రలు చేయడానికి ముందుకు రావడం లేదని ఆరోపించారు.
కానీ తాను తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో ఎన్నోసార్లు అతిథి పాత్రలు చేశానని, కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్ షిప్ కోసం ఏకంగా పారితోషికం కూడా తీసుకోకుండా నటించానని సుదీప్ చెప్పడం గమనార్హం. అలాంటి వ్యాఖ్యల తర్వాతే ఇప్పుడు వారణాసిలో ఆయన నటిస్తున్నారన్న వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది. దీంతో అప్పుడు అలా అన్న సుదీప్.. ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారా? అన్న ప్రశ్న అందరిలో తలెత్తుతోంది.
అయితే రాజమౌళి సినిమాల్లో పాత్ర చిన్నదైనా ఎఫెక్ట్ మాత్రం ఎక్కువే ఉంటుంది. కాబట్టి సుదీప్ నిజంగానే వారణాసిలో భాగమైతే.. సినిమాకు మెయిన్ అసెట్స్ లో ఒకటిగా నిలుస్తుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే అసలు క్లారిటీ రానుంది. అప్పటివరకు గాసిప్ గా మిగిలినా.. ఫ్యాన్స్ మాత్రం ఆ కాంబో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
