Begin typing your search above and press return to search.

వరుస ప్లాప్స్.. అయినా టాలీవుడ్ సినిమాకి నో!

సినిమా ఇండస్ట్రీలో కియారా అద్వానీ అడుగు పెట్టి దశాబ్ద కాలం దాటినా సాలిడ్ కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకోలేక పోయింది.

By:  Ramesh Palla   |   3 Oct 2026 3:00 PM IST
వరుస ప్లాప్స్.. అయినా టాలీవుడ్ సినిమాకి నో!
X

సినిమా ఇండస్ట్రీలో కియారా అద్వానీ అడుగు పెట్టి దశాబ్ద కాలం దాటినా సాలిడ్ కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకోలేక పోయింది. చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్స్‌గా మిగిలాయి. కెరీర్‌ ఆరంభంలో కాస్త పర్వాలేదు అనిపించుకున్నా, సక్సెస్‌ రేటు బాగానే ఉన్నా ఈ మధ్య కాలంలో ఆమె నుంచి వచ్చిన సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. కేవలం స్కిన్‌ షో కే కియారా అద్వానీ పరిమితం అవుతోంది అంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కియారా పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. అయితే లక్‌ కలిసి రాకపోవడంతో కియారా హిట్‌ దక్కించుకోలేక పోయింది. కియారా చివరగా హిట్‌ కొట్టిన మూవీ అంటే ఆమె అభిమానులు సైతం వెంటనే చెప్పలేని పరిస్థితి ఉంది. అయినా కూడా బాలీవుడ్‌లో వరుసగా సినిమా ఆఫర్లను కియారా దక్కించుకుంటూనే ఉంది.

కియారా అద్వానీ తెలుగు సినిమాలు...

టాలీవుడ్‌లో కియారా అద్వానీ ఇప్పటి వరకు భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్‌ ఛేంజర్‌ సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. మొదటి సినిమాలో మినహా మిగిలిన రెండు సినిమాలో డిజాస్టర్‌ ప్రో లుగా నిలిచిన విషయం తెల్సిందే. అయినా కూడా తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ఈమెతో వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారట. గేమ్‌ ఛేంజర్ వంటి డిజాస్టర్‌, ఇటీవల టాక్సిక్‌ వంటి ఫెయిల్యూర్‌ తర్వాత కూడా ఒక బడా తెలుగు నిర్మాత ముంబై వెళ్లి కియారా అద్వానీతో తన సినిమా విషయమై చర్చించాడని, పెద్ద హీరోతో కలిసి నటించేందుకు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించాడనే వార్తలు వస్తున్నాయి. ఒప్పుకుంటే దర్శకుడు వచ్చి కథ చెప్తాడని కియారా అద్వానీతో సదరు నిర్మాత చెప్పాడట. ప్రస్తుతం తెలుగు సినిమాలు చేసే ఉద్దేశం లేదని సున్నితంగా పెద్ద సినిమా ఆఫర్‌ను కియారా తిరస్కరించినట్లు ముంబై వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

బాలీవుడ్‌లో వరుస సినిమాలతో...

కియారా అద్వానీ బాలీవుడ్‌లోనూ పెద్ద ప్రాజెక్ట్‌లు, స్టార్‌ హీరోల సినిమా ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. హిందీలో మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న కియారా అద్వానీ తెలుగులో ఎందుకు సినిమాలు చేయను అంటుంది అనే విషయమై అర్థం కాక ఇండస్ట్రీ వర్గాల వారు జుట్టు పీక్కుంటున్నారు. తెలుగులో కియారా అద్వానీకి చేదు అనుభవం ఎదురైన కారణంగా దూరంగా ఉండాలి అనుకుంటుందా లేదంటే మరోసారి ఫెయిల్యూర్‌ ఎందుకు అనే ఉద్దేశంతో ముందస్తుగానే ఫెయిల్యూర్‌ను ఊహించుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. కియారా అద్వానీ లుక్స్ పరంగా ఎంతో మంది స్టార్‌ హీరోయిన్స్‌ కంటే బెటర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆమెతో వర్క్ చేసేందుకు స్టార్‌ హీరోలు, ఫిల్మ్‌ మేకర్స్ ఆసక్తిగా ఉన్నారు. ఆమె ఆ అందంతోనే ఇండస్ట్రీలో ఇన్నాళ్లు కొనసాగుతోందని చాలా మంది అంటూ ఉంటారు.

రణ్వీర్‌ సింగ్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ సినిమాల్లో కియారా..

ప్రస్తుతం కియారా అద్వానీ హిందీలో రెండు సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ప్రధానంగా రణ్వీర్‌ సింగ్‌తో చేస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరో వైపు సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలోనూ కియారా అద్వానీ లీడ్‌ రోల్‌కి ఎంపిక అయిందని తెలుస్తోంది. రణ్వీర్‌ సింగ్‌తో సినిమా అంటే పర్వాలేదు కానీ, సైఫ్‌ అలీ ఖాన్‌ మూవీలో నటించడం ఏంటో అంటూ కొందరు ఆమె అభిమానులు పెదవి విరుస్తున్నారు. హిందీలో చిన్నా చితకా సినిమాలు చేస్తూ, పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు చేసే బదులు టాలీవుడ్‌, కోలీవుడ్‌, ఇతర భాషల నుంచి వచ్చే పెద్ద స్టార్స్‌ సినిమా ఆఫర్‌ను కమిట్‌ కావచ్చు కదా అని చాలా మంది ఆమెకు సోషల్‌ మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆమె తన వ్యూహంతో ముందుకు సాగుతుంది.

రాబోయే రెండేళ్ల వరకు కియారా అద్వానీ కేవలం హిందీ సినిమాల్లో మాత్రమే నటించే అవకాశాలు ఉన్నాయని ఆమె సన్నిహితులు అంటున్నారు. తెలుగు మాత్రమే కాకుండా ఇతర సౌత్‌ భాషల్లోనూ కియారా నటించేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. వరుస ఫ్లాప్స్‌ పడ్డా ఇలా బెట్టు చేస్తూ కూర్చోవడం ఏంటో అంటూ చాలా మంది ఆమెపై విమర్శలు చేస్తున్నారు.