రెండో ఫ్రెగ్నెన్సీ గ్లో.. కియరా స్టన్నింగ్ ఫోటోషూట్!
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9'లో సందడి చేశారు. రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో బేబీ బంప్‌తో కియారా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇదే షోలో 'టాక్సిక్' ఫలితంపై స్పందించిన ఆమె, సినిమా ఆశించిన విజయం సాధించకపోవడం బాధించిందని, తన నటనకు ప్రశంసలు రావడం ఊరటనిచ్చిందని తెలిపారు.
By: Sivaji Kontham | 12 Nov 2026 9:28 AM ISTబాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న వేళ.. కరణ్ జోహార్ పాపులర్ టాక్ షో `కాఫీ విత్ కరణ్ సీజన్ 9`లో సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన అందమైన ఫోటోలను కియారా తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ప్రెగ్నెన్సీ గ్లో ఇప్పుడు నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ``అదే కౌచ్.. కానీ మా లిటిల్ ప్లస్ వన్‌తో ఒక కొత్త అధ్యాయం`` అంటూ క్యాప్షన్ ని ఇవ్వగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో సింగిల్‌గా.. ఆ తర్వాత భార్యగా.. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వబోతూ అదే షోకు రావడం ఒక అందమైన ప్రయాణమని ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ షోలో బేబీ బంప్‌పై చిన్న స్టార్ గుర్తు ఉన్న రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్‌లో కియారా ఎంతో గ్లామరస్‌గా.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోయారు. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి బేబీ బంప్‌ను పట్టుకుని దిగిన ఫోటోల్లో తన ముఖంలో తల్లి కాబోతున్న ఆనందం.. సహజమైన అందం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ డ్రెస్‌పై ఉన్న లిటిల్ స్టార్.. రెండో బిడ్డ రాకకు సమయమాసన్నమైందని చెబుతున్నట్టుగా ఉండటం ఎపిసోడ్‌కే హైలైట్‌గా మారిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇక ఇదే టాక్ షోలో యశ్ హీరోగా నటించిన భారీ చిత్రం `టాక్సిక్` బాక్సాఫీస్ ఫలితంపైనా కియారా తొలిసారిగా మౌనం వీడారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడం మొదట తన హృదయాన్ని కలచివేసిందని కియారా ఆవేదన వ్యక్తం చేశారు. తొలి వీకెండ్‌లో ఆ రిజల్ట్ చూసి చాలా బాధపడ్డానని... అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా తన కంఫర్ట్ జోన్ దాటి చేసిన `నాడియా`పాత్రకు.. తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కడం కొంత ఊరటనిచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.
అలాగే ఈ చిత్రంలో యశ్‌తో కలిసి నటించిన బోల్డ్ - ఇంటిమేట్ సీన్లపై వచ్చిన ట్రోలింగ్, విమర్శల గురించి కూడా కియారా స్పష్టతనిచ్చారు. ఆ విమర్శలను తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అసలు పట్టించుకోలేదని.. కనీసం ఆ విషయాన్ని తమ మధ్య ప్రస్తావించలేదని కియారా తెలిపారు. సిద్ధార్థ్ ఎంతో పరిణతితో.. ప్రశాంతంగా వ్యవహరించడం వల్ల తనకూ ఆ విమర్శలపై స్పందించాల్సిన.. వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదనిపించిందని కియరా పేర్కొన్నారు.
