ఆలియా, దీపికా లిస్ట్ లోకి కియారా కూడా!
అమ్మతనం లైఫ్ మొత్తాన్ని మార్చేస్తుంది. అప్పటివరకు ఒకలా ఉంటే ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా మారాక తమ జీవితం మొత్తం మారిపోతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 11 Aug 2025 12:00 AM ISTఅమ్మతనం లైఫ్ మొత్తాన్ని మార్చేస్తుంది. అప్పటివరకు ఒకలా ఉంటే ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా మారాక తమ జీవితం మొత్తం మారిపోతుంది. ప్రతీ విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచించి, ఎంతో జాగ్రత్తలుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సెలబ్రిటీలు కూడా అందుకు అతీతులు కాదు. ఈ విషయాన్ని ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు బహిరంగంగా వెల్లడించిన విషయం తెలిసిందే.
కూతురు పుట్టాక చాలా మార్పులొచ్చాయని ఆలియా భట్ చెప్తే, కూతురు పుట్టిందనే కారణంతో పర్సనల్ లైఫ్ కు మరింత టైమ్ కేటాయించాలని దీపికా పడుకొణె ఆలోచించి, తన కూతురు కోసం సినిమాల ఎంపిక విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లోకి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా వచ్చింది.
కియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హోత్రా జులైలో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మదర్‌హుడ్ ను ఎంజాయ్ చేస్తున్న కియారా కూతురు పుట్టాక తన జీవితమే మారిపోయినట్టు రీసెంట్ గా ఓ పోస్ట్ చేశారు. కూతురితో ఎంతో విలువైన సమయాన్ని గడుపుతున్న కియారా తన కూతురి గురించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నేను నీ డైపర్లు మారుస్తున్నాను. నువ్వేమో నా ప్రపంచాన్నే మార్చేశావ్.. ఈ డీల్ చాలా బావుందంటూ ఓ కొటేషన్ ఉన్న ఫోటోని తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయడమే కాకుండా హ్యాండ్స్ తో హార్ట్ సింబల్, కళ్లలో నీళ్లు తిరిగే ఎమోజీలను షేర్ చేశారు. షేర్షా సినిమా టైమ్ లో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారగా 2023లో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లైన రెండేళ్లకి రీసెంట్ గా వారికి ఓ పాప పుట్టింది.
సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కూతురితో బిజీగా ఉన్న కియారా నటించిన వార్2 సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో హృతిక్ కు జోడీగా కియారా నటించారు. దీంతో పాటూ యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమాలో కూడా కియారా నటిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన పరమ్ సుందరి ఆగస్ట్ 29న రిలీజ్ కానుంది.
