Begin typing your search above and press return to search.

వీడియో: కొంప ముంచిన‌ కియ‌రా AI స్మైల్

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన ప్రత్యేక దుస్తులలో కియారా అద్వానీ, కరణ్ జోహార్ కలిసి ర్యాంప్‌పై సందడి చేశారు.

By:  Sivaji Kontham   |   17 Jun 2026 12:15 PM IST
వీడియో: కొంప ముంచిన‌ కియ‌రా AI స్మైల్
X

ప్రస్తుత ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. ఈ సరికొత్త టెక్నాలజీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. అయితే సాంకేతిక రంగంలో AI ఉద్యోగాలకు గండి కొడుతుంటే... అటు గ్లామర్ ప్రపంచంలో ప్రముఖ నటి కియారా అద్వానీ తన `AI నవ్వు`తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇటీవలి ఒక ఫ్యాషన్ ఈవెంట్‌లో ఈ క్యూటీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూసిన నెటిజన్లు.. ఇది నిజమైన నవ్వా లేక పక్కాగా డిజైన్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నవ్వా? అంటూ స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.

ఫ్యాషన్ ప్రపంచంలో ర్యాంప్ వాక్ చేయడం అనేది చూసేవారికి అందంగా కనిపించినా... అది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. వందలాది మంది ప్రేక్షకులు..పదుల సంఖ్యలో కెమెరా కళ్ల ముందు ఎలాంటి తడబాటు లేకుండా పర్‌ఫెక్ట్‌గా నడవడం ఒక పెద్ద కళ. అక్కడ మోడల్స్ తమ మనసులో ఎలాంటి భావాలు ఉన్నా వాటన్నింటినీ దాచి, ముఖంపై ఒక కృత్రిమమైన (ఆర్టిఫిషియల్) నవ్వును కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. తాజా రెడ్ కార్పెట్ ఈవెంట్లో కియ‌రా మోములో న‌వ్వులు చూసిన వారికి ఏమిటా కృత్రిమ న‌వ్వులు.. ఏఐ తెచ్చిన న‌వ్వా ఇది? అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన ప్రత్యేక దుస్తులలో కియారా అద్వానీ, కరణ్ జోహార్ కలిసి ర్యాంప్‌పై సందడి చేశారు. మెర్సిడెస్ కార్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా జరిగిన ఈ షోలో కియారా ప్రదర్శించిన హావభావాలు, ఆ నవ్వు నెటిజనుల్లో మ‌ద‌నానికి కార‌ణ‌మ‌య్యాయి.

ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం కియారా అద్వానీ ధరించిన బ్లాక్ కలర్ గౌన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్‌లు లక్ష్మి లెహర్, కాశిష్ గౌర్ దీనిని స్టైలింగ్ చేయగా, లేఖ గుప్తా మేకప్, నికితా మీనన్ హెయిర్ స్టైలింగ్ చేసారు. ఆఫ్‌-షోల్డర్ డిజైన్‌తో కూడిన ఈ గౌన్ కియారాకు ఒక ప్రిన్సెస్ లుక్‌ను తీసుకువచ్చింది. ప్రముఖ పెయింటర్ విన్సెంట్ వాన్ గోహ్ సృష్టించిన `ది స్టారీ నైట్` పెయింటింగ్‌తో పాటు ప్రకృతి సిద్ధమైన రంగురంగుల పూల డిజైన్లను ఈ గౌన్‌పై చేతితో పెయింట్ చేయడం విశేషం. మహేష్ నోతందాస్, స్టూడియో రెన్ సంస్థలకు చెందిన వజ్రాల ఆభరణాలు కియ‌రా అందాన్ని మరింత రెట్టింపు చేశాయి.

కియారాతో పాటు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ కూడా ఈ షోలో షోస్టాపర్‌గా నిలిచారు. రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన నలుపు రంగు సూట్‌లో ఆయన ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. సముద్రపు అలలను తలపించేలా మెరిసే సీక్విన్ డిజైన్‌, స్టార్ ఫిష్ ఆకారం ఈ సూట్ ప్రత్యేకత. దీనికి తోడుగా డైమండ్ నెక్లెస్, వింటేజ్ సన్ గ్లాసెస్ ధరించి కరణ్ జోహార్ ర్యాంప్‌పై పవర్‌ఫుల్ వాక్‌తో అలరించారు. అయితే ఈ ఇద్దరి స్టార్ల ప్రదర్శనలో కియారా అద్వానీ చిరునవ్వే అందరినీ అమితంగా ఆకర్షించి...సోషల్ మీడియాలో `AI స్మైల్` అంటూ వైరల్‌గా మారింది.

ఇక కెరీర్ విషయానికి వస్తే.. కియారా అద్వానీ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కన్నడ సూపర్‌స్టార్ యష్ సరసన గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన `టాక్సిక్` సినిమాలో నాడియా అనే కీలక పాత్రలో కియ‌రా నటించింది. ఈ పాత్రకు కియారా మాత్రమే పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని దర్శకురాలు ప్రశంసించారు. దీనితో పాటు తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి జానపద కథల నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రం `వివాన్`లోనూ నటిస్తోంది. తొలుత మే నెలలో విడుదల కావాల్సిన ఈ చిత్రం... రక్షాబంధన్ కానుకగా 28ఆగస్ట్ 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు సినిమాలతో...ఇటు ర్యాంప్ వాక్స్‌- స్మైల్ తో కియారా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది.