ఖుష్బూ కుమార్తె పెళ్లి వేడుకలో టాలీవుడ్ స్టార్లు
ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్, దర్శకుడు సుందర్ సి ల కుమార్తె అవంతిక సుందర్ వివాహం గోవాలో అత్యంత వైభవంగా.. అదే సమయంలో చాలా సింపుల్‌గా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.
By: Sivaji Kontham | 26 Jun 2026 9:20 AM ISTప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్, దర్శకుడు సుందర్ సి ల కుమార్తె అవంతిక సుందర్ వివాహం గోవాలో అత్యంత వైభవంగా.. అదే సమయంలో చాలా సింపుల్‌గా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. నిజానికి ఈ వివాహం చెన్నైలో ఎంతో ఘనంగా... భారీ ఎత్తున జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ అవంతికకు `క్రౌడ్ అలర్జీ` (ఎక్కువ మంది జనం ఉంటే వచ్చే ఇబ్బంది) ఉండటం వల్లే ఈ వేడుకను చాలా ప్రైవేట్‌గా, పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య నిర్వహించాల్సి వచ్చింది. పెళ్ళికొడుకు తరపున ఒక 20 మంది, పెళ్ళికూతురు తరపున ఒక 20 మంది.. ఇలా మొత్తం కేవలం 25 నుండి 50 మంది లోపు అతిథులను మాత్రమే ఈ వేడుకకు అనుమతించారు.
అయితే పెళ్లి చాలా సింపుల్‌గా జరిగినా చెన్నైలో జరగబోయే `వెడ్డింగ్ రిసెప్షన్` మాత్రం అత్యంత గ్రాండ్‌గా, కన్నుల పండువగా నిర్వహించాలని ఖుష్బూ సుందర్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది వారి ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం. పైగా ఖుష్బూ సౌత్ ఇండియాలోనే మోస్ట్ పాపులర్ స్టార్ హీరోయిన్‌గా, రాజకీయ నాయకురాలిగా మంచి గుర్తింపు కలిగి ఉన్నారు.
ఈ వివాహ వేడుక కోసం ఖుష్బూ కుటుంబం దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వంటి ఎందరో దేశ, రాష్ట్ర స్థాయి రాజకీయ ప్రముఖులను.. సినీ పరిశ్రమకు చెందిన టాప్ సెలబ్రిటీలను స్వయంగా కలిసి ఆహ్వానించారు. కుమార్తెకున్న ఇబ్బంది దృష్ట్యా పెళ్లి వరకూ ఫ్యాన్స్ ను కాస్త అడ్జస్ట్ అవ్వమని చెప్పిన ఖుష్బూ.. త్వరలోనే చెన్నైలో చిత్ర పరిశ్రమ- రాజకీయ వర్గాల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున రిసెప్షన్ ను జరపడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
గోవాలో వైభవంగా జరిగిన పెళ్లికి విచ్చేసిన టాప్ గెస్ట్స్ లో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులు, నాగార్జున- అమల దంపతులు, వెంకటేష్- నీరజ దంపతులు కనిపించారు. ముఖ్యంగా ఈ పెళ్లి వేడుకలో త్రిష తన విశ్వంభర కథానాయకుడు మెగాస్టార్ సరసన కూచుని ప్రధాన ఆకర్షణగా మారారు. అయితే త్రిషతో పాటు విజయ్ కలిసి ఉన్న ఫోటోలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఈ వివాహ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానించే క్రమంలో ఖుష్బూ సుందర్ కుటుంబం తమిళనాడు ముఖ్యమంత్రి -తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత `విజయ్`ను స్వయంగా కలిసి ఆహ్వానించారు. అయితే పెళ్లి వేడుక నుంచి విజయ్ ఫోటోగ్రాఫ్స్ ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇప్పటివరకూ త్రిషకు సంబంధించిన ఫోటోలు బయటపడినా, ఇంకా తమిళనాడు సీఎం విజయ్ ఉన్న ఫోటో బయటకు రాలేదు.
