సౌత్ ఇండస్ట్రీలో 40 ఏళ్ల ప్రయాణం!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ సినిమా రంగంలో అడుగుపెట్టి విజయవంతంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
By: Srikanth Kontham | 15 Aug 2026 7:06 PM ISTదక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ సినిమా రంగంలో అడుగుపెట్టి విజయవంతంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఓ భావోద్వేగ లేఖను రాశారు. దశాబ్దాలుగా తనను ఆదరిస్తూ.. వెన్నంటి నిలిచిన ప్రేక్షకులకు ఖుష్బూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భం అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
టాలీవుడ్‌లో వెంకటేష్ సరసన నటించిన అరంగేట్ర చిత్రం `కలియుగ పాండవులు` (1986) జ్ఞాపకాలను ఖుష్బూ నెమరువేసుకున్నారు. బాలనటిగా ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరో యిన్‌గా ఎదిగే వరకు తన వెనుక ఎంతోమంది శ్రేయోభిలాషులు ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించిన తీరును ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో తాను ఎన్నో ఒడిదుడుకులు, మలుపులు చూశానని ఖుష్బూ వెల్లడించారు. కెరీర్ ఆరంభంలో ఎదురైన సవాళ్లను దాటుకుంటూ భాషలతో సంబంధం లేకుండా తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ పరిశ్రమలలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రేక్షకులు తనపై చూపిన ప్రేమ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని కుష్బూ ఆవేదనతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేసారు. సినిమా రంగంలో నటీనటుల కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుందనే అపోహలను బద్ధలు కొడుతూ ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగడం సాధారణ విషయం కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నటిగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, రాజకీయ నాయకురాలిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ప్రతి రంగంలోనూ కుష్బూ చూపిన తెగింపు .. అంకితభావం ఎంతోమంది యువ నటీమణులకు స్ఫూర్తిని ఇస్తుంది.
40 ఏళ్ల ప్రయాణంలో వెన్నుతట్టి ప్రోత్సహించిన దర్శకులు, నిర్మాతలు, తోటి నటీనటులు , ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రేక్షకులను అలరించేలా వైవిధ్యమైన పాత్రలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అభిమానులు తనపై చూపిన అభిమానం భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా పని చేయడానికి శక్తిని ఇస్తోందని పేర్కొన్నారు.
నాలుగు దశాబ్దాల కెరీర్ ని పూర్తి చేసుకోవడం కేవలం ఆమె వ్యక్తిగత విజయమే కాదు. దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో సువర్ణాధ్యాయం. కాలం ఎంత మారినా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన కుష్బూ ప్రయాణం రాబోయే తరాలకు అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
