నటి ఖుష్బూ అల్లుడిని చూసారా! అతడు ఏం చేస్తుంటాడు?
కానీ అవంతిక, శ్రవణ్‌ల వివాహం అందుకు భిన్నంగా కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులైన కొద్దిమంది మిత్రుల సమక్షంలో చాలా ప్రశాంతంగా జరిగింది.
By: Sivaji Kontham | 26 Jun 2026 10:50 PM ISTప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్- దర్శకుడు సుందర్ సి ల ఇంట్లో వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. వారి కుమార్తె అవంతికా సుందర్ వివాహం శ్రవణ్ శ్రీనివాసన్‌తో జరిగినట్లు ఖుష్బూ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఖుష్బూ కుమార్తె పెళ్లి అనగానే, అల్లుడు ఎవరు? ఎలా ఉన్నాడు? అతడు ఏం చేస్తాడో! అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్ర నటిగా, రాజకీయ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఖుష్బూ సుందర్ - ప్రముఖ దర్శకుడు సుందర్ సి ల ఇంట్లో గత కొంతకాలంగా పండుగ వాతావరణం నెలకొంది. తమ కుమార్తె అవంతికా సుందర్ వివాహం శ్రవణ్ శ్రీనివాసన్‌తో 25 జూన్ 2026న ఘనంగా జరిగింది. ఈ సంతోషకరమైన వార్తను ఖుష్బూ సోషల్ మీడియా షేర్ చేస్తూ.. తల్లిదండ్రులుగా తాము అనుభవిస్తున్న ఆనందాన్ని, భావోద్వేగాలను వ్యక్తపరచడానికి మాటలు సరిపోవడం లేదని ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. వివాహ బంధాలు స్వర్గంలో నిర్ణయించబడతాయనే నమ్మకాన్ని ఈ వేడుక మరోసారి నిజం చేసిందని పేర్కొన్నారు.
సాధారణంగా సినీ ప్రముఖుల ఇంట్లో పెళ్లిళ్లు అంటే వేలాది మంది అతిథులు, భారీ హంగూ ఆర్భాటాలతో జరుగుతుంటాయి. ఇటీవల డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటే జనం నోరెళ్లబెడుతున్నారు. కానీ అవంతిక, శ్రవణ్‌ల వివాహం అందుకు భిన్నంగా కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులైన కొద్దిమంది మిత్రుల సమక్షంలో చాలా ప్రశాంతంగా జరిగింది. కొత్త దంపతులు తమ వివాహాన్ని ఎలాగైతే ఊహించుకున్నారో.. వారి ఇష్టప్రకారమే ఈ వేడుకను నిర్వహించినట్లు ఖుష్బూ తెలిపారు. కొన్నిసార్లు జీవితంలో అత్యంత అందమైన క్షణాలను మనకు బాగా నచ్చిన వారితో.. ఎంతో నిశ్శబ్దంగా షేర్ చేసినప్పుడే దానికి నిజమైన సార్థకత లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
తమ కళ్ల ముందే కూతురు పెళ్లి పీటలు ఎక్కి ఒక కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంటే ప్రతి తల్లిదండ్రుల హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఖుష్బూ దంపతులు కూడా ఆ సమయంలోని ఆత్మీయతకు, అక్కడ వ్యక్తమైన ప్రేమాభిమానాలకు ముగ్ధులయ్యారు. ఆ మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ తమ కళ్లు ఇప్పటికీ ఆనంద బాష్పాలతో చెమరుస్తున్నాయని.. గుండెలు కృతజ్ఞతాభావంతో నిండిపోయాయని ఖుష్బూ రాసుకొచ్చారు. ఈ వేడుకను తాము అనుకున్నదానికంటే ఎంతో అద్భుతంగా, మర్చిపోలేని విధంగా తీర్చిదిద్దిన వివాహ వేడుకల నిర్వహణ సంస్థలకు (స్పైస్ వెడ్డింగ్స్ - జీటీ హాలిడేస్) వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
కొత్త జంటకు బాలీవుడ్ - సౌత్ సెలబ్రిటీల శుభాకాంక్షలు
ఖుష్బూ సుందర్ పెట్టిన ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల నుండి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కొత్త జంటకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే దక్షిణ భారత నటీనటులు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, త్రిష, శ్రియా శరన్, ప్రముఖ యాంకర్ దివ్యదర్శిని (డీడీ) తో పాటు కుటుంబ సభ్యులు, తోటి నటీనటులు ఎందరో ఈ కొత్త జంటపై ప్రేమాభిమానాలను కురిపిస్తూ దేవుడి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
సరికొత్త అధ్యాయం -అభిమానుల ఆశీస్సులు
అవంతిక - శ్రవణ్ తమ జీవితంలో ఒక అద్భుతమైన సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో వారి జీవితం నిండా ఆనందం, తోడు, మరెన్నో మధురమైన జ్ఞాపకాలు నిలవాలని ఖుష్బూ కోరుకున్నారు. తమ కుమార్తె, అల్లుడికి అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నూతన వధూవరుల ఫోటోలను అభిమానుల ముందుకు తెచ్చారు. ఖుష్బూ కుమార్తె వివాహ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి. అభిమానులు కూడా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఖుష్బూ సుందర్ అల్లుడు శ్రవణ్ చెన్నైకి చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ అని తెలుస్తోంది.
